logo

భూసార పరీక్షలనేలచూపులు

పంట దిగుబడి, నాణ్యతకు భూసారమే కీలకం. నేల లక్షణాలు.. ఇందులో లోపించిన సూక్ష్మధాతువుల వివరాలు తెలుసుకుని.. అందుకు అనుగుణంగా ఎరువులు వినియోగిస్తే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి.

Published : 17 May 2024 04:47 IST

దృష్టి సారించని అధికారులు
ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు

పంట దిగుబడి, నాణ్యతకు భూసారమే కీలకం. నేల లక్షణాలు.. ఇందులో లోపించిన సూక్ష్మధాతువుల వివరాలు తెలుసుకుని.. అందుకు అనుగుణంగా ఎరువులు వినియోగిస్తే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. ఇది తెలియాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. ఇందుకోసం ఏటా మే మొదటి వారం నుంచే మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఆ ఊసేలేదు.

ఆత్మకూరు, న్యూస్‌టుడే

ముందే పలకరించిన తొలకరి

కర్నూలు జిల్లాలో 5.39 లక్షలు, నంద్యాల జిల్లాలో 3.67 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంది. జూన్‌ ప్రారంభం నుంచి ఖరీఫ్‌ సీజన్‌ పనులు మొదలవుతాయి. నిన్నటి వరకు ఎన్నికల పనుల్లో నిమగ్నమైన అధికారులు మే నెలలో మట్టి నమూనాల సేకరణపై దృష్టిపెట్టలేదు. మొన్నటి దాకా వేసవి ఎండలు మండిపోయాయి. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలతో రైతులు పొలం బాట పట్టారు. ఇప్పటికే దుక్కులు దున్నిన రైతన్నలు పొలాల్లో భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు, నవధాన్యాలు చల్లేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ అధికారులు రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు.

బిగించని పరికరాలు

ఐదేళ్లుగా నిలిచిపోయాయి

ఉమ్మడి జిల్లాలో గత ఐదేళ్లుగా భూసార పరీక్షలు నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో ఏటా పరీక్షలు నిర్వహించి రైతులకు భూసార పరీక్ష పత్రాలు అందజేసేవారు. 2023- 24లో భూసార పరీక్షల లక్ష్యాలు నిర్దేశించినా బడ్జెట్‌ మాత్రం కేటాయించలేదు. 2023- 24లో సెంట్రల్‌ స్కీం ద్వారా ఉమ్మడి జిల్లాల్లో 1729 నమూనాలు మాత్రమే సేకరించి పరీక్షించారు. వికసిత్‌ భారత్‌ కార్యక్రమాల్లో భాగంగా కొందరు రైతులకు పత్రాలు పంపిణీ చేశారు. తర్వాత వాటిని కూడా తిరిగి తీసేసుకున్నారని రైతులు వాపోతున్నారు.
ఎమ్మిగనూరు సమీపంలో ముగతి ఫారంలో భూసార పరీక్ష కేంద్రం ఉన్నా ఏడాదికిపైగా విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో కరెంటు సరఫరా నిలిపివేశారు. ప్రయోగశాలలో రూ.లక్షలు విలువైన ఆధునిక పరికరాలు, సిబ్బంది ఉన్నా రసాయనాలు లేక చేయలేని పరిస్థితి నెలకొంది. గతేడాది ఉప విభాగంలోని 85 రైతుభరోసా కేంద్రాల్లో 962 మట్టి నమూనాలు సేకరించారు. వాటిని ల్యాబ్‌లో పరీక్షించి రైతులకు క్షేత్ర స్థాయిలో పూర్తిగా అందించలేకపోయారు.

ఎమ్మిగనూరు వ్యవసాయం

2019 నివేదికలే ప్రామాణికం

  • ఉమ్మడి జిల్లాలో నల్లరేగడి 72, ఎర్రరేగడి 22, ఇతర భూములు 6 శాతం ఉన్నాయి. 2018 సెంట్రల్‌ స్కీం నివేదికలో ఉమ్మడి జిల్లాల నేలల్లో క్షార గుణం మధ్యస్తంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సేంద్రియ కర్భనం తక్కువగా ఉన్నట్లు తేల్చారు.
  • ఉమ్మడి జిల్లాలో 2018- 19లో నిర్వహించిన భూసార పరీక్షల ఫలితాలే ఇప్పటికీ దిక్కయ్యాయి. భూసార పరీక్షా కేంద్రాల నివేదికల ప్రకారం భూముల్లో నత్రజని లోపించింది. 31 మండలాల్లో ఇనుము, 33 మండలాల్లో జింకు, 4 మండలాల్లో కాపర్‌, మాంగనీస్‌ లోపం ఉంది.
  • పొటాషియం 14 మండలాల్లో తీవ్రస్థాయిలో, 13 మండలాల్లో మధ్యస్తంగా ఉంది. ఏడు మండలాల్లో సల్ఫర్‌ లోపం అధికంగా ఉంది. 13 మండలాల్లో మధ్యస్థంగా ఉంది. దీనివల్ల పంటల దిగుబడి తగ్గిపోతుంది.
  • సమస్యలు అధిగమించాలంటే భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులు, అవసరమైన సూక్ష్మ పోషకాలు వినియోగించాల్సి ఉంది.

అక్కరకురాని అగ్రిల్యాబ్‌లు

  • భూసార పరీక్షలు, విత్త, పురుగు మందుల నాణ్యత గుర్తించడం వంటి సేవలు అందించేందుకు ఉమ్మడి జిల్లా పరిధిలో 12 ఇంటిగ్రేటెడ్‌ అగ్రీ ల్యాబ్‌లు నిర్మించారు. ఒక్కో ల్యాబ్‌కు భవన నిర్మాణం, పరికరాలు, సామగ్రి కోసం రూ.70 లక్షలు కేటాయించారు.
  • కర్నూలు జిల్లాలోని కర్నూలు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండలో మొదటి విడతలో ప్రారంభించి సేవలు అందుబాటులోకి తెచ్చారు. రెండో విడతలో మంజూరైన గూడూరు, పాణ్యం కేంద్రాల్లో సేవలు అందుబాటులోకి రావాల్సి ఉంది.
  • నంద్యాల జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డలో అగ్రీల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. ఆత్మకూరు, డోన్‌, నందికొట్కూరు, కోవెలకుంట్లలో సేవలు అందుబాటులోకి రాలేదు.
  • కర్నూలు జిల్లాలో 466, నంద్యాల జిల్లాలో 411 ఆర్బీకేలు ఉన్నాయి. వీటి ద్వారా ఆయా గ్రామాల్లో మట్టి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం అగ్రీల్యాబ్‌లకు పంపాల్సి ఉన్నా ఎక్కడా ఆ పని జరగడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని