logo

నేర వార్తలు

ఈనెల 14న అదృశ్యమైన నందికుంట గ్రామానికి చెందిన నిమ్మల వెంకటేశ్వర్లు (32) మృతదేహం గురువారం గ్రామ సమీపంలోని భవనాసి వాగులో లభ్యమైంది.

Published : 31 Mar 2023 02:12 IST

కూరగాయల చోరీకి వెళ్లి మృతి

నిమ్మల వెంకటేశ్వర్లు (పాతచిత్రం)

కొత్తపల్లి, న్యూస్‌టుడే : ఈనెల 14న అదృశ్యమైన నందికుంట గ్రామానికి చెందిన నిమ్మల వెంకటేశ్వర్లు (32) మృతదేహం గురువారం గ్రామ సమీపంలోని భవనాసి వాగులో లభ్యమైంది. ఆత్మకూరు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల మేరకు.. తన భర్త కనిపించడం లేదంటూ అతని భార్య శివమ్మ ఈనెల 17న కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎస్సై ముబీన్‌తాజ్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈనెల 14న రాత్రి పాలెంచెరువు గూడేనికి చెందిన కొంతమంది తన భర్తకు ఫోన్‌చేసి పిలిచారంటూ భార్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పాలెంచెరువుకు గూడేనికి చెందిన లింగన్న, అంకమ్మ, లక్ష్మిని విచారించగా.. వెంకటేశ్వర్లుతో కలిసి ఆ రోజు రాత్రి నందికుంట సమీపంలోని పొలాల్లో కూరగాయలు తెచ్చుకునేందుకు వెళ్లినట్లు చెప్పారు. ఆ పొలానికి కాపలాదారు అడవి పందులు రాకుండా ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలు తగలడంతో వెంకటేశ్వర్లు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడని వెల్లడించారు. మంటలు రావడంతో తాము భయంతో పరారైనట్లు వివరించారు. పొలం కాపలాదారు దుర్గారావు మరికొందరితో కలిసి మృతదేహాన్ని వాగులో పడేశారని సీఐ వివరించారు. ఆరోజు నుంచి కనిపించకుండాపోయిన దుర్గారావును గురువారం అదుపులోకి తీసుకుని విచారించగా భవనాసి వాగులో వెంకటేశ్వర్లు మృతదేహాన్ని చూపాడని చెప్పారు. దుర్గారావుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తమ భర్తను పాలెంచెరువు గూడెం వాసులు హత్య చేసుంటారని మృతుడి భార్య శివమ్మ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా పోలీసులు విచారించాలని కోరుతున్నారు.


ఉరేసుకుని రైతు బలవన్మరణం

మహేశ్‌ (పాత చిత్రం)

యల్లావత్తుల (రుద్రవరం), న్యూస్‌టుడే: మండలంలోని యల్లావత్తుల గ్రామానికి చెందిన మహేశ్‌ (32) అనే రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మహేశ్‌ తన తండ్రి శివశంకర్‌కు చెందిన 10 ఎకరాల పొలంతోపాటు మరో 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని మినుము, వరి, మొక్కజొన్న పంటలు సాగు చేశారన్నారు. పంటల సాగుకు రూ.6.80 లక్షలు అప్పు చేశారన్నారు. పది రోజుల కిందట వచ్చిన వడగళ్ల వానకు పంటంతా నాశనం అయ్యిందన్నారు. పంట చేతికి రాకపోవడంతో అప్పులు ఎలా కట్టాలంలూ బాధపడుతూ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పంకాకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. మృతదేహాన్ని పరిశీలించి తండ్రి శివశంకర్‌ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మహేశ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య శ్రావణి అనారోగ్యంతో 9 నెలల కింద మృతి చెందిందన్నారు.


పోలీసుల అదుపులో నకిలీ నోట్ల ముఠా

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే : నకిలీ నోట్లు చెలామణికి పాల్పడుతున్న ముఠాను నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జమ్మలమడుగుకు చెందిన దస్తగిరికి విశాఖపట్నం, వైఎస్సార్‌ జిల్లాలకు చెందిన ముఠా సభ్యులు ఫోన్‌చేసి రూ.10 లక్షలు ఇస్తే రూ.30 లక్షలు ఇస్తామని నమ్మబలికారు. డబ్బు తీసుకుని నంద్యాలకు రమ్మని పిలిచారు. గురువారం డబ్బు తీసుకుని వచ్చిన దస్తగిరిని ముఠా సభ్యులు కారులోకి ఎక్కించుకుని నంద్యాల పట్టణ శివారుకు తీసుకెళ్లారు. పీవీ నగర్‌ సమీపంలో డబ్బు లాక్కొని దస్తగిరిని కొట్టి కారులో పరారయ్యారు. బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అప్రమత్తమై గడివేముల వైపు వెళుతున్న కారును గుర్తించారు. గడివేముల పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు కారును అడ్డగించి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని నంద్యాల డీఎస్పీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకుని కారును సీజ్‌ చేసినట్లు తెలిసింది. డీఎస్పీ ఆధ్వర్యంలో నిందితులను విచారిస్తున్నట్లు సమాచారం.


రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

గోనెగండ్ల, న్యూస్‌టుడే: గోనెగండ్ల మండలం ఎస్‌.లింగందిన్నె గ్రామశివారులోని బళ్లారి-పత్తికొండ రహదారిలో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై తిమ్మారెడ్డి కథనం ప్రకారం.. కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన షేక్‌ జానీబాషా(21) దేవనకొండ మండలంలోని బండపల్లి గ్రామంలో జరుగుతున్న దేవరకు తండ్రి షేక్‌ మహబూబ్‌బాషాతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. దేవర ముగించుకొని తండ్రి, కుమారుడు స్వగ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలోప్రధాన రోడ్డులో ఓ కారు అతివేగంతో వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. తలకు తీవ్రగాయమైన జానీబాషా అక్కడిక్కడే మృతి చెందగా, మహబూబ్‌బాషా తీవ్రంగా గాయపడ్డారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని