logo

జగనన్న ఏలుబడిలో రుచి తప్పిన భోజనం

‘‘మన ఇంట్లో మనం తినే భోజనం ఎంత శుచిగా ఉండాలని అనుకుంటామో.. స్కూళ్లలో వండే ఆహారమూ అంతే నాణ్యంగా ఉండాలి’’ అంటూ సీఎం జగన్‌ పదే పదే చెబుతుంటారు..

Published : 17 Apr 2024 03:14 IST

ఇంటి నుంచే తెచ్చుకుంటున్న విద్యార్థులు
సరిగా లేదని పారబోస్తున్న పిల్లలు
కర్నూలు, నంద్యాల విద్య

‘‘మన ఇంట్లో మనం తినే భోజనం ఎంత శుచిగా ఉండాలని అనుకుంటామో.. స్కూళ్లలో వండే ఆహారమూ అంతే నాణ్యంగా ఉండాలి’’ అంటూ సీఎం జగన్‌ పదే పదే చెబుతుంటారు.. కానీ తన ఏలుబడిలో ఆహార పదార్థాలు బాగా లేకపోవడంతో పిల్లలు తినడానికి ఇష్టపడటం లేదు. రుచికరంగా రోజుకో మెనూ.. ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందిస్తున్నామంటూ ప్రతి సభలోనూ ఊదరగొట్టే జగన్‌ జమానాలో మధ్యాహ్న భోజనం ‘ఘోర’ముద్దలా తయారైంది.

ర్నూలు జిల్లాలో 1,433 పాఠశాలల్లో 2,56,416 మంది, నంద్యాలలో 1,369 పాఠశాలల్లో 1,49,973 మంది చదువుతుండగా... మధ్యాహ్న భోజన వంట సహాయకులు కర్నూలులో 3,399 మంది, నంద్యాలలో 2,540 మంది పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.3 వేల గౌరవ వేతనానికి గానూ మూడు నెలలుగా చెల్లించడం లేదు.


నాణ్యత లేని చిక్కీలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని విద్యార్థులకు వారంలో మూడు రోజులు చిక్కీలు ఇవ్వాలి. రెండు జిల్లాలకు చిక్కీలు సరఫరా చేస్తున్న ఏజెన్సీకి రెండు నెలలుగా సుమారు రూ.3 కోట్ల వరకు బిల్లులు ఇవ్వాలి. నాణ్యత లేనివి సరఫరా చేస్తున్నారని ప్రధానోపాధ్యాయులు ఎంఈవోల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేవు.


గుడ్లు తేలేస్తున్నారు

నెల్లూరు వాసికి చెందిన ఓ ప్రైవేటు ఏజెన్సీ గుడ్లను వారానికి ఒకసారి సరఫరా చేస్తుంది. ఎండాకాలం కావడంతో గుడ్లు నిల్వ ఉండటం లేదని, పాడవుతున్నాయని హెచ్‌ఎంలు జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఉమ్మడి జిల్లాలో పరిధిలో సుమారు రూ.4.5 కోట్ల బిల్లులు చెల్లించాలి.


నీటిశుద్ధి ఏది

కర్నూలులో మొదటి విడత కింద 567 పాఠశాలల్లో రూ.24.47 కోట్లు, నంద్యాలలో 444 బడుల్లో 12.53 కోట్లు వెచ్చించి నాడు.. నేడు కింద నీటి శుద్ధి యంత్రాలు పెట్టారు. రెండో విడత కింద కర్నూలులో 714 బడుల్లో రూ.23.38 కోట్లు, నంద్యాలలో 672 పాఠశాలల్లో రూ.14.99 కోట్లు వెచ్చించారు. వాటి నిర్వహణ సక్రమంగా లేక మూలకు చేరాయి.


మధ్యాహ్నభోజనం అంతంతే

కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్‌ పాఠశాలలో 1 నుంచి 9వ తరగతి వరకు 1,641 మంది విద్యార్థులు చదువుతుండగా...1,260 మంది విద్యార్థులు మాత్రమే సోమవారం హాజరయ్యారు. ఇందులో 655 మంది మాత్రమే మధ్యాహ్న భోజనం తిన్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మిగతా వారు ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని తిన్నారు.


కార్మికుల గుండెల్లో ధరదడ

కూరగాయలు, గ్యాస్‌, కందిపప్పు, చింతపండు, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇందుకనుగుణంగా మధ్యాహ్న భోజనం ఛార్జీలను ప్రభుత్వం పెంచడం లేదు. 1-8 తరగతులకు కేంద్రం 60%, రాష్ట్రం 40% వ్యయాన్ని భరిస్తున్నాయి. ప్రస్తుత మెనూ ప్రకారం ఒక్కో విద్యార్థికి భోజనం అందించేందుకు రూ.20 ఇవ్వాలని వంట ఏజెన్సీలు డిమాండు చేస్తున్నాయి. సర్కారు పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు.


టమాటా చారు తయారీలో... ఈ గుడ్లే విద్యార్థులకు ఇచ్చారు.

బనగానపల్లి గ్రామీణం: బనగానపల్లి పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో దాదాపుగా 830 మంది విద్యార్థులకు గాను 763 మంది హాజరయ్యారు. దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు ఇళ్లకు వెళ్లి మధ్యాహ్నం భోజనం చేశారు.

ఆళ్లగడ్డ గ్రామీణం: ఆళ్లగడ్డ మండలంలోని ఓబులంపల్లె ప్రాథమిక, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో కొందరికే గుడ్లు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలో 127 మందికి గానూ 46 మందికి, జడ్పీ ఉన్నత పాఠశాలలోనూ 146 మందికి 135 మందికి మాత్రమే గుడ్లు ఇచ్చారు. గుడ్లు సరఫరాలో లోటు ఉందని చెబుతున్నారు.  

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులోని నీలకంఠేశ్వర జడ్పీ ఉన్నత పాఠశాలలో 1,080 మందికి గాను 434 మంది భోజనం చేశారు.

మంత్రాలయం గ్రామీణం: కౌతాళం మండలంలోని హాల్వి జడ్పీ ఉన్నత పాఠశాలలో హాజరైన 476 మందిలో 456 మంది మాత్రమే భోజనం తిన్నారు. మరో 20 మంది ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తిన్నారు.


కర్నూలు నగరంలోని టౌన్‌ మోడల్‌ పాఠశాలలో మొత్తం 1004 మందికి 683 మంది హాజరయ్యారు. 240 మంది మాత్రమే భోజనం చేయగా, మిగిలిన వారు ఇళ్లకు వెళ్లి భోజనం చేశారు.


నంద్యాల జిల్లా కేంద్రంలోని నూనెపల్లె పురపాలక ఉన్నత పాఠశాలలో 414 మందికి గానూ 330 మంది భోజనం చేశారు. వారికి రోజువారీ ఖర్చు రూ.4,290 కాగా, నిర్వాహకులకు ప్రభుత్వం ఇస్తున్నది మాత్రం రూ.2,828 మాత్రమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని