logo

లక్ష్య సాధనలోగెలుపు సందేశం

తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కష్టపడి చదవడం.. అనుకున్న లక్ష్యం చేరుకోవాలన్న కసి.. వెరసి ఆ విద్యార్థిని విజయం వైపు నడిపించాయి. పదో తరగతిలో పదికి పది.. ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలతో ప్రశంసలు అందుకున్నాడు.

Published : 19 May 2024 04:50 IST

సీమ కుర్రోడికి తెలంగాణ ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు
ముంబయి ఐఐటీ ప్రవేశంపై గురి

తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో విద్యార్థి బి.సందేశ్‌ 

తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కష్టపడి చదవడం.. అనుకున్న లక్ష్యం చేరుకోవాలన్న కసి.. వెరసి ఆ విద్యార్థిని విజయం వైపు నడిపించాయి. పదో తరగతిలో పదికి పది.. ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలతో ప్రశంసలు అందుకున్నాడు. శనివారం విడుదలైన తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించి తన ప్రత్యేకతను చాటాడు. ముంబయి ఐఐటీ కళాశాలలో అడుగు పెట్టాలని పట్టుదలతో చదివాడు.. ఉత్తమ ఫలితం సాధించాడు. ఆదోని పట్టణానికి చెందిన బి.సందేశ్‌ విజయగాథ తెలుసుకుందామా.

న్యూస్‌టుడే, ఆదోని విద్య

గురి చెదరకుండా..

ఆదోని పట్టణానికి చెందిన బి.రామసుబ్బారెడ్డి హొళగుంద జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా, వి.రాజేశ్వరి అరేకల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నారు. వారి కుమారుడు బి.సందేశ్‌ హైదరాబాద్‌లో చదువుతున్నాడు. పదో తరగతిలో పదికి పది పాయింట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ ఇంటర్మీడియేట్‌లో వెయ్యికి 987 మార్కులు సాధించి ఉత్తమ ఫలితం సాధించాడు. ఆ తర్వాత జేఈఈ మెయిన్స్‌ పరీక్షల్లో 99.99 శాతం మార్కులు సాధించి ఆల్‌ ఇండియాలో 252 మార్కులు సాధించాడు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎంసెట్‌ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలోనే 4వ ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించాడు. విద్యార్థి బి.సందేశ్‌ ఉత్తమ ప్రతిభ సాధించడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు అభినందనలు తెలిపారు.

రోజుకు 12 గంటల సాధన

ముంబయి నగరంలోని ఐఐటీ ముంబయి కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకు తగినట్లుగా రోజూ 10 నుంచి 12 గంటల పాటు కష్టపడి చదువుతున్నా. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. అధ్యాపకులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినడం, సందేహాలు నివృత్తి చేసుకోవడంతో రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించగలిగా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్‌ పరీక్షల్లో 99.99 శాతం మార్కులు సాధించి ఆల్‌ ఇండియాలో 252 ర్యాంకు సాధించా. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్షల కోసం సిద్ధమవుతున్నా. ముంబయి ఐఐటీ కళాశాలలో సీటు సాధించి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా ప్రత్యేకతను చాటాలనేదే లక్ష్యం.

 బి.సందేశ్, విద్యార్థి, ఆదోని

పరిశోధనలే లక్ష్యం

ఐటీ రంగానికి ఉపయుక్తంగా ఉండేలా ఓ సంస్థను స్థాపించి పరిశోధనలు చేసి వినూత్న ఆవిష్కరణలు చేయాలన్నదే నా లక్ష్యం. తెలంగాణ ఈఏపీ సెట్‌లో 5వ ర్యాంకు వచ్చినందుకు ఆనందంగా ఉంది. జేఈఈ మెయిన్స్‌లో వంద పర్సంటైల్‌ వచ్చింది. జాతీయస్థాయిలో 36వ ర్యాంకు సాధించా. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు సిద్ధమవుతున్నా. ముంబై ఐఐటీలో సీటు వస్తుందని భావిస్తున్నా. నా తండ్రి రామేశ్వరరెడ్డి వ్యాపార రంగంలో ఉన్నారు. తల్లి అరుణ గృహిణి. నేను ఆరో తరగతి నుంచి గుంటూరులోనే చదువుకుంటున్నా.

 సాయి యశ్వంత్‌రెడ్డి, 5వ ర్యాంకు, కర్నూలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని