logo

దాతలు లేనిచోట వెతలే.

పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉమ్మడి జిల్లాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గత నెల రోజుల నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు

Published : 29 Feb 2024 05:59 IST

పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉమ్మడి జిల్లాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గత నెల రోజుల నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా పరీక్షలు సమీపిస్తున్న సమయంలో విద్యార్థులకు పాఠశాలల్లో ఆకలి బాధలు తప్పడం లేదు.  విరామ సమయాల్లో అల్పాహారం ఏర్పాట్లు చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

ఇల్లెందు, న్యూస్‌టుడే: ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటల వరకు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ఈ తరగతుల్లో పాఠ్యాంశాల పునఃశ్చరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రత్యేక తరగతుల కోసం విద్యార్థులు నిర్దేశించిన సమయం కంటే ముందుగానే పాఠశాలలకు వస్తున్నారు. సాయంత్రం ఇల్లు చేరేసరికి సుమారు 6.30 నుంచి గంటలవుతుంది. విద్యార్థులు మధ్యాహ్నం తినే భోజనంతోనే సాయంత్రం వరకూ వేచిఉండాల్సిన పరిస్థితి.

నిధుల కొరత..

గతంలో ప్రభుత్వం పది విద్యార్థులకు అల్పాహారం కోసం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిధులు మంజూరు కాలేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం ఉసే లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకుని దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అల్పాహారం అందిస్తున్నారు. ఎలాంటి ప్రోత్సాహం లేని పాఠశాలల్లో మాత్రం సాయంత్రం వరకు విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థులు ఆసక్తి చూపించలేకపోతున్నారని, సాయంత్రానికి నీరసించి పోతున్నారని కొంతమంది ఉపాధ్యాయులంటున్నారు.

ఇదీ అవసరం...

విద్యార్థులకు పోషకాహారం సమకూరిస్తే చదువులపై శ్రద్ధ చూపుతారు. కిచిడీ, బాదంపాలు, బిస్కెట్లు తదితర ఇతర బలవర్ధక పదార్థాలు అందించటం ద్వారా ఉత్సాహంగా ఉంచొచ్చని వైద్య నిపుణులంటున్నారు. సమయానికి తగిన ఆహారం అందిస్తే ఆసక్తితో చదివి, మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని