logo

చేపా చేపా.. ఈ పాపం ఎవరిది?

చేపా.. చేపా ఈ పాపం ఎవరిది అంటే ఏం చెబుతాô? నిలువెల్లా నిర్లక్ష్యాన్ని నింపుకొని, నిలువెత్తు అవినీతి ఆరోపణల్ని ఒంటిపై పులుముకున్న మత్స్య శాఖదా? నిబంధనల్ని నీళ్లలో కలిపేస్తూ.. జనం హక్కుల్ని కాలరాస్తూ.. అర్ధరాత్రి వేళలో అడ్డగోలుగా కాసుల వేట సాగించిన గుత్తేదారుదా?

Updated : 29 Feb 2024 06:48 IST

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: చేపా.. చేపా ఈ పాపం ఎవరిది అంటే ఏం చెబుతాం? నిలువెల్లా నిర్లక్ష్యాన్ని నింపుకొని, నిలువెత్తు అవినీతి ఆరోపణల్ని ఒంటిపై పులుముకున్న మత్స్య శాఖదా? నిబంధనల్ని నీళ్లలో కలిపేస్తూ.. జనం హక్కుల్ని కాలరాస్తూ.. అర్ధరాత్రి వేళలో అడ్డగోలుగా కాసుల వేట సాగించిన గుత్తేదారుదా? చెంతనున్న చెరువులో జలపుష్పాలు పెంచి, పోషించి, వాటిని అంటి‘పట్టుకుని’ జీవించమని ఇచ్చిన హక్కును గుండుగుత్తగా దారాదత్తం చేసిన సంఘ పాలకవర్గానిదా? స్థానికుల్లో అసహనం కట్టలు తెంచుకుని గట్టుపైకి దూసుకొస్తుంటే ఒడ్డున నిల్చుని చేష్టలుడిగి చూస్తున్న పోలీసు శాఖదా? చిమ్మచీకట్లో ప్రైవేటు మూకలు చెరువుపై నిల్చుని భయపెడుతుంటే వెనకడుగు వేయకుండా వేట కోసం పరుగులెత్తిన స్థానికులదా..? రోజులుగా చెరువు నీళ్లలో వివాదాల సుడిగుండాలు తిరుగుతున్నా, ఉపద్రవంగా మారుతున్నా చక్కదిద్దకుండా ముసుగేసిన అధికార యంత్రాంగానిదా? నేరం ఎవరిదైనా ఘోరం జరిగిపోయింది. నేలకొండపల్లి మండల పరిధిలోని చెరువుమాదారం షాజీదా చెరువులో చేపల వేటకు వెళ్లిన దాసరి శివ(25) తీవ్ర గాయాలతో విగత జీవిగా పడి ఉండటం ఒక్కసారిగా కలకలం రేపింది.


 మత్స్య శాఖ బాధ్యతారాహిత్యం

మత్స్య సొసైటీ సభ్యులే చెరువు మాదారం చెరువులో చేపలు వేటాడాలి. వాటిని అమ్ముకోవాలి. మత్య్స సహకార సంఘం పాలకవర్గంలో కొందరి అసమర్థత, అవినీతి కారణంగా వేటను ఓ గుత్తేదారుకు అప్పగించారు. బైలా ప్రకారం సభ్యులు కాకుండా ఇతర వ్యక్తులు మత్స్య శాఖ అనుమతి లేకుండా చెరువులో వెళ్లటానికి వీల్లేదు. అలా వెళ్తే నిరోధించే బాధ్యత ఆ శాఖదే. ఇక్కడ అదీ జరగలేదు.


సర్వం గుత్తేదారే.. సర్వస్వం ఆయనకే

చేపల వేటలో గుత్తేదారు ప్రమేయమే అస్సలు ఉండొద్దు. ఇక్కడ అంతా తానై నడిపించాడు. గుత్తేదారు అనుచరుడైన సంఘ సభ్యుడు రాత్రి వేళల్లోనే పూర్తిగా వేట సాగించాడు. నిజానికి చీకట్లో వేట నిషిద్ధం. ఎందుకంటే జాలర్లకు ప్రమాదాలు సంభవిస్తే జరిగే ప్రాణనష్టం ఎక్కువ. ఇక్కడ పక్షం రోజులుగా రాత్రి వేటే సాగింది. రెండు రోజులు విరామమిచ్చి మంగళవారం మళ్లీ మొదలుపెట్టాడు. ఆ రోజు పగటి వేళలో చిన్న చేపలు పట్టడంతో చెరువు ఈడుబోయిందనే ప్రచారం జరిగింది. దీంతో రాత్రిపూట వందలాదిమంది ఎగబడ్డారు.

ఆందోళన చేస్తున్న స్థానికులతో మాట్లాడుతున్న ఎస్సై నాగరాజు


శవమై తేలిన యువకుడు
చెరువులోనే కొట్టిచంపారని స్థానికుల ఆందోళన

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: నేలకొండపల్లి మండలం చెరువుమాదారం షాజీదా చెరువులో చేపల కోసం వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికుల కథనం ప్రకారం.. చెరువులో చేపల వేట సాగించేందుకు ఈ నెల 14న జిల్లా మత్స్యశాఖ అధికారులు సహకార సంఘానికి అనుమతిచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా సంఘ పాలకవర్గం ఓ గుత్తేదారుకు మత్స్య సంగ్రహణ బాధ్యతలప్పగించింది. కొన్ని రోజులుగా వేట సాగుతున్నా సభ్యులకు చేపల పంపిణీ చేయకపోవటం, స్థానికులకు విక్రయించకపోవడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గుత్తేదారు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని ఓ తండాకు చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తుల్ని కాపలాగా ఉంచాడు. వారికి రోజు రూ.వెయ్యి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాత్రివేళల్లో వారి సాయంతో వేట సాగిస్తున్నాడు. దీంతో స్థానికులు రెండుమూడు సార్లు చెరువులో చేపల్ని లూటీ చేశారు. జలాశయం ఒట్టిబోయిందనే సమాచారంతో మంగళవారం రాత్రి కూడా వివిధ గ్రామాలకు చెందిన సుమారు 300 మంది చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ పోలీసులు, ప్రైవేటు సైన్యం వారిని బెదరగొట్టారు. ఈ క్రమంలో ప్రైవేటు సైన్యం దుడ్డుకర్రలు, కారం సాయంతో దాడికి పాల్పడినట్లు గ్రామస్థులు ఆరోపించారు. వారికి దొరకని కొందరు వేట సాగించారు. చెరువుమాదారానికి చెందిన దాసరి శివ(25) బుధవారం తెల్లవారుజామున నీటిలో విగత జీవిగా తేలి ఉండటాన్ని అక్కడివారు గుర్తించారు. ఒంటిపై గాయాలు ఉండటం, చనిపోయిన చోట రక్తపు మడుగు కనిపించటంతో ఇది హత్యేనని, మూకుమ్మడి దాడిలో చనిపోయాడని స్థానికులు ఆరోపించారు. ఉదయాన్నే సమాచారమందుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువులోంచి తరలించాలని యత్నించగా కట్టపైనే మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు నిలువరించారు. బాధ్యులు రావాలని ఆందోళన చేశారు. ఆరు గంటల ఆందోళన అనంతరం మృతుని కుటుంబానికి రూ.4 లక్షలు పరిహారం ఇచ్చేలా రాజీ కుదిర్చినట్లు సమాచారం.


ప్రమాదవశాత్తు జారిపడినట్టు..

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శివ ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందినట్టు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తోట నాగరాజు తెలిపారు. స్థానిక సీహెచ్‌సీలో శవపరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
‘‘శివ కనుబొమ్మపై గాయం స్పష్టంగా కనిపిస్తోంది. తల వెనక భాగంలో తీవ్ర గాయమై రక్తస్రావమవుతోంది. ఎవరో బలంగా కొట్టి హత్య చేశారు.’’
- ఆందోళన సమయంలో మృతుని బంధువులు

చేష్టలుడిగిన పోలీసు శాఖ

నాలుగు గ్రామాల పరిధిలో 800 మంది సభ్యులున్న జలాశయంలో మత్స్య సంగ్రహణ సమయంలో తగిన బందోబస్తు తప్పనిసరి. స్థానిక వివాదాల విషయం తెలిసినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. యువకుడు మృతి ఘటన సమయంలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌, ఇద్దరు హోంగార్డులున్నారని స్థానికులు తెలిపారు. ఈసారి రాచమర్యాదల్లో లోటుతోనే వారు మిన్నకున్నారని, ఆ అలసత్వమే పలుమార్లు లూటీకి దారితీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అటూ ఆందోళన.. ఇటు లూటీ

ఓ వైపు వ్యక్తి ఆందోళన సాగుతుంటే కొందరు అవేమీ పట్టించుకోకుండా చేపల కోసం ఎగబడ్డారు. చెరువును గుత్తేదారు, సంఘం వదిలేయడంతో వందల సంఖ్యలో జాలర్లు, స్థానికులు వలలు తెచ్చుకుని భారీ చేపల్ని పట్టుకుని బైక్‌లు, ఆటోల్లో తరలించారు. చుట్టుపక్కల గ్రామాల్లో కిలో రూ.వందకు విక్రయించారు. సుమారు 200 టన్నుల చేప లూటీ అయిఉండచ్చని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని