logo

ఎక్కడికక్కడ నిలదీతలు

సార్వత్రిక ఎన్నికల సమయం ప్రారంభమైంది. బరిలో దిగిన అభ్యర్థులు ప్రచారాలు చేస్తున్నారు. మరోవైపు ప్రజలు అధికార వైకాపా నాయకులను ఎక్కడికక్కడ కడిగేస్తున్నారు.

Published : 14 Apr 2024 02:59 IST

అయోమయంలో వైకాపా నేతలు

ఈనాడు, నంద్యాల : సార్వత్రిక ఎన్నికల సమయం ప్రారంభమైంది. బరిలో దిగిన అభ్యర్థులు ప్రచారాలు చేస్తున్నారు. మరోవైపు ప్రజలు అధికార వైకాపా నాయకులను ఎక్కడికక్కడ కడిగేస్తున్నారు. ఐదేళ్లపాటు ఎక్కడికెళ్లారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రచారం కోసం వచ్చిన ముఖ్యమంత్రినే జనం నిలదీయడం సంచలనంగా మారింది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదంటూ నేతలను నిర్మొహమాటంగా ప్రశ్నిస్తుండడంతో ఏమి సమాధానం చెప్పాలో పాలకులకు పాలుపోవడంలేదు. వారిని సముదాయించేందుకు వైకాపా అభ్యర్థులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏటా వేసవిలో వందలాది గ్రామాల్లో తాగునీటి సమస్య వేధిస్తున్నా అధికార పార్టీ నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్రలో భాగంగా కోడుమూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు కొత్తూరు గ్రామంలో పలువురు మహిళలు ఖాళీ బిందెలు చూపి నిరసన తెలిపారు. తుగ్గలి మండలం జొన్నగిరిలోనూ మహిళలు ముఖ్యమంత్రిని నిలదీశారు.

గడపగడపకు పేరు చెప్పి

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ముఖ్యమంత్రి జగన్‌ ఎమ్మెల్యేలను ఇంటింటికి తిప్పారు. ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులు తీసుకుని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి వార్డు/గ్రామ సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున కేటాయిస్తామని ప్రభుత్వ ప్రకటించింది. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లను పరిశీలించి చేయాలని సూచించింది. క్షేత్రస్థాయిలో జరిగింది అరకొరే. ఫలితంగా పలువురు ఎమ్మెల్యేలు ప్రచారానికి వెళ్లేందుకు కూడా జంకాల్సిన దుస్థితి నెలకొంది.

గుక్కెడు నీటికి అల్లాడుతున్నాం

ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో నీటి సమస్యపై మంత్రి బుగ్గన కుమారుడు అర్జున్‌రెడ్డిని పలువురు మహిళలు నిలదీశారు. గ్రామంలో సుమారు 200 కుటుంబాలకు తాగేందుకు గుక్కెడు నీళ్లు రావడంలేదని... ఇదేనా అభివృద్ధి? అని ప్రశ్నించడంతో బుగ్గన కుమారుడు నివ్వెరపోయారు. ట్యాంకర్లు మొక్కుబడిగా పంపుతున్నారని.. నీరు సరిపోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

జనం ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి

మెగా డీఎస్సీపై ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకను, రహదారి సమస్యపై ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కుమార్తె గౌతమీరెడ్డిని, నీటి సమస్యపై సి.బెళగల్‌ మండలం పలుకుదొడ్డిలో ఎమ్మెల్యే సుధాకర్‌, కుడా ఛైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సతీశ్‌ను మూడు రోజుల కిందట నిలదీశారు. వెల్దుర్తి మండలం బుక్కాపురంలో ఇంటి బిల్లులు రాలేదని ఒకరు, ఉపాధి హామీ పనులు చూపడం లేదని మరికొందరు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిని నిలదీశారు. ఆస్పరి మండలం ములుగుందం గ్రామ ఎస్సీ కాలనీలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షిని కాలనీ మహిళలు చుట్టుముట్టారు. కౌతాళంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమార్తె ప్రియాంకను పలువురు మహిళలు నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని