logo

పరీక్ష ప్రశ్నార్థకం

రాయలసీమ విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి నిర్లక్ష్యంతో వందల విద్యార్థుల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి.

Published : 19 May 2024 05:03 IST

 ఆర్‌యూ అధికారుల వింత వైఖరి

హిందీ పేపరులో పెన్నుతో రాసిన ప్రశ్నలు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: రాయలసీమ విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి నిర్లక్ష్యంతో వందల విద్యార్థుల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి. డిగ్రీ రెండో సెమిస్టర్‌లో భాగంగా హిందీ, సంస్కృతం పరీక్షలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు కళాశాలల్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు నిర్వహించాల్సి ఉంది. ఇందులో భాగంగా పరీక్ష కేంద్రాలకు వచ్చిన విద్యార్థులకు ప్రశ్నపత్రాలు ఇచ్చారు. పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత ప్రశ్నపత్రాలు ఇవి కావని.. మరొకటి పంపుతామంటూ పరీక్ష కేంద్రాల్లో ఉన్న సీఎస్‌లకు ఆర్‌యూ పరీక్షల విభాగానికి చెందిన కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినర్‌ వెంకటేశ్వర్లు నుంచి వాట్సప్, మెయిల్‌ ద్వారా సమాచారం వచ్చింది. పరీక్ష ప్రారంభమైన 1.30 గంట తర్వాత ప్రశ్నపత్రం ఎలా మారుస్తారంటూ విద్యార్థులు ఇన్విజిలేటర్లను ప్రశ్నించారు. తామేమీ చేయలేమని.. ఆర్‌యూ నుంచి వచ్చిన నిబంధనలు మాత్రమే పాటిస్తామని చెప్పడంతో విద్యార్థులు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. 10.30 తర్వాత ప్రశ్నపత్రం ఇవ్వగా తక్కువ సమయంలోనే పరీక్ష రాయాల్సి వచ్చింది. హిందీ, సంస్కృతం పరీక్షలు మరోసారి నిర్వహించాలని పలువురు విద్యార్థులు తమ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయమై వర్సిటీ ఉప కులపతి సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.. దీనిపై పరీక్షల విభాగం డీన్‌తో మాట్లాడామని.. హిందీ, సంస్కృతం ప్రశ్నపత్రాల్లో రెండు, మూడు ప్రశ్నలు మాత్రమే మార్చినట్లు ఎగ్జామినర్‌ ఆఫ్‌ డీన్‌ తెలిపారన్నారు. ప్రశ్నపత్రం ఆలస్యంగా ఇచ్చిన పరీక్ష కేంద్రాల్లో గంట సమయం ఎక్కువగా ఇచ్చామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు