logo

జగన్‌ చోద్యం.. ‘కాడి’తప్పిన కౌలుసేద్యం

ముఖ్యమంత్రి గారూ...! మీ ఆత్మబంధువు జగన్‌ పేరిట 2019 జులై 8న రైతులకు మీరు రాసిన లేఖ గుర్తుందా?... రైతు భరోసా ద్వారా   కౌలుదార్లకు మేలు జరగబోతోందని చెప్పారు. మరి నిజంగా ఆదిశగా ఏమైనా చేశారా..?

Published : 20 Apr 2024 05:49 IST

కర్నూలు వ్యవసాయం, న్యూస్‌టుడే

ముఖ్యమంత్రి గారూ...! మీ ఆత్మబంధువు జగన్‌ పేరిట 2019 జులై 8న రైతులకు మీరు రాసిన లేఖ గుర్తుందా?... రైతు భరోసా ద్వారా   కౌలుదార్లకు మేలు జరగబోతోందని చెప్పారు. మరి నిజంగా ఆదిశగా ఏమైనా చేశారా..? ఏడాదికి ఎంత మందికి భరోసా కల్పిస్తుందీ ఏనాడైనా సమీక్షించారా?.. రాధాకృష్ణ కమిషన్‌ లెక్కల ప్రకారం లక్షల మందికి పైగానే ఉండగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1.02 లక్షల మంది కౌలు రైతులున్నారు... వారికి మీరెలా మేలు చేశారో వివరించగలరా...?

రైతు సంక్షేమంటూ గద్దెనెక్కిన జగన్‌ కౌలు రైతుల నోట్లో మట్టికొట్టారు. నవరత్నాలతో కూడిన ఎన్నికల ప్రణాళికే తమకు బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత అంటూ ప్రవచించే ఆయన.. మూడేళ్లలోనే 99 శాతం హామీలు అమలు చేశామని బీరాలు పలుకుతుంటారు. కౌలు రైతులకిచ్చిన హామీ ఏ మేరకు అమలు చేశారో చూస్తేనే జగన్‌ సర్కారు ప్రభుత్వ తీరు ఎలా ఉందో స్పష్టమవుతుంది. కౌలుకు సాగుచేస్తున్న వారందరికీ అమలు చేస్తామని చెప్పి..అమల్లోకి వచ్చే సరికి కులాల లెక్కన విభజించారు. ఇతర వర్గాల కౌలురైతులకు మొండిచేయి చూపిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులతోపాటు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాదారులకే వర్తింపజేస్తామంటూ మెలిక పెట్టారు. సాయంలో కోత పెట్టడం ద్వారా వారికిచ్చే భరోసా మొత్తాన్ని కూడా మిగుల్చుకున్నారు. కౌలురైతుకు భరోసా కల్పించడం ఇదేనా? రైతుసంక్షేమం అంటే ఇదా? ఇందుకే జగన్‌ మళ్లీ కావాలా? ఆయన్ని మళ్లీ సీఎంగా గెలిపించాలా? అనే ప్రశ్నలు కౌలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.

కొండంత చెప్పారు.. గోరంత ఇచ్చారు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు లక్ష ఇరవై వేల మంది వరకు కౌలుకు భూమి తీసుకొని సాగు చేస్తున్నారు. తెదేపా హయాంలో 60 వేల మందికి పైగా కౌలు రైతులకు సాగు ధ్రువీకరణ పత్రాలు (సీసీఆర్సీ) ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం ఏడాదిలో 11 నెలల కాలపరిమితితో 41 వేల మందికే సీసీఆర్సీ కార్డులు ఇచ్చారు. కార్డుదారుల్లో సగం మందికి కూడా పెట్టుబడి సాయం అందించడం లేదు. కౌలుదారులు ఎకరాకు రూ.20-30 వేల వరకు కౌలు చెల్లించి పంటలు సాగు చేస్తున్నారు. ఏడాదిలో ఖరీఫ్‌, రబీ సీజన్లలో కౌలురైతులు రూ.650 కోట్లు అప్పులు చేసి పంటలు పండించారు. ఖరీఫ్‌లో పత్తి, వేరుశనగ, కంది, మొక్కజొన్న, మిరప, ఉల్లి, పొగాకు వంటి పంటలు సాగు చేయగా..తీవ్ర వర్షాభావ పరిస్థితులతో తుడిచిపెట్టుకుపోయాయి. రబీలో అత్యధికంగా శనగ సాగు చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కరవుతో ఇదే పరిస్థితి ఎదురైంది. వారికి రైతుభరోసా పెట్టుబడి సాయం అందడం లేదు.. కనీసం పంట రుణాలైనా ఇప్పిస్తారనుకుంటే అదీ లేదు. అధికారులు కౌలుకార్డులు చేతిలో పెట్టి పత్తాలేకుండా పోతున్నారు. కరవుతో దిగుబడులు రాక..చివరికి పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.  

అప్పుల ఊబిలో చిక్కుకుని...

కౌలురైతుల్లో నిరుపేద కుటుంబాల వారే అత్యధికం. సగటున ఒక్కో రైతు 3 నుంచి 4 ఎకరాలను కౌలుకు సాగు చేస్తున్నారు. ఎకరాకు కనీసం రూ.30 వేల చొప్పున పెట్టుబడి చూసినా కనీసం రూ.లక్షకు పైగానే ఖర్చు పెడుతున్నారు. వర్షాలు, వరదలు, కరవులతో పంటచేతికి రాక పెద్దఎత్తున నష్టపోతున్నారు. అయినా వారికి కౌలురైతు కార్డులు(సీసీఆర్‌సీ) అందిద్దామని ఆలోచన చేయడం లేదు. రాయితీ విత్తనాలివ్వడం లేదు. పెట్టుబడి రాయితీ, పంటల బీమా ప్రయోజనాలూ కల్పించడం లేదు. కౌలుదారులు పంటలను సాగు చేస్తే భూ యజమానులకు ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఒక్క ఖరీఫ్‌లోనే రూ.650 కోట్ల మేర కౌలుదారులకు అప్పులు మిగిలాయి.


ఊపిరి తీసిన మడి

నందికొట్కూరుకు చెందిన నాగమునీంద్ర గౌడ్‌(33) గనిలో పని చేసేవారు.. ఎంత కష్టం చేసినా బతుకుబండి ముందుకెళ్లడం లేదు.. పిల్లలు, కుటుంబాన్ని ఉన్నతస్థానంలో ఉంచాలని కలలు కన్నారు.. వ్యవసాయం చేసి ఆర్థికాభివృద్ధి సాధించొచ్చని ఆశించారు. ఇందులో భాగంగా ఎకరం రూ.25 వేల చొప్పున 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. మొక్కజొన్న, పత్తి, మిరప, వరి పంటలను సాగు చేశారు. కరవు కాటేసింది..  ఐదెకరాల్లో వేసిన వరి నీరు లేక ఎండిపోయింది. వర్షాధారం కింద సాగు చేసుకున్న మొక్కజొన్న ఎదగలేదు. కౌలు, పంటపెట్టుబడికి చేసిన అప్పులు కళ్లముందు కనిపించాయి. అప్పు ఎలా తీర్చాలో తెలియక కుమిలిపోయారు. గతేడాది సెప్టెంబరు 13న  ఆత్మహత్య చేసుకున్నారు..  ‘ డబ్బులు ఇవ్వాలని అప్పులోళ్లు ఇంటికొస్తున్నారు.. రూ.10 లక్షల వరకు అప్పు ఉంది.. ఏం చేయాలో అర్థంకావడం లేదని’’ భార్య పుష్పావతి ఆవేదన వ్యక్తం చేశారు.


649 మందికే పంట రుణం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.220 కోట్ల పంట రుణాలు లక్ష్యంగా కాగా కేవలం 649 మంది కౌలుదారులకు ఉమ్మడి జిల్లాలోని బ్యాంకుల ద్వారా రూ.6.86 కోట్లు మంజూరు చేశారు. గతనెల 20న జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో కర్నూలు జిల్లాలో రూ.40.83 కోట్లు, నంద్యాలలో రూ.52 కోట్లు కలిపి మొత్తం రూ.92.83 కోట్ల పంట రుణాలు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ అధికారులు జడ్పీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు.

సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలుదార్లకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.లక్ష నుంచి రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించాలని గతేడాది ఖరీఫ్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం జగన్‌ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రూ.లక్షన్నర కాదు కదా.. కనీసం రూ.50 వేలు కూడా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది.
జగన్‌ హామీ ప్రకారం..1.02 లక్షల మందిలో 17,996 మందికి పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.24.29 కోట్ల సాయం అందుతోంది. మరో 1,02,004 మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇవ్వకపోగా, పెట్టుబడి సాయం అందడం లేదు. సీఎం ఇచ్చిన హామీ మేరకు 1.02 లక్షల మంది కౌలుదారులకు ఏడాదికి పెట్టుబడి సాయం రూ.13,500ల చొప్పున రూ.137.70 కోట్లు దక్కాలి. అయిదేళ్లలో రూ.688 కోట్ల మేర రైతులకు బాకీ పడ్డారు. అయినా కౌలు రైతులకు ఎంతో గొప్ప మేలు చేస్తున్నామని, అన్ని రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నామని జగన్‌ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు.

24,183 మందికి అందని పెట్టుబడి సాయం

2023-24 ఆర్థిక సంవత్సరంలో కౌలు రైతులకు మొదటి విడతగా మేలో రూ.7,500 అక్టోబరులో రూ.4 వేలు కలిపి రూ.11,500 రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేశారు. రెండు విడతలో కర్నూలులో 7,306 మందికి రూ.8.40 కోట్లు, నంద్యాలలో 10,004 మందికి రూ.11.50 కోట్లు అందించారు. 24,183 మంది కౌలుదారులకు రూ.27.81 కోట్ల రైతుభరోసా పెట్టుబడి సాయం ఇవ్వకుండా వైకాపా మోసం చేసింది.  

రూ.32.50 కోట్లు ఎగవేత

కౌలురైతులకు రెండో విడతలో అక్టోబరులో ఇవ్వాల్సిన రూ.4వేలు నవంబరులో అందజేశారు. మూడోవిడత 2024 జనవరిలో ఇవ్వాల్సిన ఉండగా నెల రోజులు ఆలస్యంగా ఫిబ్రవరి 2న పంపిణీ చేశారు. మూడో విడతలో రూ.2వేల చొప్పున కర్నూలులో 7,723 మందికి రూ.1.82 కోట్లు, నంద్యాలలో 10,273 మందికి రూ.2.28 కోట్లు అందజేయనున్నారు. ఏడాదిలో మూడు విడతల్లో 23 వేల మంది కౌలుదారులు రూ.32.50 కోట్లు మిగుల్చుకున్నారు.


పరిహారం పరిహాసం

ర్షాభావ పరిస్థితుల కారణంగా ఏటా అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులకు ఈ ఏడాది కూడా అప్పులే మిగిలాయి..రెండు, మూడేళ్లుగా అప్పులు ఏటా పెరుగుతున్నాయి. అప్పులు చెల్లించలేక కౌలురైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నెలలో కనీసం 5-10 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చాటింపేసుకుంటోంది. కౌలురైతులు చనిపోతే సీసీఆర్సీ కార్డులు కలిగిన వారందరికీ రైతు ఆత్మహత్యల కింద ప్రభుత్వం అందించే రూ.7 లక్షల పరిహారం పంపిణీ చేయాలి. ఉమ్మడి జిల్లాలో ఐదేళ్ల కాలంలో 20 మందికి కూడా ప్రభుత్వ పరిహారం అందలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని