logo

ట్యాబు జగన్‌ డాబు

‘ట్యాబ్‌ల కారణంగా పిల్లలకు చదువులకు ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఉపాధ్యాయులు చెప్పే అంశాలు బాగా అర్థమవుతాయి.

Published : 20 Apr 2024 05:07 IST

ఈనాడు, నంద్యాల,  నంద్యాల విద్య, న్యూస్‌టుడే 

‘ట్యాబ్‌ల కారణంగా పిల్లలకు చదువులకు ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఉపాధ్యాయులు చెప్పే అంశాలు బాగా అర్థమవుతాయి. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా పిల్లలకు చెడు జరగకూడదు. పిల్లలకు నష్టం జరిగే అంశాలు చూసే అవకాశం లేకుండా మీ మేనమామ ఆయా అంశాలకు కత్తెర వేశాడు.’ 

-ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్న వ్యాఖ్యలు.

విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లు యథేచ్ఛగా దుర్వినియోగ మవుతున్నాయి. ఇప్పటికే వంద మందికి పైగా విద్యార్థులు ట్యాబ్‌లను దుర్వినియోగం చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. అనధికారికంగా వందలాది మంది విద్యార్థులు వాటిని యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలు, నచ్చిన యాప్‌లు, ఆన్‌లైన్‌ గేమ్‌లు లోడ్‌ చేయించుకుంటున్నా ఉపాధ్యాయుల దృష్టికి రావడం లేదు. ట్యాబ్‌లలో ‘సెక్యూర్డ్‌ మొబైల్‌ డివైజ్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌’ లోడ్‌ చేశామని, పిల్లలకు నష్టం జరిగే అంశాలకు కోత పెట్టామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు అవాస్తవాలని తేలుతోంది. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లలో ప్రభుత్వం అనుమతించిన యాప్‌లుకాక ఇతర సమాచారాన్ని నిక్షిప్తం చేసే అవకాశం ఉండదు. అందుకు భిన్నంగా పలువురు విద్యార్థులు తమకు నచ్చిన సమాచారాన్ని ట్యాబ్‌లలో ఉంచి ఇతరులకు కనపడకుండా ఉండేలా (‘హైడ్‌’ మోడ్‌) దాచి మరీ చూస్తున్నట్లు సమాచారం.

సాంకేతిక సమస్యలు

విద్యార్థుల ట్యాబ్‌లను ఉపాధ్యాయులు ర్యాండమ్‌ తనిఖీలో భాగంగా పరిశీలించినప్పుడు మాత్రమే వాటిలో ఏముందున్న విషయాలు వెలుగుచూస్తున్నాయి. విద్యార్థులు తాము డౌన్‌లోడ్‌ చేసిన సమాచారం కనపడకుండా ఉంచుతుండడంతో వాటిని గుర్తించడం ఉపాధ్యాయులకు కష్టంగా మారుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 99,463 ట్యాబ్‌లు పంపిణీ చేశారు. విద్యార్థులు ఉపయోగిస్తున్న 90 వేలకుపైగా ట్యాబ్‌లను పర్యవేక్షించే అవకాశం అసాధ్యమని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

పలువురు విద్యార్థులు ట్యాబ్‌లలో తమకు నచ్చిన సమాచారం నిక్షిప్తం చేసుకునేందుకుగాను కొందరు నిపుణులకు ఇస్తున్నారు. ట్యాబ్‌ను తమకు నచ్చినట్లుగా మార్చుకునే క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇతర సమాచారం నిక్షిప్తం చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ట్యాబ్‌లు దెబ్బతింటున్నాయి.

అంతా అస్తవ్యస్తం

ర్నూలు జిల్లాలో 3,226 మంది, నంద్యాల జిల్లాలో 2,730 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు ఇచ్చారు. పదోన్నతులు పొందిన కర్నూలు జిల్లాకు చెందిన సుమారు 1,100 మంది, నంద్యాల జిల్లాకు చెందిన వెయ్యి మంది ఉపాధ్యాయులకు నేటికీ ఇవ్వలేదు.

  • విద్యార్థులు తమ ట్యాబ్‌లలో ఏమైనా అవాంఛనీయ సమాచారాన్ని నిక్షిప్తం చేస్తే దానిని ఆటోమేటిక్‌గా గుర్తించే వ్యవస్థ లేకపోవడంతో ట్యాబ్‌లను దుర్వినియోగం చేస్తున్నవారికి బాగా కలిసివస్తోంది. 2022-23 సంవత్సరంలో పంపిణీ చేసిన ట్యాబ్‌లలో భద్రతాపరమైన అంశాలు చాలా బలహీనంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
  • ఎనిమిదో తరగతి వారికి ఇచ్చిన ట్యాబ్‌లను ప్రభుత్వం విద్యా సంవత్సరం చివర్లో ఇవ్వడం గమనార్హం. నంద్యాల జిల్లాలో గతేడాది డిసెంబరులో 22వ తేదీ నుంచి పంపిణీ చేయగా.... కర్నూలు జిల్లాలో జనవరి నెలలో ఇచ్చారు. నేరుగా తొమ్మిదో తరగతిలో చేరిన వారిలో కొంతమందికి ట్యాబ్‌లు రాలేదన్న ఆరోపణలున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని