logo

ఇద్దరు మహిళలది హత్యే

కర్నూలు మండలం గార్గేయపురం నగరవనం చెరువులో మహిళల మృతికి సంబంధించిన మిస్టరీకి దాదాపు తెరపడింది. ఈనెల 19న చెరువులో ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు, గట్టున మరో మహిళ మృతదేహం బయటపడిన సంగతి విదితమే.

Published : 21 May 2024 01:56 IST

మరో కేసులో కానరాని పురోగతి

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు మండలం గార్గేయపురం నగరవనం చెరువులో మహిళల మృతికి సంబంధించిన మిస్టరీకి దాదాపు తెరపడింది. ఈనెల 19న చెరువులో ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు, గట్టున మరో మహిళ మృతదేహం బయటపడిన సంగతి విదితమే. కర్నూలు రేంజి డీఐజీ విజయరావు, ఎస్పీ కృష్ణకాంత్‌ సైతం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు కోసం మూడు బృందాలను రంగంలోకి దింపారు. అదే రోజు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు శవపరీక్ష చేయించారు. శరీర అవయవాలను ల్యాబ్‌కు పంపారు. ఇద్దరు మహిళల్లో ఒకరు తెలంగాణ రాష్ట్రం.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలం అభంగపట్నానికి చెందిన జానకిగా గుర్తించారు. ఆమె భర్త మహేష్‌ అని తెలుసుకున్న పోలీసులు అతనికి సమాచారం ఇచ్చి రప్పించారు. మరొకరు అరుణగా గుర్తించినా కుటుంబసభ్యుల వివరాలపై స్పష్టత రాలేదు. కర్నూలు ఆర్టీసీ బస్టాండు పరిసరాల్లో వ్యభిచార వృత్తిలో ఉన్న పలువురు మహిళలను విచారించటంతో వీరి వివరాలు వెలుగుచూశాయి. కర్నూలుకు చెందిన బాషా అనే ఆటో డ్రైవర్‌తో అరుణ గొడవపడి కొట్టించినట్లు తెలిసి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతను కక్షగట్టి నమ్మించి వారిని చెరువు వద్దకు తీసుకెళ్లి నీళ్లలోకి తోసి హత్య చేసినట్లు తెలిసింది. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి. గట్టున లభ్యమైన మరో మహిళ విషయంలో ఎలాంటి పురోగతి లేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని