logo

కత్తి దూస్తున్న కక్షలు

సార్వత్రిక ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ ముగిసింది.. అనంతరం పల్లెల్లో కక్షలు కత్తి దూస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పార్టీల ఫిరాయింపులు మొదలుకొని ఇరువర్గాల మధ్య గొడవలు, ఘర్షణలతో రాజకీయ వైరం పెరిగింది.

Updated : 17 May 2024 05:58 IST

పోలింగ్‌ అనంతరం పెరిగిన ఘటనలు

కర్నూలు  నేరవిభాగం, న్యూస్‌టుడే : సార్వత్రిక ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ ముగిసింది.. అనంతరం పల్లెల్లో కక్షలు కత్తి దూస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పార్టీల ఫిరాయింపులు మొదలుకొని ఇరువర్గాల మధ్య గొడవలు, ఘర్షణలతో రాజకీయ వైరం పెరిగింది. దీనికితోడు వ్యక్తిగత కక్షలు తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు భయాందోళన గురవుతున్నారు. పోలీసులు బైండోవర్‌ నమోదు చేసి ముందస్తు చర్యలు తీసుకున్నా పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. ఎన్నికల రోజున నంద్యాల పట్టణంలో వైకాపా, తెదేపా మధ్య గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. తెదేపా నాయకుడి వాహనంపై వైకాపా వర్గీయులు రాళ్లు రువ్వటంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వైకాపా అభ్యర్థి శిల్పా రవికిషోర్‌రెడ్డి, తెదేపా అభ్యర్థి ఫరూక్‌తోపాటు వారి వర్గీయులపైన పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. కర్నూలు జిల్లా కేంద్రంలో సిల్వర్‌జూబ్లీ కళాశాల వద్ద తెదేపా నగర అధ్యక్షుడు నాగరాజు డ్రైవర్‌ ఎరుకలి కావడి నాగరాజుపై వైకాపా వర్గీయులు దాడిచేసి గాయపరిచారు. ఈ ఘటనలో వైకాపా కర్నూలు జిల్లా అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ, ఆమె భర్త గడ్డం రామకృష్ణ, కుమారుడు, మరో ఇద్దరు వైకాపా వర్గీయులపై కర్నూలు మూడో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. దీంతో ఒకే వార్డులో ఉండే తెదేపా నగర అధ్యక్షుడు, వైకాపా జిల్లా అధ్యక్షురాలి మధ్య రాజకీయ వైరం ముదిరినట్లైంది.

దౌర్జన్యాలకు పాల్పడి..

దొంగ ఓట్ల విషయంలో కర్నూలు పాతబస్తీ, శ్రీరామ్‌నగర్‌ కాలనీల్లో ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. పాతబస్తీలో ఉస్మానియా కళాశాల వద్ద జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. కల్లూరు మండలం తడకనపల్లెకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రచారానికి వెళ్లిన సందర్భంలో జనసేన నాయకుడు ప్రశ్నించగా ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనతో ఇరువర్గాల మధ్య వైరం ముదిరింది. ఎన్నికల రోజున కాటసాని కుమారుడు కల్లూరు పట్టణ పరిధిలోని వీకర్‌ సెక్షన్‌ కాలనీలో దౌర్జన్యానికి పాల్పడ్డారు. డోన్‌ నియోజకవర్గ పరిధిలో కోట్ల వర్గీయులకు, వైకాపా అభ్యర్థి బుగ్గనకు మధ్య రాజకీయ వైరం తీవ్రమైంది. సీమ సుధాకర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయటంతో బుగ్గనపై కోట్ల వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ అనుచరుడిపై దాడి ఘటన ఉలిక్కిపాటుకు గురిచేసింది.

వైరం ముదిరి..

బనగానపల్లి నియోజకవర్గంలో కాటసాని, బీసీల మధ్య పరస్పర విమర్శలతో వారి మధ్య వైరం ముదిరి పాకానపడింది. శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా, శిల్పాల మధ్య దూషణల పర్వం కొనసాగింది. పత్తికొండ మండలం జూటూరులోని పోలింగ్‌ కేంద్రంలో జరిగిన గొడవతో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య మనస్పర్థలొచ్చాయి. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని ప్రాతకోటలో వైకాపా, తెదేపా వర్గీయులు ఘర్షణ పడటంతో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో జూన్‌ 4న వెలువడే ఎన్నికల ఫలితాల ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని