logo

ఆరోగ్య అవగాహనే ప్రధానం

స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆరోగ్య అవగాహనే ప్రధానమని.. తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ రెండేళ్ల కిందట ఉత్తర్వులు జారీ చేసింది

Published : 29 Feb 2024 05:57 IST

నాయుడుపేటలో సమావేశమైన ఎస్‌హెచ్‌జీ మహిళలు
ఖమ్మం బల్లేపల్లి, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆరోగ్య అవగాహనే ప్రధానమని.. తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ రెండేళ్ల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలకు ఆరోగ్యంపై అవగాహన ఉంటే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటారని.. తప్పని సరిగా నెలలో రెండో సమావేశం నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని నిబంధన తీసుకొచ్చింది.

 స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సమావేశాలు రెండేళ్ల కిందటి వరకు నెలకోసారి జరిగేవి. ఈ సమావేశంలో ఆర్థిక లావాదేవీలపై చర్చలు జరిగేవి. పొదుపు, బ్యాంకు లింకేజీ, రుణ వాయిదాల చెల్లింపులు వంటి అంశాలపై మాట్లాడుకోవడానికి సమావేశాలు నిర్వహించేవారు. మహిళల్లో ఆరోగ్యం, సామాజిక చైతన్యం కల్పించాలనే లక్ష్యంతో నెలలో రెండో సమావేశం సైతం నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో సంఘాల మహిళలు నెలలో రెండుసార్లు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

 ప్రాధాన్యం పెరిగితే మేలు

నెలలో మొదటి సమావేశంలో ఆర్థిక అంశాలు ఉంటాయి కాబట్టి సభ్యులందరూ హాజరవుతున్నారు. అయితే రెండో సమావేశంలో ఆరోగ్య, సామాజిక విషయాలు ఉండటంతో సంఘాల సభ్యులు తక్కువగా పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించి ద్వితీయ సమావేశాలు పకడ్బందీగా నిర్వహించినప్పుడే మహిళల ఆరోగ్య అవగాహనతో పాటు ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.

ద్వితీయ సమావేశంలోని అంశాలు..

ప్రతినెలా నిర్వహించే ద్వితీయ సమావేశంలో ఆరోగ్యమే ప్రధాన అంశంగా ఉంటుంది. ఎస్‌హెచ్‌జీ ల్లోని మహిళలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చర్చించాలి. ఆరోగ్య సిబ్బందిని ఆహ్వానించి సూచనలు, సలహాలు తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలి. ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో కూరగాయలు పండించే విధానంపై అవగాహన కల్పించాలి. వంటింట్లో చెత్తని ఎరువుగా వాడుకునే విధానం తెలపాలి. హరితహారంలో భాగంగా పండ్ల మొక్కలు పెంచేలా ప్రోత్సహించాలి. సేంద్రియ పద్ధతిలో పండించిన నాణ్యమైన కూరగాయలు, పండ్లు తీసుకునేందుకు వీలుంటుంది. కౌమార బాలికలకు అవగాహన, బాలింతలు, గర్భిణులు పాటించాల్సిన జాగ్రత్తలు, బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించడం, బాల్య వివాహాలు నిరోధించటం, వృద్ధుల సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది.


వివరాలు నమోదు చేస్తున్నాం..
- దర్గయ్య, డీఆర్‌డీఏ (ఐబీ), ఖమ్మం

ఎస్‌హెచ్‌జీ ద్వితీయ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని నిబంధనలు ఉన్నాయి. నెలలో జరిగే రెండు సమావేశాలను నమోదు చేస్తున్నాం. ఆరోగ్యంతోపాటు పలు అంశాలపై సంఘాల మహిళలకు చైతన్యం కలిగించే చర్చలు జరగాలని, అందరూ పాల్గొనేలా చూడాలని మా సిబ్బందిని ఆదేశించాం. గ్రామాల్లో జరిగే సామాజిక కార్యక్రమాల్లో మహిళలు పాల్గొనేలా ప్రోత్సహిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని