logo

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు జిల్లాలో బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.

Published : 29 Feb 2024 06:03 IST

ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని శ్రీచైతన్య కళాశాల పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు జిల్లాలో బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఖమ్మం నగరంలోని రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ వద్ద ప్రశ్నపత్రాలు తీసుకెళ్తున్న అధికారులకు డీఐఈఓ తగిన సూచనలు చేశారు. ఉదయమే విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో కేంద్రాల వద్ద కన్పించారు. పరీక్ష కేంద్రాల గుర్తింపులో పలువురు విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. వెలుగుమట్లలోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల కేంద్రంలో పరీక్ష రాయాల్సిన విద్యార్థిని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న శ్రీచైతన్య కేంద్రానికి రావడంతో ఇబ్బందికి గురయ్యారు. వెంటనే వెలుగుమట్లలో ఉన్న పరీక్ష కేంద్రానికి పంపారు.

 కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌.. పిండిప్రోలు జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సందర్శించారు. వెలుగుమట్లలోని ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల, పెద్దతండాలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాల, కేజీబీవీ నాయుడుపేట, దరిపల్లి అనంతరాములు ఇంజినీరింగ్‌ కళాశాలల పరీక్ష కేంద్రాలను డీఈఐఓ కె.రవిబాబు సందర్శించారు.

 తొలిరోజు 900 మంది విద్యార్థులు గైర్హాజరు.. జనరల్‌ విభాగంలో మొత్తం 16,919 మందికి 16,286 మంది హాజరయ్యారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొత్తం 2,580 మందికి 2,313 మంది హాజరు కాగా 267 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 19,499 మందికి 18,599 మంది హాజరు కాగా 900 మంది గైర్హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని