logo

పచ్చని సీమలో... జగన్‌ భూ చిచ్చు

తాతల నాటి భూమి.. నేలను నమ్ముకుని ‘సాగు’బండి లాగిస్తున్నారు.. సర్వే పేరిట పల్లె సీమలో జగన్‌ భూ చిచ్చు పెట్టారు.. కళ్లెదుటే భూమి ఉంది.. కాళ్ల కింది నేల కదిలిపోతున్నట్లవుతోంది.. అన్నదమ్ముళ్ల మధ్య బంధం చెరిపేస్తోంది.

Updated : 12 Apr 2024 05:32 IST

రీసర్వే పేరిట హక్కులు కాలరాసిన వైనం
నిర్దిష్ట ప్రమాణాలకు విరుద్ధంగా కొలతలు

తాతల నాటి భూమి.. నేలను నమ్ముకుని ‘సాగు’బండి లాగిస్తున్నారు.. సర్వే పేరిట పల్లె సీమలో జగన్‌ భూ చిచ్చు పెట్టారు.. కళ్లెదుటే భూమి ఉంది.. కాళ్ల కింది నేల కదిలిపోతున్నట్లవుతోంది.. అన్నదమ్ముళ్ల మధ్య బంధం చెరిపేస్తోంది.. ‘భూ’ హద్దులు పల్లె సంబంధాలను దూరం చేస్తున్నాయి.. భూ వివాదాల పరిష్కారం కోసమంటూ జగన్‌ సర్కారు ‘జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం’ పేరిట చేపట్టిన రీ సర్వే కొత్త వివాదాలను సృష్టిస్తోంది. రైతులకు వారి భూములపై శాశ్వత హక్కులు కలగడం దేవుడెరుగు.. ఉన్న హక్కులనే హరించి వేస్తోంది.. జగన్‌ తీరును ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు.


ఆస్పరి: మా అమ్మ నారాయణమ్మ పేరుపై సర్వే నంబరు 111-3లో 2.20 ఎకరాల పొలం ఉంది. సర్వే చేసి 1.92 ఉన్నట్లు చూపారు. 28 సెంట్లు భూమిని కోల్పోయాం. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో సెంటు భూమి రూ.లక్ష  పలుకుతోంది. 28 సెంట్ల భూమికి రూ.28 లక్షలు నష్టపోతున్నాం. రెవెన్యూ, సర్వే అధికారులు పట్టించుకోవడం లేదు. రీ సర్వేతో హద్దులు చెరిపేస్తున్నారు.  సమస్య పరిష్కరించకపోతే.. న్యాయపోరాటం చేస్తాం.

మునిస్వామి, (నారాయణమ్మ కుమారుడు), చిరుమాన్‌దొడ్డి


పొలంగట్టుకుచేరని రాళ్లు

ఒక్కో హద్దు రాయి పాతించేందుకు ప్రభుత్వం రూ.150 ఖర్చు చేస్తోంది. ఒక గ్రామానికి 8 వేల రాళ్లు అవసరం కాగా అందులో సగం సరఫరా చేస్తున్నారు. అవి పంచాయతీ కార్యాలయాలు, సచివాలయాల వద్ద పడి ఉన్నాయి. మరికొన్నిచోట్ల పొలాల్లో కుప్పలుగా పడేశారు.

భూ సర్వే తప్పులమయంగా మారడంతో చిరుమాన్‌దొడ్డిలో తొలగించిన హద్దురాళ్లు


బెదిరింపులు

పెద్దకడబూరు మండలం హులికన్విలో అప్పల నాగరాజు, అప్పల ఉరుకుందులకు 4.77 ఎకరాల భూమి ఉంది.. భూరీసర్వేలో 33 సెంట్ల భూమి తగ్గించి పక్క పొలం యజమానుల (మహదేవ, చిన్నఈరన్న) భూఖాతాలో కలిపారు.. బాధితులకు ‘న్యాయం’ చేయాలని హైకోర్టు ఆదేశించింది.. ఏమాత్రం పట్టించుకోకుండా ఓ విశ్రాంత డీఎస్పీని తీసుకొచ్చి  తుపాకీతో రైతులను భయపెట్టారు.


మూడు విడతలు.. ముప్పుతిప్పలు

కర్నూలు జిల్లాలో మూడు విడతల్లో కలిపి 261 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయ్యినట్లు అధికారులు చెబుతున్నారు.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 141 గ్రామాల్లోనే సమగ్రంగా పూర్తి చేసినట్లు తేలింది. మూడో విడత 174 గ్రామాల్లో చేయాల్సి ఉండగా ఆస్పరి మండలంలో ఒక్క గ్రామంలో మినహా 173 గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు అధికారులు లెక్కలు రాసుకొన్నారు. ఇప్పటివరకు 53 గ్రామాల్లోని 35,514 మందికే భూ హక్కు పత్రాలొచ్చాయి. 120 గ్రామాల్లో ఎవరికి భూ హక్కు పత్రాలు ఇచ్చారో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. నంద్యాల జిల్లాలో మూడు విడతల్లో కలిపి 229 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయ్యిందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి 148 గ్రామాల్లోనే చేశారు. మిగిలిన 81 గ్రామాల్లో రీ-సర్వే పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.


పథకం: జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష

నిబంధన: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2020 డిసెంబరులో భూ రీసర్వే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. రీసర్వేకు వచ్చే ముందు అధికారులు రైతులకు సమాచారం ఇవ్వాలి. అన్నదాతల సమక్షంలో భూములు కొలవాలి. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి.


లక్ష్యం: 2023 డిసెంబరు నాటికి ఉమ్మడి జిల్లాలోని 914 రెవెన్యూ గ్రామాల్లో రీ-సర్వే పూర్తి లక్ష్యం నిర్దేశించుకొన్నారు. ఆయా గ్రామాల్లో భూవివాదాల పరిష్కారం, రైతులు, స్థిరాస్తుల యజమానులకు శాశ్వత భూహక్కు రికార్డు, భూకమతం విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ, యజమాని భూములు తారుమారు కాకుండా డిజిటల్‌ రికార్డులు రూపొందించాలి.


జరిగిన తీరు: రైతులకు సమాచారం ఇవ్వకుండానే.. వారు లేనప్పుడు అధికారులు పొలాల్లోకి వెళ్లారు. హడావుడిగా సర్వే చేశారు. ఇప్పటి వరకు 490 గ్రామాల్లో పూర్తయ్యిందని అధికారుల లెక్కలు చెబుతుండగా.. మూడు సంవత్సరాల నాలుగు మాసాలైనా మూడొందలకు మించలేదు. సర్వేలో నిర్దిష్ట ప్రమాణాలు పాటించకపోవడంతో ఎక్కడికక్కడ భూవివాదాలు చెలరేగాయి. వారసత్వంగా వస్తున్న ఆస్తుల్లో చాలామంది పది సెంట్లు కోల్పోయారు.

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం


17వేల పత్రాలు తప్పులమయం

కర్నూలు జిల్లాలో మూడు విడతల్లో కలిపి 86,910 మందికి, నంద్యాలలో 73,750 మందికి భూ హక్కు పత్రాలిచ్చారు. విస్తీర్ణంలో తేడాలు, పేర్ల తప్పులు, జాయింట్‌ ఎల్‌పీఎంలు.. ఇలా పది వేల హక్కు పత్రాల్లో తప్పులు దొర్లాయి. వాటిని సరి చేయాలని అనేకమార్లు రైతులు తహసీల్దారు, ఆర్డీవో, జిల్లా కేంద్రంలోని జేసీ, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా తప్పుల సవరణలు జరగలేదు. నంద్యాల జిల్లాలో మూడో విడతలో 81 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయ్యిందని అధికారులు అంటున్నా 81 గ్రామాలకు భూహక్కు పత్రాలు చేతికందలేదు. పంపిణీ చేసిన వాటిలో 7 వేల హక్కుపత్రాల్లో తప్పులు దొర్లాయి. జాయింట్‌ ఎల్‌పీఎంల నుంచి రైతులను విడదీయలేదు.


ఉమ్మడి పత్రం.. అదో విచిత్రం

నలుగురైదుగురు రైతులకు కలిపి ఉమ్మడిగా భూహక్కు పత్రాలు ఇస్తున్నారు. దీంతో పల్లెల్లో గొడవలు పెరిగాయి. రీ-సర్వే చేపడుతున్న గ్రామాల్లో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ సరిగా చేయలేదు. రీసర్వే చేస్తున్న భూమి యజమానితోపాటు చుట్టుపక్కల వారికి ముందుగా తాఖీదులిచ్చి వారి సమక్షంలో రీసర్వే చేసి హద్దులు గుర్తించాలి. అలా చేయడం లేదు. ఉమ్మడి హక్కు పత్రాలు ఇవ్వడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.


సవరణ.. సమరం

తప్పిదాల సవరణకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ఆప్షన్‌ ఇవ్వలేదు. ఉప తహసీల్దార్లను నియమించామని చెబుతున్నా.. వారి స్థాయిలో పరిష్కారం కావడం లేదు.


మేము ముగ్గురు అన్నదమ్ములం... ఢణాపురంలో మూడెకరాల పొలం ఉంది.. రీ సర్వే చేసి భూమంతా ఒక్కరి పేరుపైనే చేసి ఉమ్మడి కుటుంబంలో అధికారులు చిచ్చుపెట్టారు.

పంపాపతి, నారాయణపురం,

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని