logo

ఊరూరా మద్యం.. ఘర్షణలు నిత్యం

ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న గొలుసు దుకాణాలు గొడవలకు ఆజ్యం పోస్తున్నాయి. సారా, అక్రమ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మద్యంబాబుల మధ్య చిన్నపాటి ఘర్షణలు.

Published : 21 May 2024 02:12 IST

దాడులు తగ్గించిన అధికారులు
జనంలో భయాందోళన

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న గొలుసు దుకాణాలు గొడవలకు ఆజ్యం పోస్తున్నాయి. సారా, అక్రమ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మద్యంబాబుల మధ్య చిన్నపాటి ఘర్షణలు.. చివరికి హత్యాయత్నం, హత్యలు వంటి పరిస్థితులకు దారితీస్తున్నాయి. డోన్‌ నియోజకవర్గ పరిధిలోని ఉంగరానిగుండ్లలో మద్యం కారణంగా డిసెంబరు 31న ఓ వ్యక్తి హత్యకు గురైన సంగతి విదితమే. వైకాపా నాయకుల అండదండలతో గొలుసు దుకాణాలు నిర్వహించడంతో పోలీసు అధికారులు పెద్దగా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు చాలాకాలం నుంచి దాడులు చేస్తున్నా ఎలాంటి ఫలితం కానరావడం లేదు. ఫలితంగా పల్లెల్లో పరిస్థితులు చేజారుతున్నాయి. 

వర్గాలుగా విడిపోయి..

ఉమ్మడి జిల్లాలో ఇటీవల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ముందు వరకు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో గొడవలు ప్రారంభమయ్యాయి. అధిక శాతం ప్రజలు వర్గాలుగా విడిపోయారు. ఎన్నికల రోజున పలు గ్రామాల్లో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణలు జరిగాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఓర్వకల్లు మండలం నన్నూరులో ఇరువర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. అధికార బలంతో వైకాపా వర్గీయులు దౌర్జన్యాలకు తెగబడ్డారు. నంద్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. బనగానపల్లి, ఆళ్లగడ్డ, పాణ్యం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల ప్రజలు జూన్‌ 4న వెల్లడికానున్న ఎన్నికల ఫలితాలపై భయాందోళన చెందుతున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని 77 ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామాల ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది. 

మొక్కుబడిగా దాడులు

ఉమ్మడి జిల్లాలో 180 సారా ప్రభావిత ప్రాంతాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచడంతో పలువురు మందుబాబులు సారాకు అలవాటు పడ్డారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో సారా అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గొలుసు దుకాణాల్లో ఏపీ మద్యంతోపాటు కర్ణాటక, తెలంగాణ, గోవా రాష్ట్రాల మద్యం అమ్ముతున్నారు. ఎన్నికల సందర్భంగా 13 చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినా ఉమ్మడి జిల్లాలో మద్యం ఏరులై పారింది. ఎన్నికలు ముగియటంతో పోలీసులు, సెబ్‌ అధికారులు అక్రమ మద్యంపై దాడులు తగ్గించారు. నాటుసారా, అక్రమ మద్యంపై మొక్కుబడిగా దాడులు చేస్తూ మమ అనిపిస్తున్నారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించటం లేదు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు పోలీసులు నిరంతరం దాడులు కొనసాగించాల్సిన అవసరం ఉంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని