logo

వైకాపా అభ్యర్థులు.. నీళ్లునములుతున్నారు

నీళ్లు లేవు.. రోడ్లు వేయరు.. ఉద్యోగాలు భర్తీ చేయరు వంటి సమస్యలపై వైకాపా అభ్యర్థులను జనం ప్రశ్నిస్తోంది.. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పల్లె బాట పడుతున్నారు.

Published : 14 Apr 2024 03:24 IST

ఆస్పరి: ‘‘ ప్రతి సారి ఓట్లు వేయించుకుంటారు వెళ్తారు. తిరిగి మా గ్రామాలవైపు కన్నెత్తి చూడరు.. మా గ్రామ సమస్యలు ఎవరూ పట్టించుకోరని ఆలూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షిని మహిళలు నిలదీశారు. ఆస్పరి మండలం ములుగుందంలో శనివారం పర్యటించిన ఆయనపై మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు. నీటి సమస్య ఉందని, సీసీ రహదార్లు లేక అవస్థలు పడుతున్నామన్నారు.

ఈనాడు, కర్నూలు : నీళ్లు లేవు.. రోడ్లు వేయరు.. ఉద్యోగాలు భర్తీ చేయరు వంటి సమస్యలపై వైకాపా అభ్యర్థులను జనం ప్రశ్నిస్తోంది.. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పల్లె బాట పడుతున్నారు. జనం ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఐదేళ్లపాటు ఎక్కడికెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నీటి సమస్యను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏటా వేసవిలో వందలాది గ్రామాల్లో తాగునీటి సమస్య వేధిస్తున్నా అధికార పార్టీ నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్రలో భాగంగా కోడుమూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు కొత్తూరు గ్రామంలో పలువురు మహిళలు ఖాళీ బిందెలు చూపి నిరసన తెలిపారు. తుగ్గలి మండలం జొన్నగిరిలోనూ మహిళలు ముఖ్యమంత్రిని నిలదీశారు. ప్రస్తుతం ప్రచారానికి వెళ్తున్న వైకాపా అభ్యర్థులను మహిళలు చుట్టుముడుతున్నారు.

జనం ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి

  • సి.బెళగల్‌ మండలం పలుకుదొడ్డికి ప్రచారానికి వెళ్లిన కుడా ఛైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సతీశ్‌ను నీళ్లేవని గ్రామస్థులు నిలదీశారు. గత ఎన్నికల సమయంలోనూ గ్రామానికి వచ్చి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ ఇప్పిస్తామని హామీ ఇచ్చారని... దానికి అతీగతీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మళ్లీ ఇంకో అభ్యర్థిని తీసుకొచ్చారని కోట్ల హర్షవర్ధన్‌రెడ్డిని నిలదీశారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అడ్డుపడి ప్రశ్నించడంతో ఏమి సమాధానం చెప్పాలో వారికి అర్థం కాని పరిస్థితి. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
  • మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి వైకాపా ప్రభుత్వం మోసం చేసిందంటూ ఓ నిరుద్యోగి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకను నిలదీయడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. రహదారులు సరిగా వేయలేదని, నీళ్లు సరిగా రావడం లేదని పలువురు ఆమెను నిలదీస్తున్నారు.
  • ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కుమార్తె గౌతమీరెడ్డి ప్రచారం కోసం వెళ్లినప్పుడు రహదారి సమస్య గురించి పలువురు ఆమెను ప్రశ్నించారు. కాలువ పొంగి  రోడ్డంతా మురికిమయంగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • ఆదోని మండలం బైచిగేరికి రెండురోజుల కిందట ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డిని జనం నిలదీశారు. పింఛన్లు, తాగునీరు, మురుగు కాల్వలు, విద్యుత్తు స్తంభాలు తదితర సమస్యలు పరిష్కరించాలని పల్లెవాసులు ప్రశ్నించారు.
  • వెల్దుర్తి మండలం బుక్కాపురంలో ఇంటి బిల్లులు రాలేదని ఒకరు, ఉపాధి హామీ పనులు చూపడం లేదని మరికొందరు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిని నిలదీశారు. రత్నపల్లి, గువ్వలకుంట్ల గ్రామాలో మంచి నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు అడ్డుకున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు