logo

ఓపీక పడితేనే వైద్యం

నంద్యాల సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెంచినా వైద్యులు మాత్రం గదుల్లో ఉండకపోవడంతో అరకొరగా సేవలు అందుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

Published : 19 May 2024 04:51 IST

అందుబాటులో ఉండని వైద్యులు
సర్వజన ఆసుపత్రిలో రోగుల వెతలు

బారులు తీరిన రోగులు 

నంద్యాల సర్వజన ఆసుపత్రిలో ఓపీ సేవలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెంచినా వైద్యులు మాత్రం గదుల్లో ఉండకపోవడంతో అరకొరగా సేవలు అందుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. రోగులు వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 8గంటలకే ఆసుపత్రికి వచ్చి సాయంత్రం 4 వరకు వేచి ఉంటున్నారు. ఉదయం నుంచి వచ్చిన రోగులు రక్తపరీక్షలు, ఎక్స్‌రే, స్కానింగ్‌లకు నిరీక్షించి వైద్యులకు ఆ నివేదికలు చూపించాలనుకునేలోపు కొంతమంది అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తున్నారు. వైద్యులు ఉండకపోవడంతో చేసేదీ ఏమి లేక మరుసటి రోజు వచ్చి వైద్యులకు ఇవ్వాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: 

గంటల పాటు నిరీక్షణ 

నంద్యాల సర్వజన ఆసుపత్రికి రోజుకు 1000 నుంచి 1200 మంది వరకు వస్తున్నారు. ఓపీ ఆన్‌లైన్‌ కావడంతో ఓపీ తీసుకోవాలంటేనే ఉదయం 9గంటలకు వచ్చిన వారికి 10 గంటలైనా ఓపీ దొరడకం కష్టంగా ఉంటోంది. ఎంతో ఓపికతో వరుసలో గంటల సేపు నిల్చొని ఓపీ చీటీ తీసుకొని వైద్యుడి దగ్గరకు వెళ్తే ఆయన పరీక్షించి పలు పరీక్షలు చేసి వాటిని తీసుకురమ్మంటున్నారు. గంటసేపు నిల్చొని రక్త నమూనాలు ఇస్తే సాయంత్రం 3 గంటలకు రమ్మని చెబుతున్నారు. ఆ తర్వాత వచ్చి మళ్లీ అక్కడ అరగంట పాటు ఎదురు చూస్తే ఇచ్చిన నివేదికలను వైద్యుడి దగ్గరకు వెళ్లి చూపిస్తామంటే ఆయన ఉండకపోవడంతో మళ్లీ తర్వాతరోజు రావాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం నుంచి 

-లక్ష్మిదేవి, నంద్యాల

ఆసుపత్రికి ఉదయం 10 గంటలకు వచ్చాం. ఓపీ చీటీ తీసుకోవడానికి గంట సేపు  పట్టింది. జ్వరంతో బాధపడుతున్నా. వైద్యుడి దగ్గర చూపించుకున్నా. కొన్నిరక్త పరీక్షలు చేయించమన్నారు. నమూనాలు ఇచ్చిన తర్వాత సాయంత్రం 3 గంటలకు నివేదికలు ఇస్తామన్నారు. సాయంత్రం వరకు ఉన్నాం. వైద్యులు లేకపోవడంతో మళ్లీ సోమవారం రావాలని సిబ్బంది తెలిపారు.

గంటన్నర పట్టింది

-వెంకటసుబ్బమ్మ, బండిఆత్మకూరు

ఓపీ చీటీ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడ్డాను. వరుసలో నిల్చొని కంప్యూటర్‌ ఆపరేటర్‌ దగ్గరకు వెళ్తే రిజిస్టర్‌ చేయించుకొని నంబరు తీసుకోవాలని పంపారు. మళ్లీ అక్కడ వరుసలో నిల్చొని చరవాణి నంబరు ఉంటే చెప్పాలన్నారు. నా దగ్గర చరవాణి లేకపోతే వేరే వాళ్ల నంబరు చెబితే రాయించారు. మళ్లీ వరుసలో ఉండి ఓపీ తీసుకున్నాను. ఓపీ కోసం గంటన్నర సమయం పట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని