logo

మా‘రీచ్‌’లపై కన్నేయండి

నదీతీరాల్లో ఇసుకను యంత్రాలతో తవ్వొద్దని ఎవరెన్ని హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.. ఎన్జీటీ హెచ్చరించినా.. కోర్టులు మొట్టికాయలు వేసినా తవ్వకాలు ఆపలేదు.

Updated : 17 May 2024 05:56 IST

ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం
ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఆదేశం
అధికారులు దృష్టి సారించాలంటున్న స్థానికులు

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పల్దొడ్డి ఇసుక రీచ్‌ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న గనులు,
భూగర్భశాఖ జిల్లా అధికారి టి.రాజశేఖర్‌, మైనింగ్‌ విజిలెన్స్‌ ఏడీ బైరాగి నాయుడు

దీతీరాల్లో ఇసుకను యంత్రాలతో తవ్వొద్దని ఎవరెన్ని హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.. ఎన్జీటీ హెచ్చరించినా.. కోర్టులు మొట్టికాయలు వేసినా తవ్వకాలు ఆపలేదు.. అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో ఇసుక దోపిడీకి అంతే లేకుండా పోయింది.. గత నాలుగేళ్లుగా తుంగభద్రకు తూట్లు పొడిచారు.. తీరం వెంట ఎక్కడికక్కడ తిష్ఠ వేసి నిబంధనలకు విరుద్ధంగా తవ్వేశారు.. నదిలో ఇసుక నిల్వలు భారీగా తరగడంతో తీరం వెంట ఎన్నడూ లేనివిధంగా నీటి కొరత తలెత్తింది.. వందల సంఖ్యలో బోరు బావులు ఎండిపోయాయి.. ఇసుక అక్రమ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.. తవ్వకాలు నిలిపివేసేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.. ఇకనైనా అధికారులు దృష్టి సారించి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానిక రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే

నదిపై అధికార పెత్తనం

తుంగభద్ర నదిపై గత నాలుగేళ్లుగా అధికార పార్టీ నేతలు పెత్తనం చేశారు. అనుమతుల మాటున లోతుగా తవ్వేశారు.. పెద్ద పెద్ద యంత్రాలతో తవ్వి టిప్పర్లలో తరలించారు. ప్రజాప్రతినిధులు, మరికొందరు నేతలు రీచ్‌లను పంచుకొని ఇసుక దందా చేశారు. ఎవరికి ఎంత బలం ఉంటే అంతమేర తవ్వేస్తూ పొరుగు రాష్ట్రాలకు తరలించి రూ.కోట్లు ఆర్జించారు. నందవరం మండలం నాగలదిన్నె, మంత్రాలయం మండలం మాధవరం, చెట్నిహళ్లి, మంత్రాలయం, కోసిగి మండలం సాతనూరు, కౌతాళం మండలంలో కుంబళనూరు, నదిచాగి గ్రామాల పరిధిలోని తుంగభద్ర నదీతీరంలో అక్రమంగా ఇసుక తవ్వేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల అనుచరులు జల్లెడ పట్టి దోచేశారు.

18 లక్షల టన్నులు తోడేశారు

  • 2021 నుంచి జారీ చేసిన ఈసీల షరతులను జేపీ పవర్‌ వెంచర్స్‌ పూర్తిగా విస్మరించింది. కౌతాళం మండలం గుడికంబాలి, మరళిలో మూడు రీచ్‌ల్లో రెండేళ్లపాటు ఇసుక తవ్వకాలు చేపట్టారు. 2023 నవంబరు వరకు రెండేళ్ల ఏడు నెలలపాటు తవ్వకాలు జరిగాయి. గతేడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఎనిమిది నెలలపాటు జేపీ పవర్స్‌ సంస్థ ఈసీ అనుమతులు లేకపోయినా ఈ మూడు రీచ్‌ల్లో యథేచ్ఛగా తవ్వేసి దోపిడీకి పాల్పడ్డారు. ఎన్జీటీ లెక్కల ప్రకారం సరాసరి 14.40 లక్షల టన్నుల ఇసుకను తుంగభద్ర నది నుంచి తోడేశారు.
  • 2023 డిసెంబరు 11 నుంచి ప్రతిమా కన్‌స్ట్రక్షన్‌ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు జరిగాయి. కొత్తగా వచ్చిన సంస్థ కూడా ఈసీ అనుమతులు బేఖాతరు చేసింది. రెండు నెలల్లోనే మూడు రీచ్‌ల్లో రోజుకు ఒక్కో రీచ్‌ నుంచి 2 వేల టన్నుల చొప్పున 3.60 లక్షల టన్నుల తవ్వకాలు చేపట్టారు.

యంత్రాలను తక్షణమే తరలించాలి

ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని గనులు, భూగర్భశాఖ జిల్లా అధికారి టి.రాజశేఖర్‌ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సి.బెళగల్‌ మండలం పల్దొడి ఇసుక రీచ్‌ను గురువారం తనిఖీ చేశారు.  సి.బెళగల్‌ మండలం కె.సింగవరం ఇసుక రీచ్‌ ప్రాంతంలో బోటు ద్వారా ఇసుక తీసే ప్రదేశాలను గురువారం తనిఖీ చేసినట్లు గనులు, భూగర్భశాఖ జిల్లా అధికారి టి.రాజశేఖర్‌ తెలిపారు. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరగడం లేదని.. ఇసుక రీచ్‌ ప్రాంతంలో ఉన్న యంత్రాలను తక్షణమే తరలించాలని సంబంధిత యజమానులకు ఆదేశించామన్నారు.

ఎన్నికల వేళ తోడేశారు

  • నందవరం ఇసుక క్వారీలో అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తున్నారని.. ఇసుక విక్రయించగా వచ్చిన సొమ్మును ఎన్నికల ప్రచారాలకు వాడుతున్నారంటూ జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఎలాంటి అక్రమ తవ్వకాలు జరగడం లేదని పేర్కొన్నారు. స్థానికులు తమ అవసరాల నిమిత్తం ఇసుకను ఎద్దుల బండ్లలో తీసుకెళుతున్నారని.. ఇక్కడ ఎలాంటి తవ్వకాలు జరగడం లేదని తనిఖీలకు వెళ్లిన అధికారులు తెలిపారు.  
  • మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో కౌతాళం మండలం గుడికంబాళి, మరళి గ్రామాల్లోని రీచ్‌లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని.. ఇసుక విక్రయించగా వచ్చిన డబ్బును ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తున్నారంటూ ఆ మండలం నుంచి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో గనులు, భూగర్భశాఖ జిల్లా అధికారి టి.రాజశేఖర్‌, సెబ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు ఈనెల 9న తనిఖీ చేశారు. ప్రస్తుతం రీచ్‌ల్లో ఎలాంటి తవ్వకాలు చేపట్టడం లేదని అధికారులు సమాధానం ఇచ్చారు.

పరిమితికిమించి రవాణా

  • నదిలో ఇసుకను తోడేళ్లలా తవ్వేశారు. మూడు నుంచి ఎనిమిది మీటర్ల ఇసుక మేటలున్న ప్రాంతాల్లోనే మీటరు వరకు తవ్వేందుకు అనుమతులు ఉంటాయి. ఎక్కడా ఈ నిబంధనలు పాటించడం లేదు.
  • నదీ ఉపరితలానికి మీటర్‌కుమించి తవ్వకూడదన్న నిబంధన ఉంది. భారీ యంత్రాలతో దాదాపు ఎనిమిది మీటర్ల మేర తవ్వకాలు చేపట్టారు. తుంగభద్రలో నాణ్యమైన ఇసుక లభ్యం కావడంతో మార్కెట్లో డిమాండు ఎక్కువగా ఉంది.
  • హైదరాబాద్‌, కర్ణాటక, బెంగళూరు వంటి నగరాలకు టిప్పర్లలో తరలించారు. సాధారణంగా ఒక టిప్పర్‌లో 35 నుంచి 40 మెట్రిక్‌ టన్నులు తీసుకెళ్లొచ్చు. ‘అధికార’ పార్టీ నేతల వాహనాల్లో మాత్రం పరిమితికిమించి 45-50 మెట్రిక్‌ టన్నుల వరకు రవాణా చేశారు.

అడుగడుగునా ఉల్లంఘనలు

  • తుంగభద్ర నదీతీరంలో సి.బెళగల్‌ మండలం కొండాపురం, పల్దొడ్డి, ముడుమాల, ఈర్లదిన్నె, కె.సింగవరం, కొత్తకోట గ్రామాల్లో ఇసుకను తోడేశారు. ఈ రీచ్‌లన్నీ సుంకేసుల జలాశయానికి వెనక భాగంలో ఉన్నాయి. కౌతాళం మండలం గుడికంబాలి-1, 3 రీచ్‌లకు పర్యావరణ అనుమతులు ఉన్నాయి. వీటి ముసుగులో మిగిలినచోట్ల తవ్వేశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌, భారత ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) నుంచి ఎన్‌వోసీ లేకుండా రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు.  
  • ఇసుక తవ్వకాలకు కొత్తగా గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు పర్యావరణ అనుమతులను (ఈసీలు) రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (సియా) జారీ చేయలేదు. కర్నూలు జిల్లాలో మంత్రాలయం నియోజకవర్గంలో మూడు రీచ్‌లకు ఈసీ అనుమతులు లేవు. గుడికంబాలిలో రెండు, మరళి-1 ఇసుక రీచ్‌లకు 11 నెలలుగా పర్యావరణ అనుమతులు లేవు. అయినా భారీ యంత్రాలతో తవ్వేశారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 12 వరకు రీచ్‌ల నుంచి అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినట్లు ఫిర్యాదులొచ్చాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని