logo

తుంగభద్రలో మారీచ్‌లపై నిఘా

గత నాలుగేళ్లుగా తుంగభద్రలో ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టారు.. ఇసుకాసురులు పెద్ద ఎత్తున ఇసుకను తరలించారు.. వారికి ‘అధికార’ పార్టీ అండదండలు ఉండటంతో నదిలో రాజ్యమేలారు.. అధికారులూ అటు వైపు వెళ్లలేదు..

Published : 21 May 2024 02:26 IST

రెండు రోజులుగా కలెక్టర్‌ తనిఖీ
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే 

సి.బెళగల్‌: కె.శింగవరంలో ఇసుక రీచ్‌లో పరిశీలిస్తున్న కలెక్టర్‌ డా.జి.సృజన

త నాలుగేళ్లుగా తుంగభద్రలో ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టారు.. ఇసుకాసురులు పెద్ద ఎత్తున ఇసుకను తరలించారు.. వారికి ‘అధికార’ పార్టీ అండదండలు ఉండటంతో నదిలో రాజ్యమేలారు.. అధికారులూ అటు వైపు వెళ్లలేదు.. తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అధికారుల్లో కదలిక వచ్చింది.. తుంగభద్ర తీరంలో ఇసుక రీచ్‌లను గత రెండు రోజులుగా కలెక్టర్‌ డా.సృజన పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ఇసుక అక్రమ రవాణా వివరాలు సేకరించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు కలెక్టర్‌ డా.జి.సృజన గత రెండు రోజులుగా ఇసుక రీచ్‌లను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. కౌతాళం మండలంలోని గుడికంబాళి, మరళి గ్రామాల్లో ఆదివారం పరిశీలించారు. సి.బెళగల్‌ మండలంలోని కె.సింగవరం, ఈర్లదిన్నె, ముడుమాల, పల్దొడ్డి గ్రామాల్లోని ఇసుక రీచ్‌లను ఆమె సోమవారం తనిఖీ చేశారు. ఆయా ప్రాంత గ్రామస్థులు, గొర్రెల కాపరులతో మాట్లాడారు. ఎంతకాలం నుంచి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.. లారీలు, టిప్పర్లలో అక్రమ రవాణా జరుగుతోందా.. ప్రస్తుతం ఏమైనా తవ్వకాలు చేస్తున్నారా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇసుక తవ్వకాలు.. అక్రమంగా రవాణా చేసిన ఆనవాళ్లను గుర్తించారు. రీచ్‌ల్లో ఎంతమేర ఇసుక తవ్వకాలు జరిగాయో నివేదికలివ్వాలంటూ మైనింగ్‌ అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్‌లో టాటా ఇటాచీ ఎందుకుందని ఆరా తీశారు. పొక్లెయిన్లు తదితర వాహనాలను బయటకు పంపాలని ఆదేశించారు.


సీసీ కెమెరాలు తప్పనిసరి

  • ఇసుక తవ్వకాలను ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకు ఇసుక రీచ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సదరు ప్రదేశంలో నిర్ణీత సమయంలోనే ఇసుక సేకరించాలి. లారీలు, టిప్పర్లు, పొక్లెయిన్లు వెళ్లే దారిలోనూ సీసీ కెమెరాలు ఉండాలి. నిబంధనలకు విరుద్దంగా లారీలో అధికంగా ఇసుక తరలించకూడదు. అలా తరలిస్తే సంబంధిత లారీలపై చర్యలు తీసుకొని జరిమానా విధించాల్సి ఉంటుంది.
  • పోలీసు, రెవెన్యూ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని.. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినా కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వాహనాలను సీజ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.
  • పల్దొడ్డి గ్రామ నది తీరంలోని ఇసుక రీచ్‌లో మోటార్లు ఉండటాన్ని గమనించిన కలెక్టర్‌.. వాల్టా చట్టం ప్రకారం మోటార్ల ద్వారా నీటిని తోడేయడం చట్ట విరుద్ధమన్నారు. వెంటనే మోటార్లను తొలగించాలని సి.బెళగల్‌ తహసీల్దారును ఆదేశించారు.

సుప్రీంకోర్టు ఆగ్రహంతో కదలిక

ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశించినా చర్యలు తీసుకోకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో పోలీసులు, మైనింగ్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులతో కమిటీలు ఏర్పాటుచేసి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపేయాలని ఆదేశించింది. ఈ కమిటీలోని అధికారులు ప్రభుత్వ అధికారుల్లాకాక సుప్రీంకోర్టు నియమించిన అధికారుల్లా వ్యవహరించి ఇసుక అక్రమాలపై కఠినచర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని