logo

స్తంభించిన జల జీవనం

దేవనకొండ మండలంలో 44 గ్రామాలు ఉన్నాయి. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రూ.2 కోట్లు మంజూరు కాగా.. 20 గ్రామాలకు సంబంధించి టెండర్లకు ఆసక్తి చూపకపోవడంతో పనులు ముందుకు సాగలేదు.

Published : 13 Apr 2024 02:12 IST

జగన్‌ పాలనలో పల్లెలకు దాహం
పారని పథకం

దేవనకొండ మండలంలో 44 గ్రామాలు ఉన్నాయి. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రూ.2 కోట్లు మంజూరు కాగా.. 20 గ్రామాలకు సంబంధించి టెండర్లకు ఆసక్తి చూపకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. కె.వెంకటాపురం, మాదాపురం గ్రామాల్లో నీటిసమస్య తీవ్రంగా ఉండటంతో అధికారులు ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నారు. బోర్లు వేయించినా నీటిచుక్క కానరాని పరిస్థితి నెలకొంది.

హొళగుంద మండల పరిధిలోని  నెరణికి గ్రామంలో తాగునీట¨ సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సుమారు 650 కుటుంబాలు ఉన్నాయి. వారానికోసారి సరఫరా చేస్తున్నారు. మండలంలోని 26 గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం 33 చోట్ల  జల్‌ జీవన్‌ పనులు చేపట్టాలని నాలుగు సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు రాలేదని ఆర్‌డబ్ల్యూఎస్‌ జేెఈ రామ్‌లీలా తెలిపారు.


తాగునీటి సమస్య తీవ్రం

-ముత్యాలమ్మ, బల్లెకల్‌, ఆదోని మండలం

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: మా గ్రామానికి కుప్పగల్‌ తాగునీటి పథకం నుంచి నాలుగు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారు. ఆ నీటి కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. గ్రామంలో బోరుకు మోటారు ఏర్పాటు చేసి నీటి సరఫరా చేస్తున్నారు. పైపులైన్‌ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీటి సరఫరా సరిగా జరగడం లేదు. నిధులు మంజూరయ్యాయని చెబుతున్నారు కానీ ఇంతవరకు పక్రియ ప్రారంభం కాలేదు.


సొంతంగా కుళాయిల ఏర్పాటు

- మద్దిలేటి, కలుగొట్ల సర్పంచి

వెల్దుర్తి, న్యూస్‌టుడే: కలుగొట్లలో నిధులు లేవని వీధిలో ఒక వైపు ఉన్న ఇళ్లకు మాత్రమే కుళాయిలు ఏర్పాటు చేశారు. మరో వైపు వదిలేయడంతో.. గ్రామస్థులే సొంతంగా ఖర్చుచేసి కుళాయిలు వేసుకున్నారు. ప్రస్తుతం గ్రామానికి నీరు పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదు. కొత్త బోరు ఏర్పాటు చేయాలని అధికారులకు విన్నవించిన ప్రయోజనం లేకపోయింది.


ఎలాంటి పనులు చేపట్టలేదు

- రమేశ్‌, మొలగవల్లి

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: గ్రామంలో ఎలాంటి పనులు చేపట్టలేదు. జల్‌జీవన్‌ పథకం ద్వారా ప్రతి ఇంటికి కులాయి ఏర్పాటు చేసి తాగునీరు అందిస్తే ఎంతో బాగుండేది. గ్రామానికి ఈ పథకం కింద రూ.1.46 కోట్లు వచ్చాయి. పనులు చేసేందుకు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదని అధికారులు చెబుతున్నారు.


నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం

- చిరంజీవి, దేవనకొండ

దేవనకొండ, న్యూస్‌టుడే: మా గ్రామంలో 400 కుటుంబాలు, 1300 జనాభా ఉంది. శాశ్వత నీటి పరిష్కారం చూపాలి. ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా చేస్తున్నా.. పూర్తిగా సరిపోవడం లేదు. తాగునీటికి ఇబ్బందులు పడతున్నాం. సరైన వానలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటాయి. నీటిపథకాలు పనిచేయడం లేదు. దీంతో పొలాలకు వెళ్తున్నాం. అసలే వేసవి ఇంకా అవస్థలు పడుతున్నాం.


ఏడాదిగా అవస్థలే..

- మల్లయ్య మాదిగ, దూదేకొండ

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామంలో చేపట్టిన ఇంటింటికీ కుళాయి పథకం ఎస్సీ కాలనీకి ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. సుమారు ఏడాదిన్నరగా కాలనీ మొత్తం తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రస్తుతం వేసవిలో తాగునీటి ఎద్దడి మరింత దారుణంగా ఉంది. గ్రామంలో కొన్ని కాలనీలకు ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేస్తున్నా.. ఎస్సీ కాలనీకి మాత్రం ఇంత వరకు పైపులైన్లు కానీ, కుళాయిలు కానీ వేయలేదు. ప్రతి ఇంటి వద్ద కుళాయిలు ఏర్పాటు చేసి నీటి సరఫరా చేపట్టాలి.


ఫిర్యాదు చేసినా.. స్పందించలేదు

- వెంకటరాముడు, పైచింతలకొండ

తుగ్గలి, న్యూస్‌టుడే: పైచింతలకొండ గ్రామంలో 40 రోజులు కిందట పనులు చేపట్టారు. మా కాలనీలో పైపులైన్‌ వేసేందుకు కాలవ తవ్వారు. తెదేపా మద్దతుదారులమని పనులను అలాగే వదిలేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు కాలనీవాసులంతా కలిసి ఫిర్యాదు చేశాం. ఆ తరువాత కాలనీలో తాగునీటి పైపులైన్‌ వేశారంతే. ఆ తరువాత కుళాయిలు వేయలేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలేదు. కేవలం తెదేపా మద్దతుదారులమనే కారణంగానే 30 గృహాలకు కుళాయిలు ఏర్పాటు చేయలేదు. దీంతో మాకాలనీవాసులు గతంలో ఉన్న పాత నీటి పథకం వద్ద నుంచి నీరు తెచ్చుకొంటున్నాం. వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని