logo

బీఎల్వోలకు అందని భృతి

ఎన్నికల విధులకు సంబంధించి బీఎల్వోలు నిరంతరం కష్టపడ్డారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు.. ఓటర్ల మార్పులు, చేర్పుల్లో కీలకపాత్ర పోషించారు. పైసా పారితోషికం అందడం లేదు.

Published : 19 May 2024 04:48 IST

రెండేళ్లుగా ఎగవేత

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ఎన్నికల విధులకు సంబంధించి బీఎల్వోలు నిరంతరం కష్టపడ్డారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు.. ఓటర్ల మార్పులు, చేర్పుల్లో కీలకపాత్ర పోషించారు. పైసా పారితోషికం అందడం లేదు. గతేడాది జులై 21వ తేదీ నుంచి ఇంటింటి ఓటరు సర్వే.. ఆ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా, సవరణ, పోలింగ్‌ కేంద్రాల్లో వసతుల కల్పన, ఓటరు చీటీల పంపిణీతోపాటు ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియలోనూ కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో బీఎల్‌వోలకు నిర్దేశిత మొత్తం చెల్లించాలని ఎన్నికల సంఘం ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. 

14 నియోజకవర్గాలు.. 4,187 మంది విధులు

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 4,187 మంది బీఎల్వోలు పనిచేస్తున్నారు. వీరిలో 2,500 మందికిపైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉండగా.. మిగిలినవారు వీఆర్వోలు, వీఆర్‌ఏలు, పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. అదనంగా బీఎల్వోలుగా పనిచేస్తున్నారు. ఏటా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఎస్‌ఆర్‌) జరుగుతుంది. మధ్యలో ఎన్నికలు వస్తే అదనపు భారమే. గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. తాజాగా సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రతి బీఎల్వోకు ఆరు నెలలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.3 వేల గౌరవ భృతి చెల్లించాల్సి ఉంది.

రూ.1.25 కోట్ల మేర బకాయిలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత రెండేళ్లుగా బూత్‌ లెవెల్‌ అధికారులు (బీఎల్వో)లుగా విధులు నిర్వర్తిస్తున్న సచివాలయ, ఇతర ఉద్యోగులకు గౌరవ భృతిని ఎన్నికల అధికారులు ఇవ్వడం లేదు. ఎన్నికలకు ముందు బడ్జెట్‌ రాలేదని చెప్పుకొచ్చారు. వీరికి మొత్తం రూ.1.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు బడ్జెట్‌ విడుదలైంది. ఎన్నికల పోలింగ్‌ విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులకు పైకం చెల్లించారు. పోలింగ్‌ సమయంలోనూ విధులు నిర్వహించిన బీఎల్వోలకు మాత్రం పైసా ఇవ్వకపోవడం గమనార్హం.

ఒక్క పైసా చెల్లిస్తే ఒట్టు

కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 257 పోలింగ్‌ కేంద్రాల్లో సచివాలయ కార్యదర్శులు, వీఆర్వోలు గత నాలుగేళ్లుగా బూత్‌ లెవెల్‌ అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరు రాకముందు నగరపాలక సంస్థకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు ఈ బాధ్యతలు చూసేవారు. సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక ఇందులోని కార్యదర్శులకు బీఎల్వో బాధ్యతలు అప్పగించారు. వీరు ఈ అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి ఆరు నెలలకు రూ.1500 చొప్పున వారి ఖాతాలో జమ చేసేవారు. గత రెండేళ్లుగా ఈ మొత్తం నిలిచిపోయింది. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. సీఎఫ్‌ఎంఎస్‌కు బిల్లులు పంపుతున్నామని, అవి తిరస్కరణకు గురవుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు