logo

ఉద్యోగుల భవన్‌ అమ్మేశారు.. నాలుగో తరగతి వేతనజీవుల ఆందోళన

ఉద్యోగుల సంక్షేమం నిమిత్తం 40 ఏళ్ల కిందట మూడు సెంట్లు కేటాయించారు. అక్కడ నాలుగో తరగతి ఉద్యోగులు భవనం నిర్మించారు. ఏళ్లుగా అక్కడే సభలు, సమావేశాలు నిర్వహించుకొంటున్నారు.

Updated : 21 May 2024 07:23 IST

భవనాన్ని కూల్చివేస్తున్న జేసీబీ 

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : ఉద్యోగుల సంక్షేమం నిమిత్తం 40 ఏళ్ల కిందట మూడు సెంట్లు కేటాయించారు. అక్కడ నాలుగో తరగతి ఉద్యోగులు భవనం నిర్మించారు. ఏళ్లుగా అక్కడే సభలు, సమావేశాలు నిర్వహించుకొంటున్నారు. స్థిరాస్తి వ్యాపారులకు మేలు చేసేందుకు భవనాన్ని అమ్మేశారు.. రూ.1.5 కోట్ల విలువైన డీపట్టా స్థలం విక్రయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఉద్యోగుల సంఘం అవసరాల నిమిత్తం ప్రభుత్వం స్థలం కేటాయిస్తే స్వప్రయోజనాల కోసం కొందరు ఉద్యోగులు ఇతరులకు విక్రయించడం వివాదాస్పదంగా మారింది. 

రూ.80 లక్షలకు బేరం

నంద్యాల పట్టణం టెక్కె ప్రాంతంలో ప్రస్తుతం సెంటు స్థలం రూ.50 లక్షలు పలుకుతోంది. తహసీల్దారు కార్యాలయం ప్రాంతంలో ఉన్న ఉద్యోగుల భవన్‌ వెనుక ప్రైవేటు వ్యక్తులకు స్థలం ఉంది. దానికి విలువ రావాలన్నా.. అందులో ఏవైనా నిర్మాణాలు చేపట్టాలన్నా ఉద్యోగుల భవనం అడ్డుగా ఉంది. దాన్ని తొలగించుకోవడానికి ప్రైవేటు స్థలం వ్యక్తులు చాలా కాలం నుంచి యత్నించారు. భవనాన్ని ఖాళీ చేస్తే మరో చోట స్థలం కేటాయిస్తామని మొదట చెప్పారు.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు.. చివరకు నూతన కార్యవర్గం ఏర్పాటైన తర్వాత ఏకంగా భవనంతో సహా ఈ స్థలాన్ని అమ్మేశారు. రూ.80 లక్షల వరకు చేతులు మారినట్లు తెలుస్తోంది. కొనుగోలు చేసిన వ్యక్తులు భవనం కూల్చివేస్తున్నారు. పని పూర్తికాగానే వెనుకున్న స్థలానికి రహదారి ఏర్పాటు చేసుకుని ఇందులో పెద్ద వాణిజ్య సముదాయాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.

దుకాణందారుల ఆందోళన

నంద్యాల పట్టణంలో 2017లో రహదారుల విస్తరణ చేపట్టారు. అప్పట్లో భవనాన్ని కొంతమేర కూల్చారు. అందుకు నష్ట పరిహారం కింద ప్రభుత్వం రూ.18 లక్షల పరిహారం ఇచ్చింది. ఆ మొత్తాన్ని ఉద్యోగుల సంఘానికి అందజేశారు. ఆ తర్వాత భవనాన్ని ఆధునికీకరించారు. కింద దుకాణ గదులు నిర్మించి పైఅంతస్తులో జిల్లా ఉద్యోగుల భవన్‌ను ఏర్పాటు చేశారు. దుకాణాలను అద్దెకు ఇచ్చారు. మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నాం.. ప్రస్తుతం కూల్చి వేస్తున్నారు.. తమ పరిస్థితేంటని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముగ్గురు ముందుండి నడిపారు

ఉద్యోగుల భవన్‌ విక్రయం వెనుక కొంత మంది వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందుగానే కార్యవర్గంతో సంతకాలు చేయించుకున్నారు. ఇందులో ముగ్గురు ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. 40 ఏళ్ల కిందట స్థలాన్ని కేటాయించే సమయంలో ప్రభుత్వం నుంచి ఉచితంగా భూమిని తీసుకోలేదని.. అప్పటి మార్కెట్‌ విలువ ప్రకారం కొనుగోలు చేశామనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై కార్యవర్గానికి సర్వహక్కులు ఉన్నాయని, కమిటీ సభ్యుల అంగీకారంతోనే విక్రయించినట్లు దస్త్రాలు తయారు చేశారు. ఆ తర్వాత విక్రయించారు. క్రయవిక్రయాలన్నీ కొంతమంది వ్యాపారుల కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని