logo

అవాస్తవాలు.. దుష్ప్రచారాలు చేస్తే కటకటాలే

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ అభ్యర్థుల విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. బనగానపల్లి ఎమ్మెల్యే కుమారుడు మాజీ ఎమ్మెల్యేపై చేసిన ఘాటు విమర్శల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

Published : 14 Apr 2024 03:12 IST

చట్టపరమైన చర్యలు

న్యూస్‌టుడే, కర్నూలు నేరవిభాగం, నంద్యాల నేరవిభాగం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ అభ్యర్థుల విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. బనగానపల్లి ఎమ్మెల్యే కుమారుడు మాజీ ఎమ్మెల్యేపై చేసిన ఘాటు విమర్శల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వివాదాస్పదంగా మారటంతో ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. కర్నూలు వైకాపా కార్పొరేటర్‌ చిన్నాన్న అదే పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చి చేరినట్లు వైకాపా నేతలు ఆయనకు కండువా వేయటం.. చేరికల డ్రామా అంటూ సదరు పోస్టు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. నందికొట్కూరులో ఓ వైకాపా నాయకుడు ఓ ముస్లిం మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఉద్రిక్తంగా మారిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కొందరు నాయకులు పార్టీ మారే అలోచనలు లేనప్పటికీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వెలిసిన పోస్టులు వైరల్‌ మారటంతో సదరు నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. విమర్శల పోస్టులు, అవాస్తవ వార్తలకు సంబంధించి నంద్యాల ఎన్నికల అధికారులు 14 మందికి నోటీసులు జారీ చేశారు.

విద్వేషపూరిత ప్రసంగం, తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేశారు. ఏఏ సెక్షన్లు వర్తిస్తాయి.. వాటి పరిణామాలు ఎలా ఉంటాయో వివరించి అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచేందుకు కలెక్టర్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించే ప్రత్యేక కమిటీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.

1.త్వరలో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో.. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు పడతాయో తదితర వివరాలతో ఇంటలిజెన్స్‌ బ్యూరో ఇచ్చిన నివేదిక అంటూ సామాజిక మాధ్యమాలు, పలు ఛానళ్లలో ఓ పోస్టు వైరలైంది. అవి తప్పుడు పోస్టులంటూ ఆయా ఛానళ్లు ప్రజలకు వివరించాయి.

2.ముస్లిం సోదరుల్లారా.. తస్మాత్‌ జాగ్రత్త అంటూ ముస్లిం మేధావుల సంఘం పేరుతో తెదేపా, జనసేన, జనసేన కూటమికి వ్యతిరేకంగా అవాస్తవాలతో కూడిన కరపత్రాలను జిల్లాలో మైనార్టీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పలువురు పంపిణీ చేశారు. సదరు కరపత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కుట్ర వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నట్లు తెలిసింది.

3.అధికార పార్టీకి చెందిన ఓ కర్నూలు ప్రజాప్రతినిధి విజయవాడ నుంచి పార్టీ ఫండ్‌ తీసుకొచ్చి పంచకుండా స్వాహా చేసినట్లు అదే పార్టీకి చెందిన మరో నాయకుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టి తొలగించటం వివాదాస్పదంగా మారింది. సదరు ప్రజాప్రతినిధి అనుచరులు అతడిని ఇంటి నుంచి కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి కొట్టడంతో ఆయన పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. చివరికి సదరు నాయకుడు అదేరోజు రాత్రి మళ్లీ పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన ఫిర్యాదు పత్రాన్ని వెనక్కు తీసుకున్నారు.

ఐపీసీ సెక్షన్‌ 505: ఇతర వర్గాలను ప్రేరేపించే ఉద్దేశంతో వారికి వ్యతిరేకంగా తప్పుడు ప్రకటనలు, సందేశాలను ప్రచారం చేసి శాంతికి భంగం కల్గించే చర్యలకు పాల్పడితే బాధ్యులపై ఈ సెక్షన్‌ కింద చర్యలు తీసుకుంటారు. మూడేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా.. లేదా రెండూ అమలవుతాయి.

సెక్షన్‌ 125, ప్రజాప్రతినిధుల చట్టం 1951..: ఎన్నికలకు సంబంధించి వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పోత్సహించే చర్యలకు పాల్పడితే ఈ చట్టం అమలు చేస్తారు.
ఐపీసీ 153ఏ: మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష తదితర అంశాలపై సమూహాల మధ్య శతృత్వాన్ని పెంపొందించటం, సామరస్య పరిరక్షణకు హాని కలిగించే చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటారు.

ఐపీసీ 153 బీ : జాతీయ సమగ్రతకు విఘాతం కలిగించే ఆరోపణలు, వాదనలు చేస్తే కేసులు నమోదు చేస్తారు.

ఐపీసీ 295 ఏ : ఉద్దేశపూర్వక, హానికరమైన చర్యలకు పాల్పడటం, సామాజిక వర్గాలు, మత విశ్వాసాలను అవమానపరచడం వంటి చర్యలకు పాల్పడితే ఈ చట్టం వర్తిస్తుంది.

ఐపీసీ 298 : మతపరమైనభావాలు గాయపరిచే చర్యలకు పాల్పడితే ఈ చట్టం వర్తిస్తుంది.

సెక్షన్‌ 123(3ఏ) ప్రజాప్రతినిధుల చట్టం, 1951 : కులం, మతం, జాతి, భాష ప్రాతిపదికన అభ్యర్థి లేదా అతని ఏజెంటు లేదా ఇతర వ్యక్తుల ద్వారా వివిధ తరగతుల మధ్య శత్రుత్వం లేదా ద్వేషభావాలు ప్రోత్సహించేందుకు యత్నిస్తే చర్యలు తీసుకుంటారు.

సెక్షన్‌ 94, ప్రజాప్రతినిధుల చట్టం 1951 : ఓటింగ్‌ గోప్యత ఉల్లంఘిస్తే ఈ చట్టం వర్తిస్తుంది.

ఐపీసీ 171 సి : స్వేచ్ఛగా ఓటేసే అవకాశం ఉన్నచోట ఓటర్లను ఒత్తిడికి గురిచేసినా, బెదిరించినా, ఇతర పద్ధతుల్లో ప్రభావాలకు గురిచేస్తే ఈ చట్టం ద్వారా చర్యలు తీసుకుంటారు.

ఐపీసీ 171 జి : అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసే తప్పుడు ప్రకటనలు, ప్రచారాలు చేస్తే కేసులు నమోదు చేస్తారు.

సెక్షన్‌ 126 ఏ, ప్రజాప్రతినిధుల చట్టం 1951 : నిర్ణీత వ్యవధిలో ఎగ్జిట్‌పోల్స్‌ నిర్వహించటం, వాటి ఫలితాలు ప్రచారం చేయటం నిషేధం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని