logo

‘చెత్త’ పాలన

సొంత వారికి ఆదాయం దోచిపెట్టేందుకు వైకాపా ప్రభుత్వం ‘చెత్త’ మార్గాలు అన్వేషించింది. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌తో అక్రమాల చెత్తను నింపేసింది. ఉమ్మడి జిల్లాలోని నగర పాలక సంస్థతోపాటు పురపాలికల్లో చేపట్టిన క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) కార్యక్రమం అమల్లో విఫలమైంది.

Updated : 13 Apr 2024 05:09 IST

గాడితప్పిన క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌
రూ.11.72 కోట్ల పన్ను వసూళ్లు
ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే

సొంత వారికి ఆదాయం దోచిపెట్టేందుకు వైకాపా ప్రభుత్వం ‘చెత్త’ మార్గాలు అన్వేషించింది. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌తో అక్రమాల చెత్తను నింపేసింది. ఉమ్మడి జిల్లాలోని నగర పాలక సంస్థతోపాటు పురపాలికల్లో చేపట్టిన క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) కార్యక్రమం అమల్లో విఫలమైంది. 2021 అక్టోబరు 2న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్లాప్‌ ఆటోలను తెరపైకి తీసుకొచ్చారు. స్వచ్ఛత పేరుతో ప్రభుత్వ ముసుగులో వైకాపా నాయకుడు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రెడ్డి ఏజెన్సీకి క్లీన్‌ ఆటోల నిర్వహణను అప్పగించారు. అమలైన రెండేళ్లకే ఆటోల నిర్వహణ గాడి తప్పి పరిస్థితి తారుమారైంది. క్షేత్ర స్థాయిలో ప్రజలు వ్యతిరేకించడం, వేతనాలు చెల్లించకపోవడంతో ఆటోడ్రైవర్లు ఆందోళనలు, సమ్మె బాట పట్టడంతోనే సరిపోయింది.

పట్టణ ప్రజల తిరుగుబాటు

  • మొదట కర్నూలు నగర పాలక సంస్థతోపాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలికలకు ఆటోలు అందించారు. వార్డుకో ఆటో లెక్కన నాలుగు పురపాలికల్లో 172 వార్డులకు 172 ఆటోలిచ్చారు. ఆయా ఆటోలు ఇంటింటికెళ్లి చెత్తను సేకరించడం, అందుకు ప్రజల నుంచి ఆదోనిలో నెలకు రూ.29 లక్షలు, ఎమ్మిగనూరులో రూ.18 లక్షలు, నంద్యాలలో రూ.36 లక్షలు, కర్నూలులో రూ.50 లక్షల పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
  • ఆదోనిలో చెత్త పన్ను వసూలుకు వెళ్లిన ఆటో నిర్వాహకులపై ప్రజలు తిరగబడ్డారు. ‘మీ ఆటోలు వద్దు.. మీ చెత్త బుట్టలు వద్దు.. చెత్తకు రుసుము వసూలు చేయడమేమిటి’ అని గట్టిగా ప్రశ్నించారు. ఇచ్చిన చెత్త డబ్బాలను ఆటోల్లో విసిరేశారు. ఎమ్మిగనూరులో సైతం ఇలానే సిబ్బందిని నిలదీశారు. కర్నూలులో చెత్త రుసుము చెల్లించలేదని నగర పాలక సంస్థ సిబ్బంది ఏకంగా దుకాణం ఎదుట చెత్తను తెచ్చి కుప్పగా పోయడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని ప్రజలు చెత్త పన్నుపై ప్రశ్నించారు.

ముక్కుపిండి వసూలు

  • జగన్‌ పాలనలో భారీగా పెంచిన ఆస్తి పన్నుకుతోడు ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తకు యూజర్‌ ఛార్జీలు పట్టణ ప్రజలకు మోయలేని భారంగా మారాయి. పన్ను చెల్లించకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని బెదిరిస్తున్నారు. ఎమ్మిగనూరులో వృద్ధులకిచ్చే పింఛన్‌ డబ్బుల నుంచి తీసుకున్నారు. కర్నూలులో దుకాణాల ఎదుట చెత్త వేసి వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
  • ఉమ్మడి జిల్లాలోని కర్నూలు నగర పాలక సంస్థతోపాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సంఘాల్లో మొత్తం 172 వార్డులున్నాయి. వీటిలో 2.49 లక్షల నివాసాలు, నివాసేతర, వాణిజ్య, వ్యాపార సముదాయాలున్నాయి. ఇప్పటి వరకు ప్రజల నుంచి రూ.11,72,90,320 చెత్త పన్ను వసూలైంది. కర్నూలు రూ.7 కోట్లు, నంద్యాల రూ.3 కోట్లు, ఆదోని రూ.1.02 కోట్లు, ఎమ్మిగనూరు రూ.70 లక్షలు, డోన్‌లో రూ.34 వేలు, ఆళ్లగడ్డలో రూ.18 వేలు, ఆత్మకూరులో రూ.37 వేలు వరకు వసూలు చేశారు.  

టైర్లలో గాలి కొట్టించుకోవాలన్నా.. పంక్చర్‌ వేయించాలన్నా.. చిన్నపాటి మరమ్మతులకూ సిబ్బందే భరించాల్సిన పరిస్థితి నెలకొంది. వీటికి ఇంత వరకు గుత్తేదారు నయాపైసా నిధులు ఇవ్వలేదు. క్లచ్‌ ప్లేట్లు, గేర్‌ బాక్సులు, టైర్లు, ట్యూబ్‌లు తదితరాలు పోయిన వాహనాలకు రూ.వేలల్లో ఖర్చవుతోంది. ఆ స్థాయిలో ఖర్చులు భరించలేక సిబ్బంది చేతులెత్తేశారు.


పురపాలికలపై భారం

క్కో ఆటోకు నెలవారీ అద్దె రూ.63 వేలుగా నిర్ణయించారు. ఈ లెక్కన రూ.1.08 కోట్ల ఖర్చు. ప్రస్తుతం ఒక్కో ఆటోకు అద్దెను రూ.68 వేలకు పెంచారు. ప్రజల నుంచి చెత్త రుసుము ఆశించిన స్థాయిలో వసూలు కాకపోవడంతో, ఆటోల నిర్వహణ దినదిన గండంగా మారింది. దీంతో అద్దె భారం తగ్గించుకునేందుకు పురపాలికలు సంఖ్య కుదిస్తూ వచ్చాయి. చివరికి ఆదోనిలో 16, నంద్యాలలో 16, ఎమ్మిగనూరులో 10, కర్నూలులో 90 చెత్త సేకరణ ఆటోలు నడుస్తున్నాయి. డోన్‌కు పది ఆటోలిచ్చారు. తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో నిలిపివేశారు. ఆళ్లగడ్డకు ఐదు ఆటోలిచ్చి ఆపేశారు. ఆత్మకూరుకూ ఐదారు ఆటోలిచ్చి చేసేదిలేక పక్కన పెట్టేశారు. ఆటోల బకాయిలను పురపాలక సాధారణ నిధుల నుంచి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికార పార్టీ వార్డు కౌన్సిలర్లే వ్యతిరేకించారు.

  • ఆటోల సంఖ్య : 190
  • నిత్యం పోగయ్యే చెత్త : 500-600
  • మెట్రిక్‌ టన్నులు
  • ఒక్కో ఆటోకు నెల అద్దె : రూ.68 వేలు
  • (గతంలో రూ.63 వేలు)
  • నెలకు అద్దె భారం : రూ.1.08 కోట్లు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు