logo

ఆర్‌యూ.. అక్రమాల పుట్ట

రాయలసీమ విశ్వవిద్యాలయంలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.. విచారణ సమగ్రంగా కొనసాగడం లేదు.. కొన్ని ఘటనల్లో విచారణలు పూర్తైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

Updated : 19 May 2024 05:31 IST

ధ్రువపత్రాల్లో తప్పిదాల పేరుతో వసూళ్లు
తాజాగా వెలుగుచూసిన వైనం

ఈనాడు, కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.. విచారణ సమగ్రంగా కొనసాగడం లేదు.. కొన్ని ఘటనల్లో విచారణలు పూర్తైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం ఉద్యోగుల సహాయ సహకారాలతో కొందరు ఉత్తీర్ణత సాధించారని రెండు నెలల కిందట వెలుగుచూసింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రత్యేకంగా ఒక విచారణ కమిటీని ఏర్పాటుచేశారు. అక్రమాలు వెలుగులోకి వచ్చి రెండు నెలలు దాటినా నేటికీ అక్రమాలకు పాల్పడినవారెవరు? సూత్రధారులెవరు? ఎంత సొమ్ము చేతులు మారింది? తదితర వివరాలేవీ బయటకు రాలేదు. కమిటీ విచారణ పూర్తిచేసి నివేదిక ఎప్పుడు ఇస్తుందన్నదీ ప్రశ్నార్థకంగానే మారింది. ఇందులో విశ్వవిద్యాలయంలోని కీలక స్థానాల్లో ఉన్నవారి ప్రమేయం, ప్రోత్సాహం ఉండడంతోనే విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై కొందరు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన వీసీని ఆదేశించారు.

విజిలెన్స్‌ నిగ్గు తేల్చినా..

విశ్వవిద్యాలయంలో గతంలో నిధుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనలపై విజిలెన్స్‌ విచారణ సైతం జరిగింది. విశ్వవిద్యాలయ పరిధిలో నిధుల దుర్వినియోగం ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని విజిలెన్స్‌ అధికారులు ఉదాహరణలతో సహా నిగ్గు తేల్చారు. అధికారులు తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో విశ్వవిద్యాలయం ఏ అంశంలో ఎంత నష్టపోయిందన్న విషయాన్నీ నిర్ధారించారు. ఏళ్లు గడుస్తున్నా బాధ్యులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. కుంభకోణాలకు బాధ్యులైన వారిపై ఎప్పటికి చర్యలు తీసుకుంటారన్న విషయం పెద్ద మిస్టరీలా మారింది.

తప్పులతడకగా ప్రొవిజినల్‌ పత్రాలు

విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ కళాశాలల్లో పలు కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు విశ్వవిద్యాలయ అధికారులు ‘ప్రొవిజినల్‌ సర్టిఫికెట్లు’ జారీ చేస్తారు. అలాంటి కీలక ధ్రువపత్రాలను సైతం విశ్వవిద్యాలయ అధికారులు తప్పులతడకగా ఇస్తున్నారు. ఆయా పత్రాల పీడీఎఫ్‌ ప్రతులను విద్యార్థులకు పంపుతున్నారు. వీటిల్లో తప్పిదాలను గుర్తించిన విద్యార్థులు ప్రశ్నిస్తే వేరే విభాగం వారు చేసిన తప్పిదమని, తమకు సంబంధం లేదని.. విశ్వవిద్యాలయానికి వచ్చి మాట్లాడుకోవాలని చెబుతున్నారు. తీరా విశ్వవిద్యాలయానికి వచ్చాన తర్వాత వారితో బేరసారాలకు దిగుతుండడంతో విద్యార్థులు విస్తుపోతున్నారు. వంద శాతం కచ్చితత్వంతో చేయాల్సిన పనిని తప్పుగా చేయడమేకాక ఆయా తప్పిదాలను సవరించేందుకు రూ.వేలు వసూలు చేస్తుండడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదుల వెల్లువ

విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలో చదువుకున్న ఓ విద్యార్థిని ప్రొవిజినల్‌ పత్రంలోని తప్పిదాలను సవరించేందుకు విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఏకంగా రూ.30 వేలు డిమాండు చేశారు. దీంతో ఆ విద్యార్థిని వీసీ సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో తీగలాగితే డొంక కదిలినట్లైంది. ప్రొవిజినల్‌ ధ్రువపత్రాలను తప్పుగా ముద్రించి వాటిని సవరించే పేరుతో చాలామంది విద్యార్థుల నుంచి వసూళ్లకు పాల్పడ్డట్లు సమాచారం. ప్రొవిజినల్‌ పత్రాల ముద్రణ ప్రక్రియను కూడా అక్రమార్జనకు ఉపయోగించుకున్నారన్న విషయం ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో కలకలంగా మారింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిందితులకు కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలు ఫిర్యాదు చేసిన విషయం బయటకు పొక్కడంతో ఆమె దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా సవరించి కొత్తవి ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని