logo

ధీమా ఇవ్వని బీమా

వన నిర్మాణ రంగంలోని కార్మికులు ఏ రోజుకారోజు కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. ఎక్కువ మంది ఈ రంగంలోనే ఉపాధిని పొందుతున్నారు. ఈ జీవనయానంలో ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యం వల్ల చనిపోయినా, ఇతర కారణాల వల్ల వైకల్యం పొందినా.

Published : 21 May 2024 02:19 IST

కార్మికులకు కానరాని అభయం
2020 నుంచి సాయం శూన్యం

 కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే పనికి వస్తున్న సంక్షేమ బోర్డు కార్డు  

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: భవన నిర్మాణ రంగంలోని కార్మికులు ఏ రోజుకారోజు కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. ఎక్కువ మంది ఈ రంగంలోనే ఉపాధిని పొందుతున్నారు. ఈ జీవనయానంలో ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యం వల్ల చనిపోయినా, ఇతర కారణాల వల్ల వైకల్యం పొందినా..ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. స్వేదాన్ని చిందించి సంపాదించిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా మారుతున్న నేడు ఏదైనా జరగరానిది జరిగి నష్టం కలిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం సకాలంలో స్పందించడం లేదు. భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయి. వారి సంక్షేమానికి ప్రత్యేక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. నాలుగేళ్లుగా ఈ బోర్డు కేవలం పేరుకే పరిమితమైంది తప్ప కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడటం లేదు. 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు అందకపోవడంతో కార్మికులకు ఒక్క పైసా కూడా కష్టకాలంలో చెల్లించలేని దుస్థితి నెలకొంది. 

1.40 లక్షల మంది సభ్యులున్నా.. సాయం సున్నా

భవన నిర్మాణ రంగంలోని మేస్త్రీలు, స్లాబ్‌ వర్కర్లు, వడ్రంగి, ఎలక్ట్రీషియన్లు, పాలిష్‌ కట్టింగ్‌ వర్కర్లు, పెయింటర్లు, పీవోవీ వర్కర్లు ఇలా 62 విభాగాలకు చెందిన వారు ఉమ్మడి జిల్లాలో 1.40 లక్షల మంది కార్మికులు కార్మిక సంఘంలో సభ్యులుగా ఉన్నారు. వారంతా రూ.110 చొప్పున బీమా చెల్లించి సభ్యులుగా చేరారు. వారు బీమా కోసం చెల్లించిన మొత్తమే రూ.15 కోట్ల వరకు ఉంది. బీమా చెల్లించిన కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5.20 లక్షలు, సాధారణ మరణానికి రూ.80 వేలు, శాశ్వత వైకల్యానికి రూ.5 లక్షలు, పిల్లల కాన్పులకు రూ.20వేలు (రెండు కాన్పులకు), వైకల్యం, అనారోగ్యం బారిన పడి పనిచేయలేని కార్మికులకు రోజుకు రూ.200 చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.3వేలు, చికిత్సకు రూ.9వేలు చెల్లించాలి. గత ప్రభుత్వ హయాంలో బీమా సొమ్ము సక్రమంగానే అందేది. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక విక్రయాల నిషేధంతో భవన నిర్మాణ రంగంలోని కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధికి దూరమయ్యారు. మరోవైపు 2020లో కొవిడ్‌ మహమ్మారి విజృంభణతో ఈ రంగం కుదేలైంది. ఇలాంటి సమయంలో కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొందరు కొవిడ్‌తో మృతి చెందారు. కష్టాల్లో ఉన్న కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న రూ.1950 కోట్ల బీమా సొమ్మును సొంత అవసరాలకు మళ్లించింది. కార్మికులు మరణించినా, గాయపడినా, రోగాలబారిన పడ్డా, పిల్లల వివాహాలకు, ప్రసవాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. వైఎస్‌ఆర్‌ బీమా కింద సాయం పొందని వారికి మాత్రమే తాము సాయం చేస్తామని సంక్షేమ బోర్డు అంటోంది. 


రుద్రవరం మండలం నరసాపురానికి చెందిన ఇమామ్‌ 30 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. ఆళ్లగడ్డకు చెందిన తాపీమేస్త్రీల సంఘం మృతుడి కుటుంబానికి సొంతంగా రూ.10 వేల ఆర్థికసాయం అందించింది. దాతలు స్పందించినా ప్రభుత్వం స్పందించలేదు.


ఈ ఏడాది మార్చి 30న తాపీమేస్త్రీ డి.రాజాహుస్సేన్‌(30) దొర్నిపాడులో భవన నిర్మాణంలో భాగంగా సెంట్రింగ్‌ పనులు చేస్తుండగా విద్యుత్తు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. ఆయనపై ఆధారపడిన కుటుంబం దిక్కులేనిదయ్యింది.


గతేడాది జూన్‌లో ఆళ్లగడ్డ మండలంలోని జి.జంబులదిన్నెకు చెందిన సయ్యద్‌ బాషా భవన నిర్మాణ పనులు చేస్తూ గోడపై నుంచి కింద పడి మృతి చెందారు. పెద్దదిక్కుగా ఉన్న ఆయన చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. భవన నిర్మాణ కార్మికుడిగా 22 ఏళ్లుగా పనిచేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీసం మట్టిఖర్చులకు కూడా ఆర్థిక సాయం అందకపోవడం బాధాకరం.


మాకు మేమే సాయం చేసుకుంటున్నాం 
-షాకీర్, విద్యుత్తు కార్మికుల సంఘం కార్యదర్శి

గత కొన్నేళ్లుగా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా సాయం అందుతుందన్న ఉద్దేశంతో ఆళ్లగడ్డలో మా సంఘం తరఫున 80 మందితో రూ.110 చెల్లించి బీమా చేయించాం. ఎలాంటి సాయం అందడం లేదు. మా సంఘంలోని సభ్యులు ఎవరైనా ప్రమాదానికి గురైతే మేమే తలా కొంత పోగు చేసుకుని బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని