logo

ఐదేళ్లు ఊరించావు.. ఆఖర్లో ఇదేంటి బ్రో!

ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన జగన్‌.. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అంటూ ఊదరగొట్టారు. 2018లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ డీఎస్సీ ప్రకటనపై నాటి తెదేపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Updated : 22 Apr 2024 15:23 IST

పేదింటి బిడ్డలు.. పల్లెటూరి పిల్లలు.. రూ.లక్షలు ధారబోసి ‘సాంకేతిక’ చదువులు అభ్యసించలేకపోయారు... ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి జీవితానికి కొత్త బాటలు వేసుకోవాలని కలలు కన్నారు.. డీఈడీ, బీఈడీ పూర్తి చేశారు.. అప్పులు చేసి శిక్షణకు వెళ్లి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో ఉత్తీర్ణులయ్యారు. ఇంకో మెట్టు ఎక్కితే గమ్యం చేరుకోవచ్చని ఆశించారు.

నే విన్నా .. నేనున్నా.. అండగా ఉంటా.. గుండెల్లో పెట్టుకుంటా.. మెగా డీఎస్సీ ప్రకటిస్తా అంటూ జగన్‌ నాలుగేళ్లుగా ఊరూవాడా ప్రగల్బాలు పలికారు. నిరుద్యోగులు ఆశతో ఐదేళ్లు డీఎస్సీకి సన్నద్ధమయ్యారు. శిక్షణ కేంద్రాలకు రూ.లక్షలు ధారబోశారు. గ్రంథాలయాల్లో గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టారు. తీరా ఎన్నికలు సమీపిస్తుండటంతో అత్తెసరు పోస్టులతో ప్రకటన ఇచ్చి నిరుద్యోగులను దగా చేశారు. ఇప్పుడు వారిలో ఎవరిని కదిలించినా కన్నీటి ధారలే ఉబికి వస్తున్నాయి.

న్యూస్‌టుడే, కర్నూలు


విద్య ఎన్నికల ముంగిట.. నిరుద్యోగులతో ఆట

ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన జగన్‌.. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అంటూ ఊదరగొట్టారు. 2018లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ డీఎస్సీ ప్రకటనపై నాటి తెదేపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గద్దెనెక్కిన జగన్‌ 2019 నుంచి 2024 మధ్య డీఎస్సీ ప్రకటన చేయలేదు. త్వరలో డీఎస్సీ అంటూ గతేడాది ఆగస్టులోనే విద్యాశాఖ మంత్రి బొత్స ప్రకటించారు. తీరా ఎన్నికలకు ముందు హడావుడిగా నోటిఫికేషన్‌ వదిలారు. ఎన్నికల ప్రకటన వస్తే నోటిఫికేషన్‌ రద్దవుతుందని తెలిసే మోసం చేశారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో 23 వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయని స్వయంగా సీఎం జగనే చెప్పారు. కానీ డీఎస్సీలో మాత్రం ఖాళీలు ఎందుకు తగ్గాయని అటు ఉపాధ్యాయ వర్గాలు.. ఇటు డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.


పేదింటి బిడ్డలకు అన్యాయం

ప్రభుత్వం తక్కువ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుండటంతో గిరిజన, దళిత, వెనకబడిన వర్గాల విద్యార్థులే అధికంగా నష్టపోతున్నారు.  కుటుంబ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 80 నుంచి 90 శాతం వరకు బీఈడీ, డీఈడీ వంటి కోర్సుల్లో చేరుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్‌ పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని పోస్టులకు సంబంధించి పదోన్నతుల ప్రక్రియను నిలుపుదల చేయడంతో సుమారు 300 పోస్టుల వరకు భర్తీ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుల పోస్టులు మరో 60 వరకు ఉన్నాయి. భాషా పండితులకు పదోన్నతులు కల్పిస్తే 200, ఏకోపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే మరో 36 పోస్టులు ఖాళీ ఏర్పడతాయి. కానీ ప్రభుత్వం మాత్రం పోస్టులకు భారీగా కోత పెట్టి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


ఖాళీలు ఎక్కువ.. పోస్టులు తక్కు

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 30 వేల మందికిపైగా బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందనగా యువతను మభ్యపెట్టేందుకు అరకొర పోస్టులతో డీఎస్సీ ప్రకటించారు. అభ్యర్థుల్లో ఎక్కువ శాతం ఎస్జీటీ పోస్టులకు సన్నద్ధమవుతున్నారు. రెండు నెలల కిందట విడుదల చేసిన డీఎస్సీ ప్రకటనలో ఉమ్మడి జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 550, ఎస్జీటీ పోస్టులు 1,022, టీజీటీ 121 కలిపి మొత్తం 1,693 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చూపారు. వీటికి 20 వేల మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్నా తక్కువ పోస్టులు ఉండటంతో కొందరు దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం.


శిక్షణకు రూ.వేలల్లో వ్యయం

డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు వ్యయ, ప్రయాసలకు లోనవుతున్నారు. సాధారణంగా అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన విడుదల చేసినా, విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా వెంటనే శిక్షణ కేంద్రాలకు పరుగులు పెడతారు. నాలుగు నుంచి ఆరు నెలలపాటు డీఎస్సీ శిక్షణ ఉంటుంది. కర్నూలు, నంద్యాల, ఆదోని వంటి పట్టణాల్లో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు తీసుకుంటున్నారు. స్టడీ మెటీరియల్‌కు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చవుతుంది. ఒక్కో అభ్యర్థి సగటున శిక్షణకు రూ.20 వేలకుపైగా ఖర్చు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 వేల మంది అభ్యర్థులు డీఎస్సీకి సిద్ధమవుతున్నారు. వీరంతా ఇంత వరకు రూ.40 కోట్లకుపైగా ఖర్చు చేశారు.


విద్యా వాలంటీరు వ్యవస్థకు మంగళం

తెదేపా హయాంలో విద్యా వాలంటీరు వ్యవస్థ ఉండేది. బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనంతో ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్నచోట్ల నియమించి బోధన చేయించేవారు. 2019 తర్వాత వైకాపా ప్రభుత్వం విద్యా వాలంటీరు వ్యవస్థను రద్దు చేసింది. అయిదేళ్లలో ఒక్క డీఎస్సీని నిర్వహించని ప్రభుత్వం అంతకుముందున్న విద్యా వాలంటీర్లను తొలగించింది.


ఏకోపాధ్యాయ పాఠశాలల విస్మరణ

ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగానే ఉన్నాయి. రెండు జిల్లాల్లో 36 పాఠశాలలు ఉన్నాయి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన పెద్దకడబూరు, కౌతాళం, కోసిగి, మంత్రాలయం మండలాలతోపాటు నంద్యాల జిల్లాలోని ప్యాపిలి, బేతంచెర్ల, కొలిమిగుండ్ల, అవుకు మండలాల్లో ఏకోపాధ్యాయ పోస్టులు అధికంగా ఉన్నాయి. ఇక్కడ ఉపాధ్యాయులు సెలవు పెడితే పాఠశాలలకు తాళం వేయాల్సిన పరిస్థితి నెలకొంది. లేకపోతే పక్క పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌పై వచ్చి పాఠాలు బోధించాల్సి వస్తోంది. ఈ పాఠశాలల్లో అదనపు ఉపాధ్యాయులను నియమించేందుకు ప్రభుత్వం సుముఖత చూపలేదు. ఈ పోస్టులను కూడా డీఎస్సీలో చూపలేదు.


భాషా పండితులకు అన్యాయం

రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి న్యాయస్థానాల్లో వ్యాజ్యాల పేరుతో భాషా పండితులకు పదోన్నతులు కల్పించలేదు. దీంతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తెలుగు, హిందీ, ఉర్దూ పోస్టులు భర్తీ కాలేదు. ఉర్దూ 62, తెలుగు 70, హిందీ పోస్టులు 61 వరకు భర్తీ కాలేదు. ఈ మూడు భాషల పండిట్లకు సంబంధించి సుమారు 200 మందికి పదోన్నతులు రాలేదు. వీరికి సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తే మరిన్ని పోస్టులు భర్తీ అయ్యేందుకు అవకాశం ఉండేది. చిన్నపాటి కారణాలు చూపుతూ ఈ ప్రక్రియను అయిదేళ్లుగా నిలుపుదల చేయడం కూడా డీఎస్సీ అభ్యర్థులకు శాపంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని