logo

ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం

సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు (పీవో, ఏపీవో), ఇతర పోలింగ్‌ సిబ్బందికి ఇవ్వాల్సిన పారితోషికాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఉద్యోగులు మండిపడుతున్నారు.

Updated : 18 May 2024 08:25 IST

న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం: సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు (పీవో, ఏపీవో), ఇతర పోలింగ్‌ సిబ్బందికి ఇవ్వాల్సిన పారితోషికాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఉద్యోగులు మండిపడుతున్నారు. కర్నూలు జిల్లాలో 2,204 పోలింగ్‌ కేంద్రాలు, నంద్యాలలో 1,983 ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిధులను జిల్లా ఎన్నికల అధికారులు నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల(ఆర్వో)కు మంజూరు చేశారు. ఆయా కేంద్రాల్లో విధుల నిర్వహించిన సిబ్బందికి ఇవ్వాల్సిన పైకంలో ఆర్వోలు కోత పెట్టారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుసుముల చెల్లింపుల్లో నియోజకవర్గాలవారీగా వ్యత్యాసాలు ఉండటంతో పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే అరకొర మొత్తంలోనూ కోత పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఒక్కోచోట.. ఒక్కోలా

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలమేరకు ప్రిసైడింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారికి నిత్యం రూ.350 చొప్పున, ఇతర పోలింగ్‌ అధికారికి రోజుకు రూ.250 చొప్పున ఇవ్వాల్సి ఉంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎన్నికల విధులు నిర్వహించిన పీవోలు, ఏపీవోలకు రూ.3,150, ఓపీవోలకు రూ.1,500 ప్రకారం పారితోషికం ఇచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పీవోలు, ఏపీవోలకు రూ.2,050, ఓపీవోలకు రూ.1,050, వైఎస్సార్‌ జిల్లా బద్వేల్‌లో పీవోలకు రూ.1,800, ఓపీవోలకు రూ.800 ప్రకారం అందజేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పీవోలు, ఏపీవోలకు రూ.2,500, ఓపీవోలకు రూ.800 అందించారు.

ఆడిట్‌ లేకపోవడంతోనే

ఎన్నికల ఖర్చులకు ఆడిట్‌ ఉండదు. ఉన్నతాధికారులు రాసిందే ‘లెక్క’గా ఉంటుంది. దీంతో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం చెల్లించలేదనే విమర్శలున్నాయి. ఎన్నికల విధులు అంటేనే ఉద్యోగులకు చాలా కీలకం. ఏమాత్రం అలసత్వం వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొంతమంది అధికారులు, ఉద్యోగులు భోజనాలు చేయకుండా విధులు నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు ఇచ్చే కొద్దిపాటి రుసుముల్లో వ్యత్యాసాలు ఉండటం సబబు కాదని పలువురు పేర్కొన్నారు.

అందని విధి నిర్వహణ పత్రాలు

ఎన్నికల విధులు నిర్వహించిన నేపథ్యంలో ఉద్యోగులకు డ్యూటీ సర్టిఫికెట్లు అందజేస్తారు. కర్నూలు, నంద్యాల జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో వాటిని ఇవ్వలేదు. ఎన్నికల విధులు నిర్వహించినట్లు ధ్రువపత్రం ఉంటేనే సంబంధిత రోజులకు ఈఎల్స్‌ ఇస్తారు. కొన్నిచోట్ల మాత్రమే రిటర్నింగ్‌ అధికారులు డ్యూటీ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. వెంటనే వాటిని ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

భారీగా కోత పెట్టారు

  • నంద్యాల జిల్లాలో పీవోలు, ఏపీవోలకు కొన్ని నియోజకవర్గాల్లో రోజుకు రూ.300, మరికొన్ని చోట్ల రూ.350, కొన్నిచోట్ల రూ.291 ప్రకారం పంపిణీ చేశారు.  
  • కర్నూలు జిల్లా వ్యాప్తంగా పీవోలు, ఏపీవోలు పనిచేసిన ఆరు రోజులకు సంబంధించి రోజుకు రూ.350 చొప్పున లెక్కకట్టి రూ.2,100 ఇచ్చారు. ఓపీవోలకు రోజుకు రూ.250 చొప్పున మూడు రోజులకు రూ.750 ఇచ్చారు.
  • నంద్యాల జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో పీవోలు, ఏపీవోలకు ఆరు రోజులకుగాను రూ.1,800 చెల్లించగా, నంద్యాల నియోజకవర్గంలో రూ.2,100 ప్రకారం ఇచ్చారు.
  • ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రూ.1,750 ప్రకారం చెల్లిస్తే, శ్రీశైలం నియోజకవర్గంలో రూ.1,800 ప్రకారం ఇచ్చారు.
  • నంద్యాల జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో పీవోలు, ఏపీవోలు, ఓపీవోలకు ఇష్టానుసారంగా పైకం చెల్లించారు. ఓపీవోలకు నాలుగు రోజుల పనిదినాలుగా లెక్కించి రూ.1,000 ఇవ్వడం గమనార్హం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని