logo

స్థిరాస్తి వ్యాపారి బరితెగింపు

ధన దాహంతో రగిలిపోతున్న ఓ స్థిరాస్తి వ్యాపారికి.. నంద్యాల ప్రజల పాలిట కల్పతరువుగా మారిన చెక్‌డ్యాం కంట్లో నలుసుగా మారింది.

Published : 17 Apr 2024 03:32 IST

ప్ర‘జల’ అవసరాలు తీరుస్తున్న చెక్‌డ్యాంపై పగ
ప్రజాప్రతినిధుల అండతో రూ.1.30 కోట్ల కట్టడం ధ్వంసం

చెక్‌డ్యాంను పగులగొట్టిన అక్రమార్కులు, కనిపించని నీటి జాడ

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : ధన దాహంతో రగిలిపోతున్న ఓ స్థిరాస్తి వ్యాపారికి.. నంద్యాల ప్రజల పాలిట కల్పతరువుగా మారిన చెక్‌డ్యాం కంట్లో నలుసుగా మారింది. చెక్‌డ్యాంలో నీరు నిల్వ ఉంటే తన వెంచర్‌లో నిర్మాణాలకు సమస్యలు ఎదురవుతున్నాయని భావించి దాని అడ్డు తొలగించుకునేందుకు కుట్రలు పన్నారు. అధికార పార్టీ అండ ఉంది.. తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో రాత్రికి రాత్రే చెక్‌డ్యాంను ధ్వంసం చేశారు. దీంతో నంద్యాల పట్టణం ఎన్జీవోకాలనీ వాసులను మళ్లీ తాగునీటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

ఖర్చులు పెరుగుతున్నాయని కసి

ఈ చెక్‌డ్యాంను అనుకునే ఒక బడా స్థిరాస్తి వ్యాపారి కొన్నేళ్ల కిందట ఒక వెంచర్‌ వేశారు. ఈ వెంచర్‌లో గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణ సమయంలో పునాదులు తీస్తుంటే ఊట ఎక్కువగా వస్తోంది. మోటార్లు పెట్టి తోడుతున్నా ఊట ఆగడం లేదు. నిర్మాణ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఊట ప్రభావంతో గతేడాది వెంచర్‌ చుట్టూ నిర్మించిన ప్రహరీ కూడా కూలింది. దీంతో స్థిరాస్తి వ్యాపారి చెక్‌డ్యాంపై పగ పెంచుకున్నారు. కొన్ని రోజుల కిందట గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళ్లలో దీన్ని పగులకొట్టించారు. పటిష్టంగా నిర్మించిన కట్టడాన్ని యంత్రాలతో ధ్వంసం చేశారు. భూమి లోపల నుంచి సుమారు ఆరు అడుగుల ఎత్తులో నిర్మించిన కట్టడాన్ని మధ్యలో పగులగొట్టించి నీళ్లు నిల్వకుండా చేశారు. దీంతో చెక్‌డ్యాంలోని నీరంతా కిందికి వెళ్లిపోయింది.

నీటి కష్టాలకు చెక్‌డ్యాం

నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు రూ.1.30 కోట్ల వ్యయంతో అప్పటి తెదేపా ప్రభుత్వం 2015లో ఈ చెక్‌డ్యాంను నిర్మించింది. నల్లమల అడవుల్లో భారీ వర్షాలు కురిసిన సమయంలో మహానంది మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి పాలేరు వాగు ద్వారా వర్షంనీరు నంద్యాల పట్టణంలోని చామకాల్వలోకి వస్తాయి. పాలేరు వాగు నుంచి చామకాల్వకు వరద నీరు చేరే సమయంలో నంద్యాల పట్టణంలోని ఎన్జీవో కాలనీ- ఎస్బీఐకాలనీ మధ్య ప్రవాహం ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నీటికి అడ్డుకట్ట వేస్తే ఎన్జీవో కాలనీలో భూగర్భ జల మట్టం పెరుగుతుందనే సదుద్దేశంతో తొమ్మిదేళ్ల కిందట పాములేటి స్వామి ఆశ్రమం సమీపంలో ఆనకట్ట కట్టారు. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చొరవతో అప్పట్లో కేసీ కెనాల్‌ అధికారులు దీనిని నిర్మించారు. చెక్‌డ్యాం నిర్మాణంతో ఈ ప్రాంతంలో నీటి సమస్యలు పరిష్కారమయ్యాయి. ఎన్జీవో కాలనీలో భూగర్భజల మట్టం పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని