logo

కక్షలు పోయి.. ఆకాంక్షలు మిగిలి

ప్రజల ఆలోచనలు మారాయి.. పరిస్థితులు సహకరిస్తున్నాయి.. నచ్చిన వ్యక్తులను ఎన్నుకునేందుకు ఓటర్లు స్వేచ్ఛగా అడుగులు వేస్తున్నారు.. రక్తపాతం సృష్టించకుండానే అధికార మార్పిడికి పూనుకుంటున్నారు.

Updated : 03 Apr 2024 06:27 IST

ఈటీవీ, ఖమ్మం

ప్రజల ఆలోచనలు మారాయి.. పరిస్థితులు సహకరిస్తున్నాయి.. నచ్చిన వ్యక్తులను ఎన్నుకునేందుకు ఓటర్లు స్వేచ్ఛగా అడుగులు వేస్తున్నారు.. రక్తపాతం సృష్టించకుండానే అధికార మార్పిడికి పూనుకుంటున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం అదే స్థాయిలో చొరవ చూపుతున్నాయి.

గతంలో..

ఎన్నికలంటే ఆధిపత్య పోరుకు సంబంధించినవి. కక్షలు, ఘర్షణలతో పాటు రాజకీయ హత్యలు జరిగేవి. పోలింగ్‌ సమయంలో పోలీసులు, అధికారులూ అనేక అవస్థలు పడేవారు.

ప్రస్తుతం

ఎన్నికలంటే ప్రజల సమస్యలు, ఆకాంక్షలకు సంబంధించినవి. ప్రశాంత వాతావరణంలో ఓటేసేందుకు అధిక మంది ఇష్టపడుతున్నారు.

ఎన్నికల తీరుపై ప్రజలకు అవగాహన పెరుగుతోంది.  రాజకీయ పార్టీల వైఖరిలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ఎన్నికల నగరా మోగిందంటే.. ఘర్షణలు, దాడులు, ప్రతిదాడులతో పల్లెలు రక్తమోడేవి. అనేక కుటుంబాలు వీధినపడేవి. అనుభవపూర్వకంగా తెలుసుకోవటం, సమాజ పోకడపై అవగాహన పెంపొందించుకోవటం తదితర కారణాలతో ప్రశాంత వాతావరణాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. భద్రాద్రి జిల్లాలో మావోయిస్టు ప్రభావిత పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెరుగుతుండటమే ఆందోళన కలిగించే అంశం.

స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటేసేలా..

ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతున్న ప్రాంతాలను తదుపరి ఎన్నికల్లో అతి సమస్యాత్మక కేంద్రాల జాబితా నుంచి అధికారులు తొలగిస్తూ వస్తున్నారు. భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చిన స్వీప్‌ (సిస్టమేటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌ ప్రోగ్రాం)లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావటంతో సి-విజిల్‌, సువిధ, ఎన్‌కోర్‌ వంటి యాప్‌లు ఎన్నికల క్రతువు సజావుగా సాగేలా ఉపకరిస్తున్నాయి. షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచి పోలింగ్‌ ముగిసే వరకు వివిధ దశల్లో కేంద్ర బలగాలు కవాతులు   నిర్వహిస్తూ స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటేసే పరిస్థితులను కల్పిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని