logo

వాలంటీర్ల రాజకీయం

అధికారం కోసం వైకాపా అక్రమ మార్గాల్లో వెళ్తోంది.. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటీర్లనే అధికార వైకాపా ప్రభుత్వం అస్త్రాలుగా మలుచుకునేందుకు సిద్ధమవుతోంది.

Published : 13 Apr 2024 02:07 IST

బలవంతపు రాజీనామాలు
ఏజెంట్లుగా నియమించాలని పన్నాగం
న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

అధికారం కోసం వైకాపా అక్రమ మార్గాల్లో వెళ్తోంది.. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటీర్లనే అధికార వైకాపా ప్రభుత్వం అస్త్రాలుగా మలుచుకునేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల రోజున ఏకంగా పోలింగ్‌ కేంద్రాల్లోనే ఓటర్లను హెచ్చరించి ఓట్లు దండుకునేందుకు వారి ద్వారా ఎత్తులు వేస్తోంది. వాలంటీర్లను వైకాపా తరఫున పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చోబెట్టాలని చూస్తోంది.

ముందస్తు వ్యూహం

వాలంటీర్లనే పోలింగ్‌ ఏజెంట్లుగా పెడితే వైకాపాకు ఓటేసేవారెవరో.. ప్రత్యర్థి పార్టీకి మీట నొక్కేదెవరో వాలంటీర్లు గుర్తిస్తారని సీఎం జగన్‌ భావిస్తున్నారు. ఓటర్లను బెదిరించి అయినా ఓట్లు వేయించుకునేలా నిర్ణయించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చేవారిని గుర్తించి అక్కడే భయపెట్టి ఓటు వేయించుకునేలా పథకం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా వాలంటీర్లతో రాజీనామా చేయించి పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లుగా నియమించాలని పన్నాగం పన్నారు. వైకాపా కేడర్‌ కంటే సొంత సైన్యంపైనే జగన్‌ నమ్మకం ఉంచారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.  

ఇప్పటికీ 355 మంది వరకు

కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 11 మండలాల్లో కలిపి మొత్తం 264 మంది గ్రామ సచివాలయ వాలంటీర్లు తమ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. సదరు వాలంటీర్ల రాజీనామాలను ఆయా మండలాల ఎంపీడీవోలు ఆమోదించినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. నంద్యాల జిల్లాలో 9 మండలాల్లో మొత్తం 91 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 20 మండలాల్లో 355 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.

50 మంది విధుల నుంచి తొలగింపు

అధికార పార్టీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న యాభై మంది వాలంటీర్లపై వేటు పడింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి కర్నూలు జిల్లాలో 27, నంద్యాల జిల్లాలో 23 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.

పోలింగ్‌ ఏజెంట్లుగా పాల్గొనటం నేరమే  

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 134(ఏ) ప్రకారం ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవ వేతనం పొందుతున్న గ్రామ, వార్డు వాలంటీర్లు ‘పబ్లిక్‌ సర్వెంట్‌’ కేటగిరీలోకి వస్తారు. వాలంటీర్లు ఎన్నికల ఏజెంట్‌, పోలింగ్‌ ఏజెంట్‌, కౌంటింగ్‌ ఏజెంట్‌గా పాల్గొనడం చట్ట ప్రకారం నేరం. దీనికి మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది.

వేతనాలిస్తాం.. ఉద్యోగం ఇస్తాం

మళ్లీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వైకాపా నాయకులు వాలంటీర్లను బుజ్జగిస్తున్నారు. 30 రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయాలని.. ఎన్నికల పోలింగ్‌ రోజున ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించుకొని ప్రజలను నయానో, భయానో బెదిరింపులకు గురి చేసి ఓట్లేయించుకునేందుకు ఆడుతున్న జగన్నాటకమే తప్ప మరొకటి కాదని విపక్షాలు మండిపడుతున్నాయి. వాలంటీర్లుగా పనిచేసిన వారిని ఎన్నికల పోలింగ్‌ రోజున అధికార పార్టీ ఏజెంట్లుగా నియమించకుండా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

బలవంతం చేస్తూ..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో వందల మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు అనడం కంటే నియోజకవర్గ వైకాపా అభ్యర్థులు వాలంటీర్ల చేత రాజీనామాలు చేయిస్తున్నారు. ‘‘మళ్లీ మనమే అధికారంలోకి వచ్చేది. మళ్లీ మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం.. ఈ మూడు నెలలకు వేతనాలు సైతం ఇస్తాం’’ అని చెబుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థుల ప్రచారాల్లో పాల్గొంటున్న వాలంటీర్లను ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ అధికారులు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. అధికారులు తమను ఉద్యోగాల నుంచి తొలగించడమేంటీ.. మేమే రాజీనామా చేస్తాం అనేలా వాలంటీర్ల చేత వైకాపా అభ్యర్థులు బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నారు.


ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ల తొలగింపు

(ఆదోనిగ్రామీణం),న్యూస్‌టుడే: మండలం మండిగిరికి చెందిన విజయ్‌, బేతస్ట్రా అనే ఇద్దరు వాలంటీర్లు వైకాపా ప్రచారంలో పాల్గొనడంతో  విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో విజయశేఖర్‌ శుక్రవారం తెలిపారు.  

తుగ్గలి, న్యూస్‌టుడే : జి.ఎర్రగుడి గ్రామ సచివాలయం పరిధిలో 15 మంది, శభాష్‌పురం-5 మంది మొత్తం 20 మంది వాలంటీర్లు శుక్రవారం రాజీనామా చేసినట్లు ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయానికి వచ్చి వాలంటీర్లు రాజీనామా పత్రాలు అందించినట్లు ఆమె పేర్కొన్నారు.

నారాయణపురం, గణేకల్‌(ఆదోని గ్రామీణం), న్యూస్‌టుడే: ఆదోని మండలం నారాయణపురం, గణేకల్‌ గ్రామాలకు చెందిన 16 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు ఎంపీడీవో విజయశేఖర్‌, ఈవోఆర్డీ నాగరాజు శుక్రవారం తెలిపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు వాలంటీర్లు ప్రకటించారు.

మంత్రాలయం గ్రామీణం (కౌతాళం), న్యూస్‌టుడే: కౌతాళం గ్రామానికి చెందిన 9 మంది, తోవి గ్రామానికి చెందిన ఇద్దరు వాలంటీర్లు రాజీనామా చేసి పత్రాలను శుక్రవారం ఎంపీడీవో రఘునాథ్‌ గుప్తకు అందించారు. వైకాపా నాయకులు వాలంటీర్లను ఎన్నికలో ఉపయోగించుకునేందుకు   రాజీనామాలకు ఒప్పిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు