logo

Kurnool: బుగ్గన ఇలాకాలో.. అల్లరి మూకల కేకలు

ఆర్థిక మంత్రి ఇలాకా డోన్‌ పట్టణంలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు. యువకులు బృందాలుగా ఏర్పడి ప్రధాన ప్రాంతాల్లో తిరుగుతూ దాడులకు దిగుతున్నారు.

Updated : 28 Oct 2023 07:48 IST

వరుస ఘటనలతో ప్రజల్లో ఆందోళన

గుంపులుగా చేరి గొడవలు


డోన్‌లో ప్రజలు స్వేచ్ఛగా ఉండాలనేదే ధ్యేయం. గత ప్రభుత్వంలో మాదిరి ప్రజలు భయపడే పరిస్థితులు లేవు. శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు పోలీసులు కృషి చేస్తున్నారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తరచూ చెప్పిన మాటలివి!!


డోన్‌, న్యూస్‌టుడే: ఆర్థిక మంత్రి ఇలాకా డోన్‌ పట్టణంలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు. యువకులు బృందాలుగా ఏర్పడి ప్రధాన ప్రాంతాల్లో తిరుగుతూ దాడులకు దిగుతున్నారు. గతంలో ఓ సీఐ గట్టిగా హెచ్చరించడంతో కొన్నిరోజుల పాటు గొడవలు జరగలేదు. ఇటీవల కాలంలో ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. డోన్‌ పట్టణంలో దాదాపు 80 వేలకు పైగా జనాభా ఉంటోంది. పట్టణ, గ్రామీణ పోలీస్‌స్టేషన్‌, డీఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. పట్టణ ఠాణా పరిధిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, నలుగురు ఏఎస్సైలు, ఎనిమిది మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 23 మంది కానిస్టేబుళ్లు, 18 మంది హోంగార్డులు ఉన్నారు. పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో మరో 50 మంది కానిస్టేబుళ్లను కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

ఇటీవల పట్టణంలో పలు ప్రాంతాల్లో వందలాది మంది యువకులు ఘర్షణకు దిగారు. టీఆర్‌నగర్‌లో పట్టపగలే ఘర్షణలకు పాల్పడటంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వారికి కొందరు నేతల అండదండలు ఉండటం వల్లే పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలు రేగుతున్నాయి. నాలుగు రోజుల కిందట డోన్‌ పట్టణంలోని రాఘవేంద్రస్వామి గుడి వీధిలో కత్తులు, కర్రలతో యువకులు పరస్పరం దాడులకు దిగారు. రణరంగాన్ని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో నలుగురిపై కేసులు నమోదు పోలీసులు మమ అనిపంచారు. గట్టి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికు మండిపడుతున్నారు.

ఇటీవల కొన్ని ఘటనలు

  • చిగురుమానుపేటలో ఈనెల 16న ఓ వ్యక్తిపై అదేకాలనీకి చెందిన కొందరు మద్యంమత్తులో విచక్షణారహితంగా దాడికి పాల్పడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.
  • కొండపేట ప్రాంతంలో కొందరు యువకుల మధ్య జరిగిన గొడవలో రెండుబైక్‌లు ధ్వంసమయ్యాయి.
  • పేరంటాళ్లమ్మ గుడి వద్ద ఈనెల 8న యువకుల మధ్య జరిగిన ఘర్షణలో బీరుసీˆసాతో దాడి చేయడంతో తీవ్రంగా యువకుడు గాయపడ్డారు.
  • కేఈమాదన్ననగర్‌లో ఆటోనగర్‌కు చెందిన యువకుడిపై పాతకక్షలతో కొందరు దాడికి పాల్పడటంతో స్థానిక మహిళలు గట్టిగా కేకలు వేయటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

    కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం

పట్టణంలో జరుగుతున్న ఘర్షణలపై యువతను స్టేషన్‌కు పిలిపించి మంత్రణం నిర్వహిస్తున్నాం. కొందరిపై కేసులు కూడా నమోదు చేస్తున్నాం. శాంతిభద్రతల పరిరక్షణకు గట్టిచర్యలు తీసుకుంటున్నాం. అల్లరిమూకల ఆట కట్టించేందుకు సిబ్బందితో గట్టి చర్యలు తీసుకుంటాం.

శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ, డోన్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు