logo

బుట్టమ్మ భర్త బ్యాంకుకు టోకరా

ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని ఇటీవల సిద్ధం సభలో సీఎం జగన్‌ పేర్కొనడం..

Published : 22 Apr 2024 09:47 IST

ఈనాడు, కర్నూలు : ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని ఇటీవల సిద్ధం సభలో సీఎం జగన్‌ పేర్కొనడం.. ఆమె ఎన్నికల అఫిడవిట్‌లో రూ.వందల కోట్ల ఆస్తి చూపడం చర్చనీయాంశంగా మారాయి.. మరి సీఎం చెబుతున్న ఆ పేదరాలి భర్త బుట్టా శివనీలకంఠ కొన్నేళ్ల కిందట సహకార బ్యాంకు నిర్వహించి.. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు నిధులు పక్కదారి పట్టించి వాటాదారులనూ బురిడీ కొట్టించారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.. ఆ పార్టీకి చెందిన ఎంపీకి సమాచారం తెలియకుండానే కమిటీ సభ్యుడిగా నియమించడం గమనార్హం. అఫిడవిట్‌ ప్రకారం.. రేణుక, ఆమె భర్త శివనీలకంఠ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.161.21 కోట్లు. చరాస్తులు రూ.142.46 కోట్లు, స్థిరాస్తులు రూ.18.75 కోటుగా పేర్కొన్నారు.

అప్పుడు ఏం జరిగింది

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ‘శ్రీభారతి కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు లిమిటెడ్‌’కు శివనీలకంఠ కొంతకాలం ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో నిబంధనలకు పాతరేసి బ్యాంకు నుంచి రూ.70 లక్షలు ఉపసంహరించడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. బ్యాంకు మేనేజింగ్‌ కమిటీ సభ్యులుగా ఉన్నవారు ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయ్యాయి. బ్యాంకు కార్యకలాపాల నిర్వహణ దురుద్దేశాలతో ఉంది.. బైలాస్‌ను ఉల్లంఘిస్తున్నారు.. బ్యాంకు సీఈవోను పూర్తిగా డమ్మీ చేసి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఆ బ్యాంకు వాటాదారు (షేర్‌ హోల్డర్‌) సుబ్రహ్మణ్యం హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌గా ఉన్న శివనీలకంఠ గతంలో సెంట్రల్‌ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులకు రుణం చెల్లించకుండా డీఫాల్ట్‌ అయ్యారని గుర్తుచేశారు. ఆయా బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమైన వ్యక్తి బ్యాంకు ఛైర్మన్‌గా ఉండటంపై కొందరు వాటాదారులు ఆందోళన వ్యక్తం చేశారు.  శ్రీభారతి కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు లిమిటెడ్‌లో జరిగిన అక్రమాలపై ఆర్‌బీఐకీ ఫిర్యాదు అందింది. అనంతరం జరిగిన విచారణలో పలు నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు నిగ్గు తేలింది. దీంతో ఆర్‌బీఐ అధికారులు ఆ బ్యాంకుకు రూ.2 లక్షల అపరాధ రుసుము విధించారు.

కర్నూలు ఎంపీ బాధితుడే

కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ ఆ బ్యాంకు బాధితుడే. ఆయనకు తెలియకుండానే ఆయన్ను కమిటీ సభ్యుడిగా నియమించారన్నది ఆరోపణ. బ్యాంకు వాటాదారుల తరఫున సుబ్రహ్మణ్యం కమిటీ సభ్యులకు ‘కాషన్‌ నోటీసులు’ పంపారు. బ్యాంకు కార్యకలాపాల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నందుకుగాను హైదరాబాద్‌లోని ‘సెంట్రల్‌ క్రైం స్టేషన్‌’లో ఫిర్యాదు చేయనున్నామని ఆ నోటీసులో హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన ఎంపీ అసలు తాను కమిటీ సభ్యుడినే కాదని... తనకు ఎలా నోటీసు పంపారన్న విషయాన్ని ఆరా తీయగా ఆయనకు తెలియకుండానే కమిటీ సభ్యుడిగా నియమించినట్లు తేలింది. దీనిపై డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ నాటి బ్యాంకు ఛైర్మన్‌ శివనీలకంఠ సతీమణి బుట్టా రేణుకను ప్రశ్నించగా తప్పిదాలను సవరిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారమైంది. ‘‘ బుట్టా రేణుక ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదు. వారి కుటుంబ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఆమె రాజకీయాలు చేస్తున్నారు. రుణాలు  తిరిగి చెల్లించకుండా బ్యాంకులకు తీవ్రమైన నష్టం కలిగిస్తున్నారని’’ కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని