logo

దళిత సంక్షేమంపై జగన్‌ కుట్ర

కృష్ణానగర్‌కు చెందిన ఆంజనేయులు ఐటీఐ (సివిల్‌) చదివారు.. సర్వే చేసేందుకు ప్రత్యేక పరికరాల కోసం ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ కింద 2017-18లో రూ.10 లక్షలు రుణం తీసుకొన్నారు. ఇందులో సుమారు రూ.4 లక్షల రాయితీ రాగా మిగతా రూ.6 లక్షలను 2022లో తీర్చేశారు.

Updated : 14 Apr 2024 05:54 IST

పథకాలన్నింటికీ సర్కారు గండి
ఉపాధికి దూరం చేసే ప్రయత్నం

పెచ్చులూడి బయటకు తేలిన ఇనుప చువ్వలు

కృష్ణానగర్‌కు చెందిన ఆంజనేయులు ఐటీఐ (సివిల్‌) చదివారు.. సర్వే చేసేందుకు ప్రత్యేక పరికరాల కోసం ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ కింద 2017-18లో రూ.10 లక్షలు రుణం తీసుకొన్నారు. ఇందులో సుమారు రూ.4 లక్షల రాయితీ రాగా మిగతా రూ.6 లక్షలను 2022లో తీర్చేశారు. ఇప్పుడు ఒక కార్యాలయం ఏర్పాటు చేసి నలుగురు ఉద్యోగులను నియమించుకొని ప్రైవేటు సర్వే చేస్తూ తాను సంపాదిస్తూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు.

‘‘ నా ఎస్సీలు.. నా ఎస్టీలు అంటూ ఎక్కడికక్కడ ఊదరగొట్టే జగన్‌.. దళిత సం‘క్షేమం’పై కుట్ర పన్నారు. పేదల పక్షపాతిగా పైకి చెప్పుకొనే జగన్‌ అధికారంలోకి రాగానే ఒక్క కలంపోటుతో కుల కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. అట్టడుగు వర్గాలు స్వయంగా ఎదగకుండా... తన దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి బతికేలా దురాలోచనను అమలు చేస్తున్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేశారు. నత్తగుల్లలాంటి నవరత్న పథకాలకు నిధులు బదిలీ చేస్తూ అంకెల గారడీతో ఎస్సీలను వంచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2 లక్షల కుటుంబాలకుపైగా ఎస్సీ, ఎస్టీలున్నారు. ఉపాధిని దెబ్బతీయడం ఒక్కటే కాదు... వారికి అందుతున్న నాణ్యమైన విద్య, ఏళ్లుగా అమలవుతున్న ప్రత్యేక పథకాలు, ప్రత్యేక చట్టాల ద్వారా అందుతున్న సాయం... ఇలా అన్నింటికీ జగన్‌ ప్రభుత్వం పాతరేసింది. సొంతంగా ఎదిగే అవకాశాల్లేకుండా జీవితాలను ఛిద్రం చేశారు.’’

కర్నూలు సంక్షేమం, సచివాలయం, గాయత్రి ఎస్టేట్‌ న్యూస్‌టుడే: ఉప ప్రణాళిక కింద మూడేళ్లలో కేవలం 3,412 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చారు. చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

నగరంలోని రాజ్‌విహార్‌ సమీపంలోని అంబేడ్కర్‌ భవన్‌ శిథిలావస్థకు చేరింది. పెచులూడి ఇనుప చువ్వలు బయటకు తేలి ప్రమాదకరంగా మారాయి

నిర్వీర్యం చేసి.. నిరుద్యోగులుగా మార్చి

తెదేపా హయాంలో ఏటా ఎస్సీ సంక్షేమ (కార్పొరేషన్‌) శాఖ ద్వారా సుమారు 4 వేల మందికి రూ.60 కోట్ల వరకు రుణాలిచ్చేవారు. ఏటా నాలుగు నుంచి ఐదు వేల మంది రాయితీ రుణాలు తీసుకునేవారు. ఆ డబ్బులతో స్వయం ఉపాధి పొందేవారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి తాళం వేసింది. ఒక్కరికీ రుణం ఇవ్వలేదు. జగనన్న చేదోడు కింద ఎస్సీ లబ్ధిదారులకు ఏడాదికి రూ.18,500 చొప్పున ఇస్తున్నామని వైకాపా గొప్పలు చెబుతోంది. నిరుద్యోగ యువత ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు రుణం ఇవ్వాల్సి ఉండగా.. దానిని పది మందికి పంచి ఎక్కువ మంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఇచ్చినట్లు గొప్పలు చెబుతోంది. ఎస్సీ నిరుద్యోగులకు ఉపాధి చూపింది శూన్యమే. బటన్‌ నొక్కడం వల్ల స్వయం ఉపాధి లేకుండా పోయిందని యువకులు పేర్కొంటున్నారు.

బెస్టు పథకాన్ని మడతపెట్టేశారు

ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకాన్ని నిర్వీర్యం చేశారు. గత 25 ఏళ్లుగా అమలవుతున్న దీన్ని జగన్‌రెడ్డి అటకెక్కించారు. ఈ పథకానికి సంబంధించి (2020-21, 2021-22 విద్యా సంవత్సరం) 2,301 మంది విద్యార్థుల ఫీజు రూ.6.24 కోట్లు చెల్లించాల్సి ఉంది. పెండింగ్‌ పెట్టిన వైకాపా 2022-23లో విడుదల చేసింది. బిల్లులు ఆర్‌బీఐలో పెండింగ్‌లో ఉన్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు.

సమస్యల గృహాలు

నాడు-నేడు రెండో దశలో కర్నూలు జిల్లాలో 28 సాంఘిక సంక్షేమ ప్రీ-మెట్రిక్‌ వసతి గృహాలు, నాలుగు సాంఘిక సంక్షేమ పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాల మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జగన్‌ ఒక్క రూపాయి విడుదల చేయలేదు. నంద్యాల జిల్లాలో ఒక సాంఘిక సంక్షేమ ప్రీ మెట్రిక్‌ వసతి గృహం, ఆరు పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలు ప్రైవేటు (అద్దె) భవనాల్లో కొనసాగుతున్నాయి. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు విద్యార్థుల చదువుకు ఆటంకంగా మారాయి.

దళితులపై దౌర్జన్యకాండ

కర్నూలు నేర విభాగం: రాష్ట్రంలో ‘రాజా’రెడ్డి రాజ్యాంగం అమలవుతున్న జగన్‌ జమానాలో దళితులపై దౌర్జన్యకాండ కొనసాగుతోంది. పెత్తందారు పాలనలో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల వర్గీయులపై అత్యాచారాలు, హత్యలు, దాడులు, దౌర్జన్యాల పర్వం పెరిగింది. గత ఐదేళ్లలో వారి భద్రత గాలిలో దీపంలా మారింది. 2022లో ఆరుగురు దళితులు హత్యకు గురయ్యారు. 19 మందిపై హత్యాయత్నం జరిగింది. ఎనిమిది మంది ఎస్సీ, ఎస్టీ మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. 2020 అక్టోబరులో నంద్యాల పరిధిలోని పొన్నాపురంలో దళిత న్యాయవాది సుబ్బరాయుడు దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది. 2021 ఆగస్టులో నంద్యాల పట్టణంలో విలేకరి చెన్నకేశవులు అదే ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్‌ చేతిలో హత్యకు గురయ్యారు. హొళగుంద మండలం పెద్దగోనెహల్‌లో స్థలం విషయంలో దళితులపై అదే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు.

సెంటు పొలం ఇవ్వక.. ఉన్నది ఆక్రమణ

తెదేపా హయాంలో (2014 నుంచి 2019) ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు వెచ్చించి భూ కొనుగోలు పథకం, ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకాల కింద 18,454 మందికి రూ.318.65 కోట్ల రుణాలు ఇచ్చారు. వైకాపా వచ్చిన తర్వాత సెంటు పొలం ఇవ్వలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,120 మంది లబ్ధిదారులకు 5,510.57 ఎకరాలపై సంపూర్ణ హక్కులు కల్పించినట్లు వైకాపా ప్రచారం చేసుకుంటోంది. ముందస్తుగా విషయం తెలుసుకొన్న అధికార పార్టీ నేతలు పలుచోట్ల భూములు ఆక్రమించుకుని సంపూర్ణ హక్కులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

నిరుద్యోగులకు శిక్ష

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్టడీ సర్కిళ్ల నిర్వహణ ఊసేలేకపోయింది. గత ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకుపైగా ఖర్చు పెట్టి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఉద్దేశించిన విద్యోన్నతి పథకాన్ని జగన్‌ ఆపేశారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు ఉచితంగా శిక్షణ ఇవ్వకుండా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి ఆర్థిక సాయం అందిస్తామనే పథకాన్ని తెచ్చారు. ఈ ప్రోత్సాహక పథకం ఉమ్మడి జిల్లాలో ఐదారు మందికి కూడా ఆసరా కాలేదు.

విదేశీ చదువును ఆపేశారు

విదేశాలకు వెళ్లి చదువుకునేవారి కోసం తెదేపా హయాంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విదేశీ విద్యా పథకం కొనసాగింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లు పట్టించుకోలేదు. బాధితులు కొందరు కోర్టుకు వెళ్తేగానీ మేల్కోలేదు. ఏకంగా అంబేడ్కర్‌ పేరు తొలగించి 2022-23లో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంగా మార్చారు. ఎక్కడా లేని నిబంధనలు పెట్టి చాలా మందిని అర్హతకు నోచుకోకుండా చేశారు. 2022-23లో కర్నూలు జిల్లా నుంచి ఒక్క విద్యార్థిని మాత్రమే ఎంపిక చేశారు. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకాన్ని రద్దు చేశారు.

పేదింట అంధకారం

‘‘ తాము అధికారంలోకి వస్తే పేదలకు 200 యూనిట్లలోపు కరెంట్‌ ఉచితంగా ఇస్తామని’’ ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా 2017 నవంబరు 27న ఎర్రగుడిలో జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మడత పెట్టేశారు. ఉచిత విద్యుత్తు పథకం లబ్ధిదారులను ఆరంచెల పద్ధతిలో వడబోసి కొందరికే ప్రయోజనం కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని