logo

పాదయాత్ర మాటపాలనలో జూట

ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో పల్లెలకొచ్చారు.. నా అక్కాచెల్లెమ్మలు, అన్నలు అంటూ ‘హామీ’లు కురిపించారు.. ఒక సంవత్సరం ఓపిక పడితే ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించారు.. జగన్‌ వస్తే జనాలకు మంచి జరుగుతుందని భ్రమింపజేశారు.. అధికార పీఠమెక్కి ‘ప్రజా’స్వామ్యం మరిచారు.. అడిగితే అణచివేశారు.. ప్రశ్నిస్తే భయపెట్టారు..

Updated : 28 Mar 2024 06:40 IST

నేటి నుంచి మేమంతా సిద్ధం పేరుతో ప్రచారం
కర్నూలు సచివాలయం, నేరవిభాగం, విద్యావిభాగం, నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే

ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో పల్లెలకొచ్చారు.. నా అక్కాచెల్లెమ్మలు, అన్నలు అంటూ ‘హామీ’లు కురిపించారు.. ఒక సంవత్సరం ఓపిక పడితే ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించారు.. జగన్‌ వస్తే జనాలకు మంచి జరుగుతుందని భ్రమింపజేశారు.. అధికార పీఠమెక్కి ‘ప్రజా’స్వామ్యం మరిచారు.. అడిగితే అణచివేశారు.. ప్రశ్నిస్తే భయపెట్టారు.. భారం విధించారు.. ఐదేళ్లు కరిగిపోయాయి.. మళ్లీ ఓట్ల కాలం వచ్చేసింది.. ఎన్నికలకు ‘సిద్ధం’ అంటున్నారు.. ఆరున్నరేళ్ల కిందట మీరిచ్చిన మాటలు గుర్తున్నాయా? జగనన్నా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2017 నవంబరు 14 నుంచి డిసెంబరు 3 వరకు 7 నియోజకవర్గాల్లో జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టారు. 


మద్యంతర మరణాలు

‘‘ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడతల వారీగా మద్యం నిషేధించి.. కుటుంబాలను అభివృద్ధిలో నడిపిస్తాం’’ చాగలమర్రిలో ప్రజా సంకల్ప పాదయాత్రలో పగల్భాలు పలికారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాల సంఖ్య 175కు తగ్గించి.. బార్ల సంఖ్య 49కు పెంచేశారు. ఉమ్మడి జిల్లాలో 2019 ముందు నిత్యం మద్యం విక్రయాలు రూ.2 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.4.5 కోట్లకు చేరింది. 2021లో మద్యం ఆదాయం రూ.1,138 కోట్లు ఉండగా.. 2023 సంవత్సరానికి రూ.1,662 కోట్లకు చేరింది... నాణ్యత లేకపోవడంతో ప్రాణాల మీదికొస్తోందని మందుబాబులు పేర్కొంటున్నారు.


చచ్చినా చలించరు

‘‘ క్వారీలో పనిచేస్తున్న కార్మికులకూ వైఎస్సార్‌ బీమా అమలు చేస్తామని బనగానపల్లిలో 2017 నవంబరు 20న’’ ధీమా కల్పించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత 2021-22 నుంచి వైఎస్సార్‌ బీమా పథకం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో మూడేళ్లలో 30.63 లక్షల మంది పాలసీదారులను నమోదు చేశారు. గత మూడేళ్లలో 36 వేల మంది మృత్యుఒడికి చేరినా కేవలం 7,157 మందికి బీమా వర్తింపజేశారు.


పక్కా మోసం

‘‘ అర్హులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తాం.. ఏ ఒక్కరూ ఇల్లు లేదని చెప్పేవారు ఉండొద్దు’’ రాతనలో మహిళలకు మాటిచ్చారు. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద లక్ష మందికి పైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పారు. మూడేళ్లల్లో ఇప్పటి వరకు 8 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోక లబ్ధిదారులు అప్పులు చేస్తున్నారు.


పింఛన్‌ వంచన

‘‘ అధైర్యపడొద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే.. అధికారంలోకి రాగానే పింఛను మొత్తాన్ని రూ.2 వేలకు పెంచుతాం.. 45 ఏళ్లకే ఎస్సీ, బీసీ, మైనార్టీలకు పింఛను అందజేస్తామని’’ గంజిహళ్లిలో జగన్‌ ఊరించారు. వైఎస్సార్‌ పింఛన్‌ కానుక పేరుతో 16 రకాల పింఛన్లు ఇస్తున్నాం. ఏటా రూ.250 చొప్పున విడతల వారీగా  రూ.మూడు వేలకు పెంచారు. ఉమ్మడి జిల్లాలో 4.65 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఆరంచెల నిబంధనల పేరుతో పింఛన్లలో భారీగా కోత విధిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 30 వేల మందికి కత్తెరేశారు.


లక్ష్యం చేరని లక్షాధికారి మాట

‘‘ మా పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నికల నాటికి పొదుపు మహిళలకు ఎంత అప్పు ఉంటే అంత మొత్తాన్ని నాలుగు విడతల్లో ఇస్తాం.. సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు చెల్లిస్తూ మహిళలను లక్షాధికారులను చేస్తాం’’ అంటూ తవిసికొండ, హుస్సేనాపురంతోపాటు ఊరూరా డప్పు కొట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 86 వేల స్వయం సహాయక సంఘాలున్నాయి. గత నాలుగేళ్లలో 51,717 పొదుపు సంఘాల్లోని 5.03 లక్షల మంది సభ్యులకు మాత్రమే రుణ మాఫీ చేశారు.


అమ్మఒడి.. కోతల ముడి

‘‘ ఒక్క సంవత్సరం ఓపిక పడితే ఇబ్బందులు తొలగిపోతాయి.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘అమ్మఒడి’ పథకం అమలు చేసి ఇద్దరు పిల్లలను చదివిస్తే రూ.15 వేలు తల్లుల ఖాతాలో జమ చేస్తామని’’ దోర్నిపాడులో 2017 నవంబరు 15న జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పథకాన్ని ఒక్కరికే పరిమితం చేశారు.. 2020లో రూ.15 వేలు జమ చేయగా 2021లో రూ.14 వేలకు తగ్గించారు. 2022 జనవరిలో జమ చేయకుండా జూన్‌కు మార్చి ఆ సంవత్సరం ఎగరగొట్టారు. 2023లో రూ.13 వేలు మాత్రమే ఇచ్చారు.


అంగన్‌వాడీలపై ఉక్కుపాదం

‘‘అంగన్‌వాడీల సమస్యలపై ఇప్పటికీ అసెంబ్లీలో ప్రస్తావించా.. అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.. మీకు అండగా ఉంటామని’’ బేతంచెర్లలో అంగన్‌వాడీ కార్యకర్తలు వినతిపత్రం ఇస్తున్న సందర్భంలో హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 3,283 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు ఉన్నారు. జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సమ్మెకు దిగారు. వారిపై ప్రభుత్వం ‘ఎస్మా’ చట్టం ప్రయోగించింది. అధికారులు తాఖీదులు జారీ చేసి బలవంతంగా విధుల్లో చేర్పించారు.


ఆశాలను అణచివేశారు

ఏడాది ఆగితే మన ప్రభుత్వం వచ్చాక సమస్యలు పరిష్కారమవుతాయని బేతంచెర్లలో నవంబరు 21న ఆశా కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 2,448 మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. నెలకు రూ.10 వేల వేతనంతో పనిచేస్తున్న వీరు తమకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలంటూ ఆందోళన బాట పట్టారు.  ఎక్కడిక్కడే వీరిని నిర్బంధించి ఉద్యమాన్ని అణచివేశారు.


రూ.20 వేలు ఒక్కరికీ ఇవ్వలేదు

‘‘ వైకాపా అధికారంలోకి వస్తే కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు ఇవ్వడమే కాకుండా ఉపకార వేతనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తామని’’ బేతంచెర్లలో 2017 నవంబరు 21న కళాశాల విద్యార్థులకు కబుర్లు చెప్పారు. విద్యార్థికి ఏడాదికి రూ.20 వేలు ఇవ్వడం లేదు. కళాశాలలను గ్రేడులుగా విభజించి ఏ-గ్రేడ్‌ కళాశాలలో చదివే వారికి రూ.18,400, బీ గ్రేడ్‌ అయితే రూ.15,300, కనిష్ఠంగా రూ.13,200 వరకు ఏడాది పొడవునా నాలుగు సార్లు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 66,715 మంది విద్యార్థులకు 58,534 మంది విద్యా దీవెనకు అర్హత సాధించారు. తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు కేవలం రెండు విడతల్లో నగదు జమైంది.


రైతుకు దక్కని భరోసా

‘‘ వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాల్లో భాగంగా రైతు భరోసా పథకం కింద ఏటా పంటల సాగు పెట్టుబడి నిధిని మే నెలలో రూ.13,500 ప్రకారం అన్నదాతలకు నాలుగేళ్లపాటు అందజేస్తామని’’ చెరుకులపాడు, బైలుప్పలలో డప్పుకొట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5.60 లక్షల మంది రైతు కుటుంబాలున్నాయి. 7.40 లక్షల మంది రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. రాష్ట్రం రూ.7,500 ఇస్తోంది.. కేంద్రం వాటా రూ.6 వేలు కలిపి మొత్తం రూ.13,500 తానే ఇస్తున్నానంటూ ఐదేళ్లుగా ప్రచారం చేసుకున్నారు.] ఐదు లక్షల మందికి రెండు విడతల్లో అందిస్తున్నారు. ఒక కుటుంబంలో ఒక్కరికే, వెబ్‌ల్యాండ్‌ ఆన్‌లైన్‌లో పేర్లు లేని వారంటూ కోత పెడుతున్నారు.


ఇమామ్‌లకు ధోకా

‘‘ ఏ మసీద్‌ అయినా సరే అందులో పనిచేసే ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజాన్‌లకు రూ.5 వేలు ఇస్తామని ’’ తొగల్చేడు క్రాస్‌ వద్ద నవంబరు 25న ముస్లింలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో హామీ ఇచ్చారు. నంద్యాలలో 398 మంది, కర్నూలు జిల్లాలో 394 మంది మౌజాన్లు, ఇమామ్‌లకే గౌరవ వేతనం ఇస్తున్నారు. అది కూడా గత నాలుగు నెలలుగా అందలేదు.


మాటల్లోనే మద్దతు ‘ధర’

‘‘అధికారంలోకి వస్తే రైతు పక్షపాతిగా ఉంటాం.. అన్నదాతలే గిట్టుబాటు ధరలు నిర్ణయించేలా చర్యలు తీసుకుంటాం.. ధరలు పడిపోయినప్పుడు వ్యవసాయ మార్కెట్లలో ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం’’ అని భీమునిపాడు, బైలుప్పలో అన్నదాతలకు జగన్‌ మాటిచ్చారు. ఉమ్మడి జిల్లాలో రెండు సీజన్లలో కలిపి 9.0 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా 35 వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేస్తున్నారు. క్వింటా ఉల్లికి మద్దతు ధర రూ.770 ప్రకటించారు. 2020లో 9,289 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. గిట్టుబాటు ధరలు రాక అన్నదాతలు ఉల్లిని పారబోసినా పట్టించుకోలేదు.


టమాట శుద్ధి అబద్ధం

టమాట జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిసెంబరు 1న కోరగా ప్రభుత్వం వచ్చాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టమాట పంటకు ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రసిద్ధి. ఏటా 5-6 వేల హెక్టార్లలో సాగవుతుంది. ధరలు లేకపోవడంతో పొలాల్లోనే పారబోసే దుస్థితి నెలకొంది. టమాట ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఐదేళ్లు నానబెట్టి ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇటీవల భూమి పూజ చేశారు.


నాడు సీపీఎస్‌ అన్నారు

‘‘ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)తో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరుస్తామని డిసెంబరు 2న వైఎస్‌ జగన్‌ పత్తికొండలో హామీ ఇచ్చారు. సీపీఎస్‌ రద్దు కోసం ఉద్యోగులు ఐదేళ్లుగా రోడ్లెక్కి ఆందోళన బాట పట్టారు. వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించారు. ఉమ్మడి జిల్లాలో 20 వేల మందికి పైగా సీపీఎస్‌ ఉద్యోగులున్నారు. కొత్తగా జీపీఎస్‌ను తెరపైకి తెచ్చారు.


వలసలను అడ్డుకోని ఆడా

‘‘.ఏ ఒక్కరూ గ్రామం విడిచి వలస వెళ్లకుండా గ్రామాల్లోనే ఉపాధి చూపిస్తామని‘’’ కైరుప్పలలో నవంబరు 30న ఊదరగొట్టారు... అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదోని ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసి వలసలు నివారిస్తామన్నారు. పరిశ్రమలు , సాగునీటి ప్రాజెక్టు చేపట్టింది లేదు. ఒక్క మంత్రాలయం నియోజకవర్గంలోనే లక్ష కుటుంబాలు సుగ్గిబాట పడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు