logo

పది, ఇంటర్‌ పరీక్షలకు హెలికాప్టర్లో పత్రాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ డివిజన్‌లోని సుక్మా, దంతెవాడ, బీజాపూర్‌ జిల్లాల సరిహద్దులోని జేగురుగొండ గ్రామంలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్న పది, ఇంటర్‌ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను బుధవారం హెలికాప్టర్లో పంపించారు

Published : 29 Feb 2024 05:52 IST

ప్రశ్నపత్రాలను తరలించిన హెలికాప్టర్‌

చర్ల, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ డివిజన్‌లోని సుక్మా, దంతెవాడ, బీజాపూర్‌ జిల్లాల సరిహద్దులోని జేగురుగొండ గ్రామంలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్న పది, ఇంటర్‌ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను బుధవారం హెలికాప్టర్లో పంపించారు. బస్తర్‌ పరిధిలోని ఈ ప్రాంతం తీవ్ర నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో సుక్మా నుంచి జేగురుగొండకు పరీక్ష పత్రాలను ప్రభుత్వం వాయుమార్గంలో పంపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడకు హెలికాప్టర్లో ప్రశ్నపత్రాలను అధికారులు పంపించారు. జిల్లా కేంద్రం నుంచి అత్యంత మావోయిస్టు ప్రభావిత జేగురుగొండ గ్రామం 94 కి.మీ. దూరంలో ఉంటుంది. గతంలో ఇక్కడి విద్యార్థులు పరీక్షలు రాసేందుకు మూడు, నాలుగు రోజుల ముందు 60 కి.మీ. దూరంలోని డోర్నపాల్‌కు వెళ్లేవారు. దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉండి పరీక్షలు రాసేవారు. గతేడాది నుంచి జేగురుగొండలో పరీక్షా కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 34 మంది విద్యార్థులు సొంత గ్రామంలోనే పరీక్షలు రాయనున్నారు. పదో తరగతి విద్యార్థులు 14 మంది, 12వ తరగతి విద్యార్థులు 20 మంది ఇక్కడి కేంద్రంలో పరీక్షలు రాయబోతున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని