logo

అతిసారం.. కలవరం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్‌ 32, మైనర్‌ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

Published : 20 May 2024 01:21 IST

భయపెడుతున్న వరుస ఘటనలు
రామతీర్థంలో మహిళ మృతి
ఇస్వీలో 30 మందికి అస్వస్థత
ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇస్వీ గ్రామస్థులు 

  • బనగానపల్లి మండలం రామతీర్థానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో ఈ నెల 16న మృతి చెందారు.. ఆ గ్రామంలో అతిసారం ప్రబలడంతో 16 మంది అస్వస్థతకు గురయ్యారు.
  • బండిఆత్మకూరు మండలం యర్రగుంట్లలో అతిసారం ప్రబలడంతో గురువారం 16 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
  • తాజాగా ఆదోని మండలం ఇస్వీలో అతిసారం ప్రబలి పదుల సంఖ్యలో గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
  • ఇలా వరుస ఘటనలు పల్లె జనాలను భయపెడుతున్నాయి.. ఆయా గ్రామాల్లో ప్రజలు కలుషిత జలాలు తాగడంతోనే అతిసారం ప్రబలుతున్నట్లు తేలింది.. ఎన్నికల విధుల్లో ఉన్నతాధికారులు ఉండటం.. కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోకపోవడంతో క్లోరినేషన్‌ ప్రక్రియ అటకెక్కింది.. మంచినీటిని శుద్ధిచేయకుండా నేరుగా అందజేస్తున్నారు. లీకేజీలనూ సరి చేయడం లేదు.

కాసుల్లేక బ్లీచింగ్‌ చల్లక

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్‌ 32, మైనర్‌ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆర్థిక సంఘం, సాధారణ, సీనరేజీ నిధులు పంచాయతీలకు ప్రధాన ఆదాయం. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధుల్ని దారి మళ్లించింది. మురుగు కాల్వలను శుభ్రం చేసేందుకు సొమ్ముల్లేవు.. మంచినీటి పైప్‌లైన్ల మరమ్మతులకు పైసల్లేవు.. ఆఖరికి బ్లీచింగ్, ఫాగింగులకూ డబ్బులను వెతుక్కోవాల్సిన దుస్థితిని కల్పించారు. ఏ పని చేయడానికి కూడా సర్పంచుల దగ్గర సరిపడా సొమ్ముల్లేకుండా చేశారు.

నీరు.. తాగలేని తీరు

ఆదోని మండలం ఇస్వీలో అతిసారం ప్రబలడంతో 30 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన మహబూబ్‌బీ, ఇమామ్‌బీ, మాబీ, పార్వతమ్మ, శారదమ్మ, శివ, శశికళ, అంజలి, దూద్‌బీ, ఉసేన్‌బీ, దస్తగిరిమ్మ, రుబీనా, రాజేశ్వరి, రాజు, రంగన్నతో పాటు మరికొందరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మంచినీరు శుద్ధిచేయకుండా సరఫరా చేస్తున్నారు.. రంగుమారిన నీరు తాగడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ మా గ్రామంలో రెండు రోజుల కిందట రంగుమారిన తాగునీరు సరఫరా చేశారు. వాటిని తాగడంతోనే నాతో పాటు కుటుంబంలో ఐదుగురం అస్వస్థతకు గురయ్యామని’’ పార్వతమ్మ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని