logo

టిడ్కో గృహం.. జగన్‌ గ్రహణం

పేదల ప్రభుత్వమని గొప్పలు చెబుతారు.. వారి ఇళ్లను పూర్తి చేయాలంటే మనసొప్పదు.. కట్టినవి పూర్తి చేయరు.. కొత్త వాటికి పునాది వేయరు.. పేదలకు అన్ని వసతులతో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలని గత తెదేపా ప్రభుత్వం సంకల్పించింది..

Published : 14 Apr 2024 03:19 IST

తాళాలిచ్చారు.. తలుపులు మూశారు
దరఖాస్తుదారులకు తప్పని అద్దె నివాసం

జగన్నాథగట్టు ప్రాంతంలో

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: పేదల ప్రభుత్వమని గొప్పలు చెబుతారు.. వారి ఇళ్లను పూర్తి చేయాలంటే మనసొప్పదు.. కట్టినవి పూర్తి చేయరు.. కొత్త వాటికి పునాది వేయరు.. పేదలకు అన్ని వసతులతో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలని గత తెదేపా ప్రభుత్వం సంకల్పించింది.. బడుగులకు అన్ని వసతులతో ఇళ్లు దక్కడం జగన్‌కు రుచించనట్టుంది. ఐదేళ్లుగా లబ్ధిదారులకు ఇవ్వకుండా నాన్చుతున్నారు. ఇళ్లు పూర్తిచేసి పేదలకు ఇవ్వాల్సిన చోట.. వైకాపా రంగులు వేసుకుని నాయకులు సొంత డాబు కొట్టే ప్రయత్నం చేసింది. రంగుల కోసం ఒక్కో పురపాలికల్లో రూ.10-15 కోట్ల వరకు సమర్పించారు... మౌలిక వసతులు కల్పించకుండా తాళాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. అక్కడికి వెళ్లి నివాసం ఉండలేక పేదలు ఇబ్బంది పడుతున్నారు.

ఎక్కడ ఎలా ఉందంటే

నంద్యాల: పట్టణ సమీపంలో పదివేల ఇళ్లు నిర్మించారు. ఇప్పటి వరకు 700 మందికి తాళాలిచ్చారు. ప్రస్తుతం 32 మంది వరకు నివాసం ఉంటున్నారు. ఇళ్లు కేటాయించలేదు కాబట్టి డబ్బులు తిరిగి చెల్లించాలని 48 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి రూ.20 లక్షల వరకు రావాల్సి ఉంది.
ఆదోని: పట్టణ శివారులో 4,208 ఇళ్లు నిర్మించగా.. 1600 మందికి తాళాలిచ్చారు. ఒక్క కుటుంబ కూడా నివాసం ఉండటం లేదు. ఇంటికి ముందస్తుగా చెల్లించిన డబ్బులివ్వాలని కోరుతూ 60 మంది వరకు అర్జి పెట్టుకున్నారు.. సుమారు రూ.అర కోటి వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది.
ఎమ్మిగనూరు: 4,272 ఇళ్లు నిర్మించగా.. 935 మందికి ఇంటి తాళాలిచ్చారు. ఇక్కడా 176 మంది డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. వీరికి రూ.కోటి దాకా చెల్లించాల్సి వస్తుంది.
కర్నూలు: నగర శివారులో పదివేల గృహాల నిర్మాణం పూర్తి చేశారు. రెండు వేల మందికి తాళాలిచ్చారు. ఒక్క కుటుంబం కూడా నివాసం ఉండటం లేదు. 581 మంది లబ్ధిదారులు ( 365 చ.అ, 430 చ.అ) తాము చెల్లించిన సొమ్ము (మొత్తం రూ.2.70 కోట్లు) తిరిగివ్వాలని దరఖాస్తు పెట్టుకున్నారు.
ఆళ్లగడ్డ: ఒక్కో ఇల్లు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా 1,394 ఇళ్లు నిర్మించారు. వీటికి లబ్ధిదారులు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సినవసరం లేదు. వెయ్యి మందికి తాళాలు ఇచ్చారు.. ఏడు వందల మంది గృహ ప్రవేశాలు చేశారు. సరైన మౌలిక వసతుల్లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు.
డోన్‌: ఒక్కో ఇల్లు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా 244 ఇళ్లు నిర్మించారు. కొందరు న్యాయస్థానానికి వెళ్లడంతో తాళాలు ఇవ్వలేదు.

అసెంబ్లీ మాట.. నీటి మూట

‘‘ 365 చ.అ. విస్తీర్ణం ఉన్న ఇళ్ల లబ్ధిదారులు తమ వాటాగా రూ.50 వేలు కట్టాలి. దాన్ని రూ.25 వేలకు తగ్గిస్తాం. 430 చ.అ. విస్తీర్ణం ఉన్న ఇళ్ల లబ్ధిదారులు రూ.లక్ష చెల్లించాలి. దాన్ని రూ.50 వేలకు కుదిస్తాం. ప్రభుత్వమే ఆ భారాన్ని భరిస్తుందని’’ 2020 డిసెంబరులో అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రి మాట నీటిమూటే అయింది. యాభై శాతం రాయితీ కోసం లబ్ధిదారులు ఏళ్ల తరబడిగా నిరీక్షిస్తున్నారు.

  • ఎక్కడ: కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, డోన్‌
  • నిర్మించాల్సిన ఇళ్లు: 30,630
  • ప్రాజెక్టు విలువ: రూ.2,318 కోట్లు
  • ఇప్పటి వరకు తాళాలు ఇచ్చింది: 5,547

ఐదేళ్ల అద్దె భారం రూ.695.4 కోట్లు

నాడు ఉమ్మడి జిల్లాలోని నాలుగు పురపాలికల్లో ఇళ్ల కోసం వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. ఇందులో మొదటి విడత కింద 28 వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. పట్టణవాసులై ఉండి, సొంతిల్లు ఉండరాదు, బీపీఎల్‌ పరిధిలో ఉండాలి. వచ్చిన దరఖాస్తులను పురపాలక అధికారులు బృందాలుగా విచారించి, లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరంతా పేద, మధ్య తరగతికి చెందిన వారు, అద్దె ఇళ్లలో ఉంటున్న వారే. ఈ లెక్కన ఒక్కో ఇంటికి సరాసరి రూ.4వేలు అద్దె ప్రకారం నెలకు రూ.11.59 కోట్లు ఏడాదికి రూ.139.08 కోట్లు, ఐదేళ్లకు లెక్కిస్తే రూ.695.4 కోట్లు అద్దె భారం వైకాపా ప్రభుత్వం తీరుతో పేదలపై పడింది.  టిడ్కో ఇళ్లకు జనం డబ్బులు చెల్లించారు. వాటినీ నాటి తెదేపా ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది.

ఆరు పట్టణాలు.. 30,630 ఇళ్లు

పేదలకు అన్ని వసతులతో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలని గత తెదేపా ప్రభుత్వం సంకల్పించింది. ఇళ్ల నిర్మాణాన్ని టిడ్కో(టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) చేపట్టింది. మొదటి రకం (300 చదరపు అడుగులు) నివాసాలు ఉచితంగా ఇస్తారు. కేంద్ర, రాష్ట్ర వాటా రాయితీ రూ.3 లక్షలు చెల్లిస్తుంది. రెండో రకం ( 365 చ.అ) నివాసానికి లబ్ధిదారి వాటా రూ.50 వేలు. మూడో రకం (430 చ.అ) నివాసానికి లబ్ధిదారు వాటా రూ.లక్ష (నాలుగు విడతల్లో) చెల్లించాలి. రెండో రకానికి రూ.3.15 లక్షలు, మూడోరకం ఇంటికి రూ.3.65 లక్షలు బ్యాంకు రుణం అందిస్తారు.

రుణం.. లబ్ధిదారులకు నరకం

ఇళ్ల కోసం లబ్ధిదారులకు బ్యాంకులు రూ.279 కోట్ల రుణం చెల్లించాల్సి ఉండగా రూ.141.50 కోట్లు చెల్లించారు. వాయిదాలు చెల్లించాలని, ఆయా బ్యాంకులు తాఖీదులు జారీ చేయడం, వారి ఖాతాల నుంచి వడ్డీ పేరుతో భారం మోపారు. దీంతో ఎన్‌పీలుగా మారిపోవడంతో వారి వ్యక్తిగత అవసరాలకు సైతం బ్యాంకు సేవలు అందకుండా చేసింది వైకాపా ప్రభుత్వం.   టిడ్కో ఇళ్లకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని గ్రహించిన బ్యాంకులు అటు వైపు చూడటమే మానేశాయి. దీంతో ఇళ్లు కావాల్సిన లబ్ధిదారులు ఏకమొత్తంలో సొంతంగా రుణ మొత్తాలు చెల్లిస్తే ఇళ్లను అప్పగిస్తామంటూ పురపాలికల ద్వారా నోటీసులు పంపడం విడ్డూరంగా మారింది.

మౌలిక వసతులు మమ

టిడ్కో గృహ సముదాయాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు, ఆటస్థలం, సేదదీరేందుకు ఉద్యానవనం, నడకకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని, వాణిజ్య అవసరాల కోసం బ్యాంకు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ తదితర సముదాయాలు నిర్మించి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం పట్టించుకోలేదు. మంచినీరు, మురుగు నీరు పారే వ్యవస్థ, విద్యుత్తు సౌకర్యాలు కల్పించడమే కొండంత భారంగా భావించింది. ఉద్యానవనం, నడక మార్గం, షాపింగ్‌ కాంప్లెక్స్‌ తదితర వాటిని పురపాలక సంఘాలకే వదిలేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని