logo

తప్పిన పాఠం.. దక్కని ఫలితం

ఇంటర్‌ ఫలితాలు నిరాశపరిచాయి. పలు కళాశాలల్లో సగం మంది విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల నాడు- నేడు పనులు సాగుతుండటంతో పాఠ్యాంశాల బోధనకు ఆటంకంగా మారింది.

Published : 13 Apr 2024 02:22 IST

ఇంటర్‌లో వెనుకబాటు
కళాశాలలపై దృష్టిసారించని ప్రభుత్వం

ఇంటర్‌ ఫలితాలు నిరాశపరిచాయి. పలు కళాశాలల్లో సగం మంది విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల నాడు- నేడు పనులు సాగుతుండటంతో పాఠ్యాంశాల బోధనకు ఆటంకంగా మారింది. అధ్యాపకుల కొరతా వేధిస్తోంది. ప్రభుత్వం జూనియర్‌ కళాశాలలపై దృష్టిసారించకపోవడంతో ఫలితాలు తప్పాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఒప్పంద అధ్యాపకులతోనే బోధన

ఆదోని విద్య, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో అధికంగా ఒప్పంద అధ్యాపకులతోనే చదువులు కొనసాగిస్తున్నారు. ఈ కళాశాలలో ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలలో మొదటి సంవత్సరంలో 296 మంది, ద్వితీయ సంవత్సరంలో 171 మంది విద్యార్థినులు చదువులు కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియేట్‌ పరీక్ష ఫలితాల్లో 58 శాతం విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు.

  • ఆదోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఒప్పంద అధ్యాపకులే అధికంగా ఉన్నారు. ఈ కళాశాలలో ముగ్గురు రెగ్యూలర్‌ అధ్యాపకులు ఉండగా.. పది మంది ఒప్పంద అధ్యాపకులు, ఒకరు గెస్ట్‌ ఫ్యాకల్టీ, ఒకరు వ్యాయమ అధ్యాపకుడు, ఒకరు గ్రంథాలయ అధికారి ఉన్నారు. కళాశాలలో రెగ్యూలర్‌ అధ్యాపకులను నియమించాల్సిన అవసరం ఉంది.
  • రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకం కింద కళాశాలలో పనులు చేపట్టింది. గత ఏడాది ప్రారంభమైన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పథకం కింద కళాశాలలో 20 మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుదీకరణ, మరమ్మతులు, భవనంపై రూపింగ్‌ తదితర పనులు చేపట్టారు.

అంతంత మాత్రమే..

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఆలూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 163 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 90 మంది ఉత్తీర్ణుత సాధించారు. కళాశాలలో అన్ని పాఠ్యాంశాలకు అధ్యాపకులు ఉన్నా.. ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆంగ్ల అధ్యాపకుడికి ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ బాధ్యతలు అప్పగించారు. ఆయన తన పాఠ్యాంశం బోధనతో పాటు ప్రిన్సిపల్‌ విధులు నిర్వర్తించాలి. పరీక్షల అనంతరం ఆయన పదోన్నతిపై వెళ్లినట్లు వారు చెప్పారు. కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రిన్సిపల్‌ రమాదేవి తెలిపారు.


వేధిస్తున్న అధ్యాపకుల కొరత..

మద్దికెర, న్యూస్‌టుడే: మద్దికెర ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పూర్తిగా పడిపోయింది. అధ్యాపకుల కొరత కారణంగా గణనీయంగా తగ్గింది. మొదటి సంవత్సరంలో 49 మంది పరీక్షలు రాయగా 12 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం 60 మందికి గాను 10 మందే ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్‌ సవిత తెలిపారు. పాఠ్యాంశాలు బోధించే అధ్యాపకులు లేక ఉత్తీర్ణత తగ్గిపోయిందని ఆమె చెప్పారు.


చిప్పగిరి చిట్టచివరన

చిప్పగిరి, న్యూస్‌టుడే: చిప్పగిరి జూనియర్‌ కళాశాల ఇంటర్‌ ఫలితాల్లో చిట్టచివరన నిలిచింది. రెండేళ్లుగా కళాశాల ఉత్తీర్ణత మరీ దారుణంగా మారింది. రెండు శాతం ఫలితం వచ్చింది. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 67 మంది పరీక్షలు రాయగా ఒకరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ ఇంటర్‌లో 58 మందికి గాను నలుగురు ఉత్తీర్ణులయ్యారు. ఆర్డీటీ, స్థానికుల సాయంతో రూ.66లక్షలతో కళాశాల భవనం నిర్మించారు. సిబ్బందీ ఉన్నా.. ఉత్తీర్ణత మాత్రం సాధించకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని