logo

సర్వే తప్పులు.. రుణానికి తిప్పలు

భూసర్వేలో జరిగిన తప్పులు రైతులకు శాపంగా మారాయి.. భూహక్కు పత్రాల్లో తప్పులు.. విస్తీర్ణంలో తేడాలు.. ఉమ్మడి హక్కు పత్రాల కారణంగా పంట రుణాల నవీకరణకు బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు.

Published : 20 May 2024 01:30 IST

తగ్గిన రైతుల భూవిస్తీర్ణం
పాసుపుస్తకాల్లో దోషాలు

 పాసు పుస్తకాలు చూపుతున్న రైతులు

భూసర్వేలో జరిగిన తప్పులు రైతులకు శాపంగా మారాయి.. భూహక్కు పత్రాల్లో తప్పులు.. విస్తీర్ణంలో తేడాలు.. ఉమ్మడి హక్కు పత్రాల కారణంగా పంట రుణాల నవీకరణకు బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు. కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులకు రుణాల మంజూరులో ఆటంకాలు తలెత్తుతున్నాయి. రీసర్వే జరిగిన గ్రామాల్లో 1బీ, అడంగళ్‌ పత్రాలకు సంబంధించి గందరగోళం నెలకొంది. ఆయా గ్రామాల్లో కొంత మంది ఖాతాలను అధికారులు లాక్‌ చేశారు. దీంతో అన్నదాతలు బ్యాంకు రుణాల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వీఆర్వో, తహసీల్దార్‌ కనికరిస్తే తప్ప రుణాలందే పరిస్థితి కనిపించడం లేదు.

కర్నూలు వ్యవసాయం, న్యూస్‌టుడే

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2020 డిసెంబరులో భూముల రీసర్వే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2023 డిసెంబరు నాటికి 914 రెవెన్యూ గ్రామాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో కలిపి 481 గ్రామాల్లో పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా 289 గ్రామాల్లోనే పూర్తి చేశారు. 192 రెవెన్యూ గ్రామాల్లో అంతా అసంపూర్తిగా.. హడావుడిగా చేశారనే విమర్శలున్నాయి. కర్నూలు జిల్లాలో 247 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. మొదటి విడతలో 35,000, రెండో విడతలో 16,050, మూడో విడతలో 18,029 కలిపి మొత్తం 69,079 మంది భూహక్కు పత్రాలు అందజేశారు. మూడో విడతలో 160 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని చెబుతున్నా 15 గ్రామాల రైతులకు పత్రాలు రాలేదు. 

ఉమ్మడి పత్రం.. చిక్కులు అనేకం

పాణ్యం మండలం బలపనూరులో ఎల్‌పీఎం నంబరు 157లో 11.11 ఎకరాలు ఉమ్మడిగా ఉన్నట్లు నమోదు చేశారు. ఇందులో తొమ్మిది మంది రైతులు ఉన్నట్లు చూపించారు. ఇందులో ఎవరికి ఎంత పొలం ఉందనే విషయాన్ని నమోదు చేయలేదు. పొలం మొత్తం ఉమ్మడిగా ఉన్నట్లు చూపడంతో బ్యాంకులో పంట రుణాలకు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆరేడు వేల మంది రైతులకు ఉమ్మడి హక్కు పత్రాలు ఇచ్చారు. వీరంతా పంట రుణాలకు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి హక్కు పత్రాలు పొందిన రైతులు మళ్లీ తమకు వ్యక్తిగతంగా సర్వే సబ్‌ డివిజన్‌ చేసి విడివిడిగా హక్కు పత్రాలను ఇవ్వాలని ముందుగా తహసీల్దార్‌కు, మండల సర్వేయర్‌కు విన్నవించుకోవాలి. ఆ తర్వాత రెవెన్యూ డివిజనల్‌ అధికారుల సమక్షంలో విచారణ, అటు నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్, చివరగా జిల్లా కలెక్టర్‌ ఆమోదంతో విడివిడిగా ఇస్తారు.

అడంగళ్‌కు తిప్పలు

రీసర్వే జరిగిన గ్రామాల్లో ఇప్పటికీ కొంత మంది రైతులకు 1బీ, అడంగళ్‌ పత్రాలు ఆన్‌లైన్‌లో రావడం లేదు. దీంతో మీ భూమిలో పత్రాలను జిరాక్స్‌ తీసుకుని రుణాల నవీకరణ (రెన్యువల్‌)కు వెళ్తున్నారు. వాటిని బ్యాంకర్లు అంగీకరించడం లేదు. వీఆర్వో, తహసీల్దార్‌ సంతకాలు కావాలంటున్నారు. జాయింట్‌ ఖాతాలున్న రైతులకు అభ్యంతరం చెబుతున్నారు. రెవెన్యూ అధికారుల సంతకాలు ఉంటే తప్ప రుణాల నవీకరణ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొత్తగా నియమితులైన తహసీల్దార్లు కొందరు సంతకాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు.

పొలం తగ్గింది.. రుణం పోయింది

సాధారణంగా బ్యాంకులు ఏటా పంట రుణాల పరిమితిని పెంచుతాయి. గతేడాది ఎకరానికి రూ.30 వేలు ఇచ్చిన రైతుకు ఈ ఏడాది రూ.40 వేల వరకు ఇచ్చే అవకాశం ఉంది. అంటే గతేడాది రుణానికి సంబంధించి వడ్డీ చెల్లిస్తే అదనంగా రావాల్సిన మొత్తాన్ని బ్యాంకర్లు తిరిగిస్తారు. రీసర్వే జరిగిన గ్రామాల్లోని రైతులకు ఇచ్చిన భూహక్కు పత్రాల్లో చాలా మందికి విస్తీర్ణంలో సెంటు నుంచి 0.50 ఎకరం, ఒక ఎకరం, 1.50 ఎకరాలు, రెండెకరాలు  అంతకుపైగా భూవిస్తీర్ణాన్ని కోల్పోయిన పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి రైతులకు గతేడాది రుణానికి వడ్డీలు చెల్లించడం తప్ప తిరిగి బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి అవకాశం లేకుండాపోయింది.

తిరస్కరిస్తున్న బ్యాంకర్లు

భూవివాదాల శాశ్వత పరిష్కారానికి రీసర్వే చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. వివాదాలు పరిష్కారం కాకపోగా.. మరింత పెరిగాయి. సరైన శిక్షణ లేకుండానే సిబ్బందిని క్షేత్ర స్థాయికి పంపించడంతో చాలాచోట్ల తప్పులు దొర్లాయి. కొందరు క్షేత్ర స్థాయికి వెళ్లకుండానే రీసర్వే పూర్తి చేశారు. దస్త్రాల స్వచ్ఛీకరణపై దృష్టి సారించలేదు. కొత్తగా జారీ చేసిన భూహక్కు పత్రాల్లో పేర్లు, విస్తీర్ణం తదితర వివరాలు తప్పుగా ముద్రించారు. పాత పట్టాదారు పాసుపుస్తకాల్లో విస్తీర్ణం, కొత్త వాటిలో నమోదు చేసిన దానికి వ్యత్యాసం ఉండటంతో రైతులు పాసుపుస్తకాలు వెనక్కి ఇచ్చేశారు. వాటిని ఇప్పటికీ సరిదిద్దలేదు. ఒకే సర్వే నంబరుపైనున్న రైతులకు జాయింట్‌ పాసుపుస్తకాలు ఇచ్చారు. వేర్వేరు సర్వే నంబర్లకు ఒకే భూహక్కు పత్రాలు ఇచ్చినవి అనేకం ఉన్నాయి. నలుగురు, ఐదుగురు రైతులకు కలిపి ఒకే పాసుపుస్తకం జారీ చేశారు. అలాంటి వారికి రుణాల నవీకరణ (రెన్యువల్‌)కు బ్యాంకులు ఒప్పుకోవడం లేదు. రెవెన్యూ అధికారుల సంతకాలు పెట్టించుకు రావాలని వెనక్కి పంపుతున్నారు.

ఎకరం పొలం మాయం : బాలన్న 

చక్కరాళ్ల గ్రామంలోని 117 సర్వే నంబరులో ఆరెకరాల పొలం ఉండగా.. భూసర్వేలో ఎకరం పొలం మాయమైంది. ఐదెకరాలే అండగళ్‌లో చూపుతోంది. నా భార్య లక్ష్మీదేవికి చెందిన పొలం 1బీ రావటం లేదు. దీంతో బ్యాంకు రుణం నవీకరణ నిలిచిపోయింది. మూడు రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోవటం లేదు. ఇక్కడకు వస్తే డిజిటల్‌ సంతకానికి సంబంధించి సర్వర్‌ బిజీ అని చెబుతున్నారు.

ఎకరానికిపైగా తగ్గించారు

చక్కరాళ్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని 445-1, 445-2 సర్వే నంబరులో 4.93 ఎకరాలు ఉండాల్సిన భూమి సర్వే తర్వాత 3.50 ఎకరాలు మాత్రమే చూపించారు. మిగతా భూమి సంగతి ఎవరూ చెప్పడం లేదు. ఉన్న భూమికైనా 1బీ రావడం లేదు. బ్యాంకులో రుణ నవీకరణ నిలిచిపోయింది. వారం రోజులుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా, ఎవరూ పట్టించుకోవటం లేదు.

ఉప్పరి నారాయణమ్మ, పత్తికొండ

రూ.50 వేలు తిరిగి చెల్లించమంటున్నారు

పాసుపుస్తకంలో 6.39 ఎకరాలు ఉందని గతేడాది రూ.1.50 లక్షల రుణం తీసుకున్నా. ప్రస్తుతం కేవలం 3.84 ఎకరాలే చూపుతోంది. మిగతా 2.10 ఎకరాలకు 1బీ రావటం లేదు. దీంతో గతేడాది తీసుకున్న రుణానికి వడ్డీ, అప్పులో రూ.50 వేలు తిరిగి చెల్లించాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే రుణం నవీకరణ గడువు తేదీ ముగిసింది. వచ్చే ఏడాదికి వడ్డీ రాయితీ వర్తించే అవకాశం ఉండదు. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.

లింగన్న, పత్తికొండ

బ్యాంకు అధికారుల ఒత్తిడి 

నాలుగెకరాల పొలం ఉందని గతేడాది రూ.లక్ష రుణం తీసుకున్నా. ఈ ఏడాది రుణం నవీకరణలో భాగంగా వడ్డీ చెల్లించా. ప్రస్తుతం 3.49 ఎకరాలు మాత్రమే చూపడంతోపాటు 1బీ రాకపోవటంతో అప్పు మొత్తం చెల్లించి మీ పాసుపుస్తకాలు మీరు తీసుకెళ్లాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అప్పు చెల్లించాలా? ఈ ఏడాది ఖరీఫ్‌నకు విత్తనాలు, ఎరువులు సమకూర్చుకోవాలా? అనేది దిక్కు తోచడం లేదు. 1బీ సమస్య అధికారులు పరిష్కరించకపోతే రైతులకు మరిన్ని ఇబ్బందులు తప్పవు.

రంగస్వామి, పందికోన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని