logo

రూ.కోట్లకు బీటలు.. రోగులతో జగన్‌ ఆటలు

ఆదోని జిల్లా సర్వజన వైద్యశాలలో వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే రోగులు స్థల భావ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్‌ పరిధిలో 10-15 మండలాలకు ఈ ఆస్పత్రి ప్రధాన ఆధారం.

Published : 20 Apr 2024 05:17 IST

పూర్తికాని రూ.10.48 కోట్ల భవనం

రోజు వారీ ఓపీ: 400-450, ఐపీ: 40
రెఫర్‌ చేస్తున్న రోగుల సంఖ్య : 10
]

మాటలు.. ప్రకటనలకే

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: రూ.కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని పలు సభల్లో ఊదరగొడుతున్న వైకాపా మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఆదోని జిల్లా సర్వజన ఆస్పత్రిలో వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే రోగులు నేలపైనే కూర్చొని ఓపీ కోసం నిరీక్షించాల్సి వస్తోంది. కనీసం రోగులు కూర్చునేందుకు కుర్చీలు వేయకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదోని మార్కెట్‌, న్యూస్‌టుడే : ఆదోని జిల్లా సర్వజన వైద్యశాలలో వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే రోగులు స్థల భావ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్‌ పరిధిలో 10-15 మండలాలకు ఈ ఆస్పత్రి ప్రధాన ఆధారం. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇక్కడి ఆస్పత్రిలో రూ.10.48 కోట్ల వ్యయంతో భవిష్యత్తు అవసరాల కోసం జీ ప్లస్‌త్రీ విస్తరణ భవన నిర్మాణం చేపట్టారు. పనులు ప్రారంభించి ఐదేళ్లవుతున్నా ఇంతవరకు పూర్తి కాలేదు. దీంతో రోగులకు గదులు.. మంచాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. గత తెదేపా ప్రభుత్వం రోగులకు స్థల భావ సమస్య ఉండరాదనే ఆలోచనతో నాబార్డు సాయంతో అదనపు భవన నిర్మాణం ప్రారంభించగా... ప్రభుత్వం మారిపోవడంతో అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వం పనులు పట్టాలెక్కే మొదలు పూర్తి చేసే వరకు నాలుగు సార్లు గడువు పొడిగించారు. అయినా నేటికి పూర్తి చేయకపోవడం గమనార్హం.


ఒకే మంచంపై ఇద్దరికి వైద్యసేవలు

ప్రస్తుతం ఉన్న పాత భవనంలో డయాలసిస్‌ కేంద్రం నడుస్తోంది. ఆస్పత్రి ఆవరణలోనే టీబీ యూనిట్‌, యునానీ కేంద్రం ఉంది. అంతేకాక పాత భవనం పెచ్చులూడి పడుతుండటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. శౌచాలయాలు సైతం శిథిలావస్థకు చేరాయి. వీటికి మరమ్మతులు చేయాలనే పేరుతో రోగులను ఏడాది పాటు ఆస్పత్రి వరండాలో మంచాలు వేసి సేవలందించారు. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో వరండాలోని మంచాలను గదుల్లోకి మార్చి.. ఒక్కో మంచంపై ఇద్దరేసి రోగులకు సేవలందిస్తున్నారు. ఒకే మంచంపై ఇద్దరేసి రోగులకు సేవలందించడంతో ఉన్న రోగం నయమవడం దేవుడెరుగు.. లేని రోగాలు వచ్చేలా ఉన్నాయని వాపోతున్నారు.


ఎప్పుడు బాగు పడుతుందో

నా పేరు నీలకంఠ కడుపు నొప్పితో ఆదోని జిల్లా సర్వజన ఆస్పత్రిలో చేరా. ఒకే మంచంపై ఇద్దరు రోగులను పడుకోబెట్టారు. దీంతో పక్కకు కదలలేని పరిస్థితి ఉంది. ఒక పక్కకే పడుకోవాల్సి వస్తోంది. రెండు రోజులుగా ఇలాగే ఉంటున్నా. రోగం నయంకావడం కోసం ఉండక తప్పడం లేదు. ఇంత పెద్ద ఆస్పత్రిలో ఇలాంటి పరిస్థితి ఉండటం దారుణం. ఆస్పత్రి ఎప్పుడు బాగు పడుతుందో దేవుడికే  తెలియాలి.


గదుల కొరత..

నా పేరు నరసయ్య, మాది పల్లెపాడు గ్రామం. అనారోగ్యంతో ఆదోని జిల్లా ఆస్పత్రిలో చేరి ఒకరోజు అయింది. రోగుల గదిలో ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. ఒకే మంచంపై ఇద్దరు రోగులను ఉంచారు. వేసవి కాలం.. ఆపై ఎండలు.. పైగా ఇరుకు మంచాలు ఎలా పడుకోవాలి? ఇక్కడ ప్రధానంగా మంచాలు, గదుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పేదలు డబ్బులు లేక ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్నాం. ఇలాగైతే ఉన్న రోగాలు పోవడం కాదు.. లేని రోగాలు వచ్చేలా ఉన్నాయి.


ఆసుపత్రిలో వసతులు లేక ఇబ్బందులు

వెల్దుర్తి, న్యూస్‌టుడే : వెల్దుర్తి సీహెచ్‌సీ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన బెంచీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. వైద్యసేవల కోసం నిల్చొని ఉండాల్సి వస్తోంది. వీటితోపాటు ఆసుపత్రిలో రోగులకు అవసరమైన మంచాలు లేవు. రాత్రి వేళల్లో వైద్యులు సక్రమంగా ఉండటం లేదు. ఆసుపత్రికి అవసరమైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.


సేవలపై తాత్సారం

నా పేరు లక్ష్మి, చిన్నపెండేకల్లు గ్రామం. ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే మంచంపై ఇద్దరికి సేవలందించడం ఎక్కడా చూడలేదు. ఇంత పెద్ద ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి సమస్య లేకుండా చూడాలి. అత్యాధునిక వైద్య సేవలందించి, పేదలకు భరోసా కల్పించాలి. కొత్త భ¡వనం పూర్తి చేయడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని