logo

గుట్టుగా ఇసుకను తోడేస్తున్నారు

తుంగభద్ర నదిలోని రీచ్‌ల వద్ద ఇసుకను గుట్టుగా తవ్వుతున్నట్లు తేలింది..కౌతాళం మండలం గుడికంబాలి, మరళి రీచ్‌లను ఆదివారం కలెక్టర్‌ సృజన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Published : 20 May 2024 01:16 IST

కలెక్టర్‌ పరిశీలనలో వెలుగులోకి
కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం

గుడికంబాలి ఇసుక రీచ్‌ వద్ద వీఆర్వో, వీఆర్‌ఏలను వివరాలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ సృజన

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: తుంగభద్ర నదిలోని రీచ్‌ల వద్ద ఇసుకను గుట్టుగా తవ్వుతున్నట్లు తేలింది..కౌతాళం మండలం గుడికంబాలి, మరళి రీచ్‌లను ఆదివారం కలెక్టర్‌ సృజన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుడికంబాలి ఇసుక రీచ్‌ వద్ద జేసీబీ, హిటాచీ, ట్రాక్టర్లు తిరిగినట్లు ఆమె గుర్తించారు. ఆకస్మికంగా అధికారులు వస్తున్నట్లు తెలిసిన అక్రమార్కులు ఇసుక రవాణాను ఆపేసి వెళ్లి పోయారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. నదుల్లో ఇసుక తవ్వకాలు ఆపేసినా గుడికంబాలి, మరళి రీచ్‌ల్లో మాత్రం ఆగలేదని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. అనంతరం మరళి గ్రామం వద్దనున్న ఇసుక రీచ్‌ను పరిశీలించారు. ఈ రీచ్‌లో ఏపీ, కర్ణాటక సరిహద్దులో ఇసుకను తవ్వుతున్న కర్ణాటక హిటాచీ యంత్రాన్ని సీజ్‌ చేయాలి.. రీచ్‌ వద్ద 24 గంటలూ కాపలా కాయాలని ఆమె ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

హద్దులు దాటుతున్న కర్ణాటక

మరళి రీచ్‌ పరిధిలో తవ్వకాలు చేస్తున్న కర్ణాటక హిటాచీని సీజ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో అక్కడి అధికారులతో ఆదోని సబ్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మ చర్చించారు. సుమారు నాలుగున్నర గంటల పాటు ఇవి కొనసాగాయి. గతంలో చెప్పినా హద్దులు దాటుతున్నారు.. మరోసారి ఏపీ సరిహద్దులో ఇసుకను తోడితే చర్యలు తీసుకుంటామని సబ్‌ కలెక్టర్‌ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని