logo

వాహనం వెళ్లకున్నా... మోసుకొచ్చి ప్రసవం చేశారు..

ఆదివాసీ గొత్తికోయ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి... ఆసుపత్రికి వెళ్లడానికి రహదారి సౌకర్యం లేదు.. సమాచారం అందుకున్న సంజీవని వాహనం(108) ఆ గ్రామానికి వెళ్లడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు.

Updated : 03 Apr 2024 06:27 IST

వాహనంలోనే ప్రసవించిన హుర్రే

పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదివాసీ గొత్తికోయ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి... ఆసుపత్రికి వెళ్లడానికి రహదారి సౌకర్యం లేదు.. సమాచారం అందుకున్న సంజీవని వాహనం(108) ఆ గ్రామానికి వెళ్లడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. స్పందించిన సిబ్బంది సుమారు ఒక కిలోమీటర్‌ వరకు నడుచుకుంటూ వెళ్లి గర్భిణిని మోసుకొచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా వాహనంలోనే ఆమె ప్రసవించింది. వివరాల్లోకెళితే... దంతెలబోర పంచాయతీలో మారుమూల గొత్తికోయ పల్లె సీతారాంపురం. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటోంది. ఈ ప్రాంతానికి చెందిన మడకం హుర్రేకి పురిటినొప్పులు మంగళవారం సాయంత్రం వచ్చాయి. ఆమె ప్రసవ వేదనతో తీవ్రంగా బాధపడుతోంది. భర్త మోటు, కుటుంబీకులు ద్విచక్రవాహనంపై తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ నొప్పులతో కూర్చోలేకపోయింది. స్పందించిన 108 సిబ్బంది ఉమాదేవి, పైలెట్‌ సంపత్‌, ఆశా కార్యకర్త సుజాత 108 వాహనాన్ని గ్రామానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. మార్గంమధ్యలో ఒక వాగుని 108 దాటలేకపోవడంతో చేసేదేమిలేక నడుచుకుంటూ వైద్య సిబ్బంది గ్రామానికి చేరారు. గర్భిణిని ఎత్తుకొని కిలోమీటర్‌ దూరంలో ఉన్న 108 వాహనం వద్దకు తీసుకొచ్చారు. వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండటంతో ఇంకా పురిటినొప్పులు పెరిగాయి. దీంతో వాహనాన్ని పక్కకు ఆపిన ఈఎంటీ ఉమాదేవి ఉన్నతాధికారుల సలహాలు, సూచనలతో ప్రసవం చేసింది. దీంతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని