logo

పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన

పారిశ్రామిక శిక్షణ సంస్థలు వృత్తివిద్యలో తర్ఫీదును ఇస్తూ స్వయం ఉపాధితో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సాధించేందుకు మార్గాన్ని చూపుతున్నాయి.

Published : 17 May 2024 04:36 IST

ఐటీఐలలో ప్రవేశాలకు పిలుపు

ఐటీఐలో యంత్రాలపై శిక్షణ పొందుతున్న విద్యార్థులు

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: పారిశ్రామిక శిక్షణ సంస్థలు వృత్తివిద్యలో తర్ఫీదును ఇస్తూ స్వయం ఉపాధితో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సాధించేందుకు మార్గాన్ని చూపుతున్నాయి. నంద్యాల జిల్లాలో 23,786 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 20,367 మంది ఉత్తీర్ణులవ్వగా...85.62 శాతం నమోదైంది. ఎక్కువ మంది ఐటీఐలల్లో చేరేందుకు దరఖాస్తులు కూడా ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు. ఐటీఐలల్లో శిక్షణ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు. ఐటీఐలల్లో ఏడాది, రెండేళ్ల కోర్సుల్లో నైపుణ్యాలు పొందిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ జాబ్‌మేళాలను నిర్వహిస్తున్నారు. నెలకు రూ.పది వేల నుంచి రూ.15 వేల వరకు వేతనాలతో ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం కలుగుతోంది. డిజిటల్‌ విద్యాబోధన, డోన్‌లో కియా కంపెనీ సహకారంతో యంత్రాలపై శిక్షణ నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు.

ట్రేడుల వివరాలు ఇవే..

ఉమ్మడి జిల్లాలోని ఐటీఐలల్లో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగాలకు సంబంధించి కర్నూలు తాండ్రపాడు, కర్నూలు డీఎల్‌టీసీ, ఆలూరు, డోన్‌, శ్రీశైలం, అవుకు, నంద్యాల, బేతంచెర్లలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ఏడాది, రెండేళ్ల కోర్సులకు సంబంధించి ఎలక్ట్రీషియన్‌, డ్రాప్ట్స్‌మెన్‌ సివిల్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, డీజిల్‌ మెకానిక్‌, కంప్యూటర్స్‌ (కోపా), డ్రస్‌మేకింగ్‌, కటింగ్‌, టైలరింగ్‌, ఫిట్టర్‌, మోటార్‌ మెకానిక్‌, వైర్‌మెన్‌, టర్నర్‌, మెషినిస్టు, వెల్డర్‌, నంద్యాలలో రిఫ్రిజిరేటర్‌, ఎయిర్‌కండీషనింగ్‌ (ఆర్‌అండ్‌ఏసీ) కోర్సులున్నాయి. 

ఉమ్మడి జిల్లాలో 38

ఉమ్మడి జిల్లాలో 38 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐలు ఉన్నాయి. డోన్‌, నంద్యాల, బేతంచెర్ల, శ్రీశైలం, అవుకు, ఆలూరు, కర్నూలులోని డీఎల్‌టీసీ, తాండ్రపాడు బాలికల ప్రభుత్వ ఐటీఐలు ఉండగా, 30 ప్రైవేట్‌ ఐటీఐలు ఉన్నాయి. వాటిల్లో 10 వేలకు పైగానే విద్యార్థులు చేరుతుండగా, ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో రెగ్యులర్‌, ఒప్పంద పద్ధతిలో 160 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐలల్లో ప్రవేశాలకు మే 9 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టాయి. జూన్‌ 10 వరకు గడువిచ్చారు. తర్వాత పెంచే అవకాశం ఉండొచ్చంటున్నారు. నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలల్లో 976, ప్రైవేట్‌ ఐటీఐల్లో 2,300 సీట్లు ఉండగా, కర్నూలు జిల్లాలో ప్రభుత్వ ఐటీఐలల్లో 508, ప్రైవేట్‌లో 1,408 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది.

శిక్షణా నైపుణ్యాలతో ఉద్యోగ, ఉపాధి..

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలల్లో శిక్షణ పొంది అప్రెంటిషిప్‌ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. స్థానిక ఐటీఐలల్లో కొన్నేళ్లుగా ప్రాంగణ ఎంపికలు జరుగుతున్నాయి. బెంగుళూరు, హైదరాబాద్‌, పెనుగొండలోని కియా, హిందూపూర్‌లోని విప్రో, నెల్లూరు శ్రీసిటీ, తదితర ప్రాంతాల్లో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో ఉద్యోగాలు పొందొచ్చు. రైల్వేశాఖలో డీజిల్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, రైల్వే వర్క్‌షాప్‌, గ్రూప్‌-డిలో ఉద్యోగాలు, ఏపీఎస్‌ఆర్టీసీ, హైదరాబాద్‌లోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌), భారత్‌ డైనమిక్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌), హిందూస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌), సిమెంటు కంపెనీల్లో టెక్నికల్‌ పరంగా ఉద్యోగాలు పొందే వీలుంది. కర్నూలు, మంత్రాలయం ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వెల్డర్‌ ట్రేడుకు ఫ్యాబ్రికేషన్‌ కంపెనీల్లో, స్టీల్‌ప్లాంట్‌లోనూ ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.

ఉద్యోగాలు రాని వారు స్వయం ఉపాధి పొందొచ్చు.

ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్‌గా గృహాల్లోనూ, పరిశ్రమల్లోనూ వైర్‌మెన్‌గా పని చేయొచ్చు. డ్రాప్ట్స్‌మెన్‌ సివిల్‌ చేస్తే మున్సిపాల్టీలు, పంచాయతీలు, సచివాలయాల్లో ఇంటిప్లాన్‌ను వేసేందుకు, మ్యాపులు, బ్లూప్రింట్‌ గీసేందుకు, ఆర్‌అండ్‌బి, మైనర్‌ ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, జిల్లా పరిషత్‌, ఎమ్మార్వో కార్యాలయాల్లో సర్వేయర్లుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే వీలుంది.

ఐటీఐ విద్యార్థులకు ప్రాధాన్యం

ఐటీఐ కళాశాలల్లో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రైవేట్‌ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్యాలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఏటా ఉమ్మడి జిల్లాలో 800 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. డోన్‌ ప్రభుత్వ ఐటీఐలో ఉచితంగా ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నాం. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

 ప్రసాదరెడ్డి, నంద్యాల జిల్లా ఐటీఐ కళాశాలల కన్వీనరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని