logo

‘జగన్‌ దగా’ఖానాలు

కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వాసుపత్రుల ముఖ చిత్రాలు.. వాటి దశ, దిశ మార్చి ఈ చిత్రాలను కూడా రెండేళ్ల తర్వాత మీ ముందుంచుతాం.

Published : 20 Apr 2024 05:38 IST

తెదేపా: రూ.109.20 కోట్లతో 12 సీహెచ్‌సీలకు పునాది
వైకాపా :  నాలుగేళ్లు నాన్చి అసంపూర్తి పనులకు ప్రారంభోత్సవం
న్యూస్‌టుడే, ఆదోని పాత పట్టణం

కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వాసుపత్రుల ముఖ చిత్రాలు.. వాటి దశ, దిశ మార్చి ఈ చిత్రాలను కూడా రెండేళ్ల తర్వాత మీ ముందుంచుతాం.

- ఎన్నికల మ్యానిఫెస్టోలో వైకాపా ఇచ్చిన హామీ

ల్లె ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో తెదేపా హయాంలో 12 సీహెచ్‌సీలను బాగు చేయాలని ప్రణాళిక రూపొందించింది. కొత్త భవనాలు నిర్మించడం.. పడకల స్థాయిని పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2018-19లో రూ.109.20 కోట్ల నాబార్డు నిధులతో పనులు ప్రారంభించారు.

గన్‌ గద్దెనెక్కిన తర్వాత ‘రివర్స్‌’ నిర్ణయాలు తీసుకున్నారు. తెదేపా హయాంలో వేసిన పునాదులు ఆపేశారు. రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేస్తూ పలు అభివృద్ధి పనుల్ని నిలిపివేసింది. కొవిడ్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య సేవల ప్రాధాన్యం తెలిసి వచ్చింది. తెదేపా ‘కాలం’లో తీసిన పునాదులు గుర్తుకొచ్చాయి. వాటికి ‘నాడు-నేడు’ పేరు పెట్టి పనులకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించలేకపోవడంతో నిర్మాణాలు నాలుగేళ్లు నత్తను తలపించాయి. మళ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో హడావుడిగా ప్రారంభోత్సవాలు చేసినా, వైద్యులను నియమించలేదు... కొత్తగా పరికరాలను ఇవ్వలేదు.. అసంపూర్తి భవనాలను ప్రారంభించి ప్రచారం చేసుకుంటున్నారు.

పరికరాలు ఎప్పుడిస్తారో

న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో రూ.3.5 కోట్లతో 50 పడకల ఆసుపత్రి నిర్మించారు. ఇక్కడ నిత్యం ఓపీ 350-400 వరకు ఉంటుంది. ప్రతి నెలలో 130 నుంచి 150 వరకు ప్రసవాలు జరుగుతాయి. ఎక్స్‌రే ప్లాంట్‌, పడకలు ఇతర అత్యాధునిక పరికరాలు సమకూర్చలేదు. పాత భవనంలోని ఆపరేషన్‌ థియేటర్‌, ఎన్‌బీసీయూ (న్యూబార్న్‌ కేర్‌ యూనిట్‌)లలోనే రోగులకు సేవలందిస్తున్నారు. రెండో దశలో రూ.8 కోట్ల నాబార్డు (ఆర్‌.ఐ.డి.ఎఫ్‌.) నిధులతో చేపట్టాల్సిన పనులకు శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. 


వరండాలో వైద్యం

న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు గ్రామీణం: పశ్చిమ ప్రాంతంలో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు చెందిన 60 గ్రామాల ప్రజలు వైద్య సేవల కోసం ఎమ్మిగనూరుకు వస్తుంటారు. నిత్యం 400 వరకు ఓపీ ఉంటుంది. ప్రతిరోజూ 40 మంది వరకు ఆసుపత్రిలో చేరుతున్నారు. 200కుపైగా ప్రసవాలు జరుగుతున్నాయి. నాబార్డు నిధులతో చేపడుతున్న వంద పడకల ఆసుపత్రి భవనం 2022 చివరి నాటికి పూర్తి కావాలి. గడువు ముగిసి 16 నెలలు అవుతున్నా ముందుకు సాగడం లేదు. పాత ఆసుపత్రిలో వార్డులు చాలడం లేదు. వరండాలో మంచాలు వేసి వైద్యసేవలు అందిస్తున్నారు. రక్త పరీక్షల యంత్రాలు శిథిల గదుల్లో ఉంచారు.


ప్రారంభం.. ప్రచారం

న్యూస్‌టుడే, డోన్‌: ఎన్నికలు వస్తున్న తరుణంలో పనులు పూర్తి కాకుండానే వంద పడకల ఆసుపత్రి భవనానికి ఆర్థిక మంత్రి బుగ్గన ప్రారంభోత్సవం చేశారు. పాత ఆసుపత్రి భవనాన్ని పూర్తిగా మూసివేశారు.. కొత్త ఆసుపత్రిలో వైద్యసేవలు అందిస్తున్నట్లు హడావుడి చేశారు. వైద్యులను నియమించలేదు.. కొత్తగా పరికరాలు ఇవ్వలేదు. భవనం పైఅంతస్తులో వెల్డింగ్‌ పనులు చేస్తుండగా కింద తిరుగుతున్న వారిపై నిప్పురవ్వలు పడుతున్నాయి. ఈఎన్టీ, కంటి వైద్య సేవలకు సంబంధించి పరికరాలు రాలేదు. ఎక్స్‌రే యంత్రం ఉన్నా పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి రాలేదు.  


ఇక్కడ వైద్యులేరీ

వెల్దుర్తిలో భవనం ప్రారంభించినా ఎక్స్‌-రే, స్కానింగ్‌ యంత్రాలు సమకూర్చాలి. ఆలూరులో భవనం నిర్మించినా నేటికీ ప్రారంభించలేదు. అవుకులో ఏడుగురు వైద్యులకు నలుగురినే నియమించారు. ఇక్కడ గైనిక్‌, జనరల్‌ సర్జన్‌, ఫిజీషియన్లు లేకపోవడంతో నంద్యాల, కర్నూలుకు వెళ్తున్నారు. కోవెలకుంట్లలో భవనం ప్రారంభించినా గైనకాలజిస్టును నియమించలేదు. యాళ్లురులో స్థలం, బిల్లుల సమస్యతో పనుల పూర్తికి గుత్తేదారుడు మొండికేస్తున్నారు.


గర్భిణులపై రూ.48 లక్షలు ఆర్థిక భారం

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులల్లో ఏడాదికి 30-35 వేల కాన్పులు జరుగుతున్నాయి. 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏడాదికి 8-9 వేలు కాన్పులు జరుగుతున్నాయి. అధికంగా ఆదోని, పత్తికొండ, ఆత్మకూరు, ఆలూరు, బనగానపల్లె, కోడుమురు, ఆళ్లగడ్డ, నందికొట్కూరుతో పాటు ఎమ్మిగనూరు ప్రాంతీయ ఆస్పత్రిలో నెలకు సుమారు 600-700 దాకా ప్రసవాలు జరుగుతున్నాయి. సీహెచ్‌సీలు అవుకు, పాణ్యం, యాళ్లురు, వేలుగోడు, మిడుతూరు, కోయిలకుంట్ల నెలకు 5-15 లోపు కాన్పులు అవుతున్నాయి. ఇలా అధికంగా ప్రసవాలు జరిగే ఆస్పత్రుల నుంచి నెలకు 10, నిర్వహణ సవ్యంగా లేకపోవడంతో సీహెచ్‌సీల నుంచి  నెలకు 30 మంది దాకా లెక్కిస్తే 240 దాకా గర్భిణులు నంద్యాల, కర్నూలులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ప్రసవాలు చేయించుకుంటున్నారు. ఇలా సగం మంది అంటే 120 మంది గర్భిణులు ప్రైవేటుకు వెళ్లిన ఒక్కో కాన్పు కోసం రూ.40 వేలు ఖర్చైనా.. నెలకు పేదలపై రూ.48 లక్షల దాకా ఆర్థిక భారం పడుతోంది. ఆదోని జిల్లా సర్వజన ఆస్పత్రిలో రోజు వారీగా రెఫర్‌ చేసే కేసుల సంఖ్య 8-10 దాకా ఉంటుంది. ఇందులో ఆయాసం, గుండె దడ, ఉబ్బసం.. తదితరÅ బాధితులు ఉంటున్నారు. వీరిని కర్నూలుకు సిఫార్సు చేస్తున్నారు. ఒక్కో రోగికి ఖర్చుల కింద రూ.40 వేల చొప్పున లెక్కిస్తే.. పేదలపై నెలకు రూ.1.20 కోట్ల భారం పడుతోంది.


కర్నూలుకే పంపిస్తున్నారు

న్యూస్‌టుడే, నందికొట్కూరు: నందికొట్కూరులో రూ.4.20 కోట్లతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏడాది కిందట ప్రారంభించారు. ఇక్కడ నిత్యం 700 వరకు ఓపీ ఉంటోంది. ప్రతి నెలా 40-50 వరకు సాధారణ ప్రసవాలు చేస్తున్నారు. ఆసుపత్రిలో ఎక్స్‌రే పరికరం ఉన్నా ఫిల్మ్‌ లేకపోవడంతో పక్కన పెట్టారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేయించి కర్నూలుకు తరలిస్తున్నారు. ఆపరేషన్‌ థియేటర్‌ను అందుబాటులోకి తెచ్చి రోగులకు మెరుగైన సేవలు అందించాలని పలువురు కోరుతున్నారు.


ప్రారంభించారు.. వైద్యులను మరిచారు

న్యూస్‌టుడే, బనగానపల్లి: బనగానపల్లిలో రూ.22 కోట్లతో నిర్మించిన ఆసుపత్రి భవనానికి గత నెల 14న ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభోత్సవం చేశారు. నెల రోజులు దాటినా పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించలేదు. గైనిక్‌ వైద్యాధికారిణి, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, డీసీఎస్‌ జనరల్‌ వైద్యుడు, రేడియాలజిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 24 మంది స్టాఫ్‌నర్సులకు 17 మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 500 నుంచి 600 వరకు ఓపీ ఉంటోంది. 50 మంది వరకు ఆసుపత్రిలో చేరుతున్నారు. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ పరికరాలతోపాటు మరికొన్ని లేకపోవడంతో రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.


ఆదోని అధోగతి

న్యూస్‌టుడే, ఆదోని పాతపట్టణం: ఆదోని డివిజన్‌ కేంద్రంలోని ప్రాంతీయ ఆసుపత్రి సామర్థ్యం పెంచి.. జిల్లా ఆసుపత్రిగా మార్చాలని గతంలో నిర్ణయించారు. రూ.10.48 కోట్లతో జీ ప్లస్‌ త్రీ భవనాన్ని మంజూరు చేశారు. ఎన్నికల వేళ ప్రచారానికి వాడుకోవాలన్న ఉద్దేశంతో పనులు పూర్తి కానున్నా స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. గదులు సరిపడా లేకపోవడంతో రోగులకు వరండాల్లో సేవలందిస్తున్నారు. సర్కారుపై విమర్శలు రావడంతో ఉన్న గదుల్లో ఒక్కో మంచంపై ఇద్దరేసి రోగులను ఉంచి వైద్యం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని