logo

పంట నష్టం.. గణన కష్టం

రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీలోగా పంట నష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషన్‌ వెల్లడించింది.

Published : 20 May 2024 01:09 IST

ఈ-పంట నమోదు ఆధారంగా జాబితా

కర్నూలు, నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీలోగా పంట నష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషన్‌ వెల్లడించింది. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆమేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారులకు సూచించారు. కరవు మండలాల్లో 33 శాతానికిపైగా పంటలు దెబ్బతిని, నష్టపోయిన వివరాలను పంటల వారీగా రూపొందించాలని, ఒక్కో రైతుకు 5 ఎకరాలకు మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలా తయారు చేసిన జాబితాలను 25 నుంచి 27వ తేదీ వరకు రైతుభరోసా కేంద్రాల్లో సామాజిక తనిఖీకి ఉంచాలని, తుది జాబితాలను ఈ నెల 31లోగా జిల్లా కలెక్టర్‌ ద్వారా పంపాలని ఆదేశించారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి పంట నష్ట గణన ప్రారంభం కానుంది.

31 కరవు మండలాలు

గత రబీ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌కు ముందు గత మార్చిలో కర్నూలులో 18, నంద్యాలలో 13 కలిపి మొత్తం 31 కరవు మండలాలను ప్రకటించింది. కర్నూలు జిల్లాలో కర్నూలు గ్రామీణం, కర్నూలు అర్బన్, కోడుమూరు, కల్లూరు, ఓర్వకల్లు, గూడూరు, ఆదోని, మంత్రాలయం, ఆలూరు, చిప్పగిరి, ఆస్పరి, హొళగుంద, హాలహర్వి, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, వెల్దుర్తి, సి.బెళగల్‌ మండలాలను ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించింది. నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ, దొర్నిపాడు, నందికొట్కూరు, అవుకు, కోవెలకుంట్ల, మిడుతూరు, సంజామల, ఉయ్యాలవాడ, కొలిమిగుండ్ల, గోస్పాడు, నంద్యాల, బనగానపల్లి, గడివేముల మండలాలను గుర్తించారు. 

తప్పుల సవరణ లేదిక

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రబీ సీజన్‌లో పంట నమోదు చేశారు. అయితే ఆయా వివరాలను రైతుభరోసా కేంద్రాల దగ్గర ప్రదర్శించలేదు. తప్పొప్పులను సరిచేసుకునేందుకు పంటల విస్తీర్ణం, సర్వే నంబరు, ఆధార్‌ నంబరు, పంటల పేరు తదితర వాటిని సరిచేసుకునేందుకు అవకాశం కల్పించినప్పటికీ చాలా మంది రైతులు ఆర్బీకేల్లో జాబితా చూసుకోలేదు. వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించలేదు. తప్పులను సవరించేందుకు అవకాశం లేకపోయింది. చాలా మంది రైతులు శనగలు, మొక్కజొన్న, జొన్న, మినుములు తదితర పంటలను సాగు చేసినప్పటికీ కొందరు పంట నమోదు చేసుకోకపోగా, పంట నమోదైన రైతులకు సంబంధించి కూడా సాగైనవి, నమోదైనవి వేర్వేరుగా ఉన్నాయి. దీంతో వేలాది మంది రైతులు రబీ పంట నష్ట పరిహారం కోల్పోయే ప్రమాదముంది.

క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండానే

ప్రస్తుతం రబీ సీజన్‌ ముగిసి నాలుగైదు నెలలైంది. ప్రస్తుతం పంట పొలాలు ఖాళీగా ఉన్నాయి. పంటలు సాగు చేసినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. రబీలో పంట నమోదు చేసిన డేటా ఆధారంగానే పంట నష్ట గణన చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది కసరత్తు చేయనున్నాయి. వ్యవసాయ శాఖ కార్యాలయాలు, రైతుభరోసా కేంద్రాల్లో కూర్చొని ఈ.పంట నమోదు డేటాతో ఐదెకరాల్లోపు సాగు చేసిన రైతులను గుర్తించనున్నారు. వర్షాధారంగా సాగైన పంటలు, మాగాణి కింద సాగైన పంటల్లో 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం జరిగిన రైతుల వివరాలను సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. పంట నష్టం 33 శాతం కంటే ఎక్కువ జరిగిందా, తక్కువ జరిగిందా అన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో పంటలు లేవు. పంటలు బాగా పండినప్పటికీ.. పంట నమోదు ఆధారంగా నష్టం పరిహారం పొందే వీలుంది. ఖరీఫ్‌లో అత్యధికంగా సాగు చేసి నష్టపోయాం.. అప్పుడు పంట నష్ట పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. పంట నష్ట పరిహారం ఇస్తామంటున్నారు. ఇదెక్కడి న్యాయమని రైతులు రైతుభరోసా కేంద్రాల సిబ్బందిపై వాగ్వాదానికి దిగుతున్నారు.

ఏ పంటకు ఎంత నష్టం

  • నంద్యాల జిల్లాలో 29 మండలాల పరిధిలో రబీ సీజన్‌లో 1,81,118 హెక్టార్ల సాధారణ సాగు కాగా, 1,22,898 హెక్టార్లలో 68 శాతం పంటలు సాగయ్యాయి. 13 కరవు మండలాల్లో అన్ని రకాల పంటలు కలిపి 59,207 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాగా గుర్తించారు.
  • కర్నూలు జిల్లాలో 26 మండలాల పరిధిలో రబీ సీజన్‌లో 1,21,673 హెక్టార్ల సాధారణ సాగు కాగా 94,634 హెక్టార్లలో 77.78 శాతం పంటలు సాగయ్యాయి. 18 మండలాల్లో అన్ని పంటలు కలిపి 70,982 హెక్టార్లలో నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు.
  • ఉమ్మడి జిల్లాలో 31 మండలాల్లో 1,30,189 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు 1,16,912 మంది రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ కింద రూ.128.87 కోట్ల పంట నష్ట పరిహారం అవసరమని రెండు జిల్లాల వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని