logo

గేట్లు ఎత్తలేరు.. తాళ్లు బిగించలేరు

7.10 లక్షల ఎకరాలకు సాగునీరు.. వేలాది పల్లెలకు మంచినీరు అందించే సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణ అటకెక్కింది.. గత కొంతకాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు.

Updated : 20 May 2024 04:26 IST

కాసులు ఇవ్వని ప్రభుత్వం
అధ్వానంగా జలాశయాల నిర్వహణ

కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే : 7.10 లక్షల ఎకరాలకు సాగునీరు.. వేలాది పల్లెలకు మంచినీరు అందించే సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణ అటకెక్కింది.. గత కొంతకాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు.. గేట్లకు రబ్బరు సీళ్లు అమర్చలేని పరిస్థితి నెలకొంది.. నీరంతా లీకేజీ అవుతోంది.. భారీగా వరదొస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.. నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.. ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తున్నా.. అవన్నీ బుట్టదాఖలే అవుతున్నాయి. పోతిరెడ్డిపాడు, బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్, సుంకేసుల బ్యారేజి, వెలుగోడు సమతుల జలాశయం, గాజులదిన్నె ప్రాజెక్టు, అవుకు, గోరుకల్లు జలాశయాల గేట్లు తుప్పు పట్టిపోయాయి.. రోప్స్‌ (తాళ్లు) తెగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి..అయినా ప్రభుత్వం స్పందించడం లేదు.

వెలుగోడు వినేదెవరు

వెలుగోడు జలాశయం ద్వారా కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలో 2.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు వెళ్తోంది. ఇందులో 16.950 టీఎంసీల నీటిని నిల్వ చేసి తెలుగుగంగ కాల్వ ద్వారా తరలిస్తారు. జలాశయానికి సంబంధించి మూడు గేట్లకు రెగ్యులర్‌గా గ్రీజ్, గేర్‌ ఆయిల్‌ సమకూర్చకపోవడంతో మొండికేస్తున్నాయి. ఏటా కనీసం రూ.22 లక్షలు కేటాయిస్తే జలాశయం నిర్వహణ చేసేందుకు అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.

సుంకేసుల విలవిల

సుంకేసుల జలాశయం ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలో 2.75 లక్షల ఎకరాలకు సాగు నీరు, కాల్వ వెంట పలు గ్రామాల దాహార్తి తీర్చుతోంది.. కీలకమైన ప్రాజెక్టుపై ప్రభుత్వం శీతకన్నేసింది.. నిర్వహణకు సంబంధించి రూ.72 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మూడేళ్లుగా విడుదల చేయడం లేదు. రూ.1.65 కోట్ల వరకు విద్యుత్తు బిల్లుల బకాయి ఉంది. నిధుల విడుదల లేకపోవడంతో మరమ్మతులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ఈ ఏడాది జలాశయానికి అవసరమైన రోప్స్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు గుత్తేదారుడిని ప్రాధేయపడి రూ.2.50 లక్షలతో ఏర్పాటు చేశారు. 1.200 టీఎంసీల సామర్థ్యమున్న బ్యారేజీకి 30 ద్వారాలున్నాయి. ఏళ్ల కిందట ఏర్పాటుచేసిన విద్యుత్తు కేబుళ్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంది. నిరంతరం గ్రీజ్, ఆయిల్‌ మార్చుతూ ఉండాలి. ఇక్కడ సీల్‌ రబ్బర్లు సరిగా లేకపోవడంతో గేట్ల నుంచి నిరంతరం నీరు లీకేజీ అవుతోంది. ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వకపోవడంతో ఇంజినీర్లు తమ జేబు నుంచి ఖర్చు చేసే పరిస్థితి నెలకొంది.

ఘోరకల్లు

12.440 టీఎంసీల సామర్థ్యం కలిగిన గోరుకల్లుకు మూడు గేట్లు ఉన్నాయి. వీటిలో రెండే పనిచేస్తుండగా ఒకటి నిర్మాణ దశలోనే నిలిచింది. కొత్త గేటు ఏర్పాటు చేయలేదు.. గత నాలుగేళ్లుగా జలాశయంలో నీటిని నిల్వ చేస్తున్నప్పటికీ నిర్వహణ నిధుల విడుదల కావడం లేదు.


పోతిరెడ్డిపాడైంది

పోతిరెడ్డిపాడు గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయకపోవడంతో ఒక గేట్‌ను పైకిఎత్తలేని పరిస్థితి నెలకొంది.

రాయలసీమ జిల్లాలకు పోతిరెడ్డిపాడు నియంత్రణ వ్యవస్థ ద్వారా కృష్ణా జలాలు తరలిస్తారు. ఇక్కడ 10 గేట్లు ఉన్నాయి. నిత్యం 44 వేల క్యూసెక్కుల వరద జలాలు దిగువకు వెళ్తాయి. బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్, వెలుగోడు జలాశయానికి ఎస్సార్బీసీ ఎస్కేప్‌ ఛానల్‌ ద్వారా నీరు వెళ్తుంది. ఎస్కేప్‌ ఛానల్‌ వద్ద ఏర్పాటుచేసిన గేట్లలో రెండు సరిగా పనిచేయడం లేదు. నిర్వహణ నిధులు రాకపోవడంతో మరమ్మతులు చేయలేని పరిస్థితి. దీంతో నీటి లీకేజీని అరికట్టలేకపోతున్నారు. ఐదు పాత గేట్లకు మరమ్మతులు చేయకపోవడంతో లీకేజీ ఏటేటా పెరుగుతోంది. ఇంజినీర్ల బృందం ఏటా తనిఖీలు నిర్వహించి నివేదికలు అందిస్తోంది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పోతిరెడ్డిపాడు గేట్ల నిర్వహణకు సంబంధించి గతంలో చేసిన పనులకు రూ.52 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పాత బిల్లులు చెల్లిస్తే తప్ప కొత్తగా పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకొచ్చే పరిస్థితి లేదు.


అవుకు అధోగతి

నిర్వహణలేకపోవడంతో తుప్పుపట్టిన అవుకు జలాశయం గేట్లు

4.150 టీఎంసీల సామర్థ్యం కలిగిన అవుకు జలాశయానికి ఏర్పాటు చేసిన ఆరు గేట్లలో రెండు నాలుగున్నర ఏళ్లుగా పనిచేయడం లేదు. వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రూ.1.60 కోట్లతో చేపట్టిన నిర్వహణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ జలాశయం ద్వారా 3,200 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. అవుకు జలాశయం నిర్వహణకు ఏళ్ల తరబడి నిధులు విడుదల కావడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని