logo

బోధన ప్రత్యేకం గురూ

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఇప్పుడు మరింత భరోసా కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో వీరి బోధనకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ నియామకం కోసం పోస్టులు ప్రకటించింది.

Updated : 03 Apr 2024 06:29 IST

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఇప్పుడు మరింత భరోసా కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో వీరి బోధనకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ నియామకం కోసం పోస్టులు ప్రకటించింది. దివ్యాంగుల బోధనకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించటం ఇదే తొలిసారి కావడం విశేషం. రాష్ట్రంలో స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు 220 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్‌ ఎస్‌జీటీకి 796 పోస్టులు కేటాయించారు. వీటిలో ఖమ్మం జిల్లాకు సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్‌ 8, ఎస్‌జీటీ 29 పోస్టులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ అసిస్టెంట్‌ 8, ఎస్‌జీటీ 31 పోస్టులు ప్రకటించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దివ్యాంగులైన విద్యార్థులకు బోధన మరింత మెరుగవ్వనుంది.

ఆత్మన్యూనత తొలగించేందుకు....

ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధనకు ప్రత్యేకంగా పాఠశాలలు ఉండటం వల్ల వారిలో ఆత్మన్యూనత భావం ఏర్పడుతుందని భావించి ఇప్పుడు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పాటే వీరికీ ఉపాధ్యాయులు బోధించేలా ఏర్పాట్లు చేశారు. బాలలందరికీ నిర్బంధ ఉచిత విద్యను అందించాలని చట్టం చెబుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 0-19 సంవత్సరాల బాలబాలికలు దీని పరిధిలోకి వస్తారు. బాలలంతా కచ్చితంగా ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో ఉండాలి. లేని వారు బడి బయట ఉన్నట్లే లెక్క. ఇలాంటి వారు బాల కార్మికుల కిందకు వస్తారు.

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన

గతంలో ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు బోధన ప్రత్యేకంగా ఉండేది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సమ్మిళిత విద్యలో భాగంగా ప్రతి పాఠశాల(సహిత పాఠశాల)గా ఉండాలని ఆదేశించింది. మామూలు పిల్లలతో పాటు మానసిక, శారీరక దివ్యాంగ పిల్లలను ఒకే పాఠశాలలో కలిసి చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలను దీనికి అనుగుణంగా తయారు చేశారు. కొన్ని పాఠశాలల్లో భౌతికపరమైన వసతుల కల్పన, విద్యాపరమైన సంసిద్ధతకు అనుగుణంగా తీర్చిదిద్దారు. అవరోధాలులేని విధంగా విద్యార్థుల రాకపోకలు కల్పించారు. ప్రతి పాఠశాలలో ర్యాంపులు నిర్మించారు. ప్రత్యేకంగా తాగునీటి సౌకర్యం, శౌచాలయాలు ఏర్పాటు చేశారు. జారుడు ప్రదేశాలు లేకుండా, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా తయారు చేశారు.

విద్యాపరమైన సంసిద్ధత

విద్యాపరమైన సంసిద్ధతలో భాగంగా బోధనకు అనుకూలమైన నైపుణ్యాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. అంధులు, వినికిడి సమస్య, మానసిక దివ్యాంగులు ఇలా పలు రకాలైన వారికి బోధించాలి. ఇందుకోసం విద్యార్థులకు ప్రత్యేక పుస్తకాలు, బ్రెయిలీ పరికరాలు, ఇతర అవసరమైన ఉపకరణాలు సమకూర్చారు. ఉపాధ్యాయులందరూ ప్రత్యేక పిల్లలకు ఎలా బోధించాలి, విద్యను అందించటంలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లను గుర్తించి వాటిని అధిగమించేందుకు వీలుగా ఐదు రోజుల పాటు ఇటీవల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీని గురించి పునశ్చరణ చేస్తున్నారు. విద్యార్థుల నమోదు కోసం ‘ప్రశస్థ్‌’ యాప్‌ను రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని