logo

లావాదేవీలు రూ.3 కోట్లు

వారు సాధారణ మహిళలు.. కానీ రుణాలిప్పిస్తామంటూ వారి నుంచి బ్యాంకు ఖాతాలకు అవసరమైన వివరాలు తీసుకున్న ఘనులు ఆ అతివలను వ్యాపార దిగ్గజాలుగా మార్చారు.

Updated : 29 Feb 2024 06:41 IST

‘ఇల్లెందు’ మహిళల ఖాతాల్లో అసాధారణ రీతిలో నగదు బదిలీలు

ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: వారు సాధారణ మహిళలు.. కానీ రుణాలిప్పిస్తామంటూ వారి నుంచి బ్యాంకు ఖాతాలకు అవసరమైన వివరాలు తీసుకున్న ఘనులు ఆ అతివలను వ్యాపార దిగ్గజాలుగా మార్చారు. తెలియకుండా కరెంట్ ఖాతాలు తెరచి కేవలం రెండు నెలల వ్యవధిలో రూ.కోట్ల లావాదేవీలు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి సదరు ఖాతాల్లో పలుమార్లు నగదు జమ, ఉపసంహరణలు పూర్తయిపోయాయి.

 ఇల్లెందు మండలం సంజయ్‌నగర్‌కు చెందిన ఆఫ్రిన్‌, సల్మా, నాజియా, సంధ్య, సౌజన్య అనే అయిదుగురు మహిళల నుంచి వివరాలు సేకరించిన ఓ మహిళ, మరికొందరు అపరిచితులు ఖమ్మంలో వారికి తెలియకుండా ఓ బ్యాంకు ఖాతాలు తెరిచి పెద్ద మొత్తంలో నగదు జమ చేసిన విషయం విదితమే.  ఈ వ్యవహారంలో రోజులుగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న బ్యాంకు అధికారులు ఎట్టకేలకు ఖాతాల స్టేట్‌మెంట్ల వివరాలందించారు. అయిదుగురివీ కరెంట్‌ ఖాతాలనే విషయం తేలింది. 2023 డిసెంబరు నుంచి బుధవారం వరకు వాటిల్లో సాగిన లావాదేవీలు వెలుగుచూశాయి. ఖాతాదారుల పేర్ల చివర అసోసియేట్స్‌, ట్రేడర్స్‌, ఎన్‌పోర్స్‌, ఎగ్జిమ్‌ పేరిట లావాదేవీలు నడిపారు.

  • ముందస్తు సమాచారంతో తొలుత తెరిచిన ఓ బ్యాంకు ఖాతాల నుంచి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున డబ్బులు బదిలీ చేశారు.
  •  మహిళలకు తెలియకుండా ఖమ్మంలో తెరిచిన మరో బ్యాంకు ఖాతా (కరెంట్) ద్వారా అసలు లావాదేవీలు నడిపించారు. పలు ట్రేడర్ల పేరిట ఒక్కొక్కరి ఖాతాలో కనిష్ఠంగా నిత్యం రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు నగదు జమ కావడం, రోజుల వ్యవధిలో ఉపసంహరణలు జరిగాయి.
  •  మొత్తంగా దశలవారీగా రూ.3.29 కోట్ల నగదు జమయింది. ఇందులో రూ.28 వేలు మినహా మిగిలినదంతా ఇప్పటికే ఉపసంహరణ చేశారు.
  •  ప్రస్తుతం ముగ్గురి ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌ ఉంది. సౌజన్య ఖాతాలో రూ.19 వేలు, సంధ్య ఖాతాలో రూ.9 వేలు నిల్వలున్నట్టు బ్యాంకు స్టేట్‌మెంట్లలో వెలుగుచూసింది.

    ఇప్పుడైనా స్పందించండి: యూనస్‌, సల్మా భర్త

మా కుటుంబ సభ్యుల పేరిట బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తూ రూ.లక్షల్లో లావాదేవీలు జరుగుతున్నాయని ఇల్లెందు, ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు రూ.కోట్లలో లావాదేవీల సాగినట్టు అందుకు సంబంధించిన వివరాలు బ్యాంకు అధికారులిచ్చారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలి.


‘ఈనాడు’ కథనాలపై కలెక్టరేట్ వర్గాల ఆరా..

మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.లక్షల్లో జమ అయిన వైనంపై ‘ఈనాడు’లో ఈ నెల 22న ‘ఎవరివి? ఎక్కడివి?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అనంతరం అనుబంధ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ కార్యాలయ అధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా లీడ్‌ బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రాంరెడ్డిని ‘న్యూస్‌టుడే’ ఈ విషయమై వివరణ కోరగా ‘ఈనాడు’లో కథనాల్లో అంశాలను విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించిన మాట వాస్తవమే అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని